శిల్పారామం ఎదురుగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫుడ్‌జోన్
గచ్చిబౌలి: నో ప్లాస్టిక్, నో వెండింగ్ నినాదంతో జీహెచ్‌ఎంసీ అధికారులు వినూత్న ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. హైటెక్‌సిటీలో టౌన్ వెండింగ్ కమిటీ ప్రకటించిన రెడ్‌జోన్‌లో వీధి వ్యాపారుల కోసం దాదాపు రూ.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫుడ్‌జోన్‌లో 50 స్టాళ్లు నెలకొల్పారు. వ్యాపారులను బృందాలుగా చేసి స్టాళ్లను అప్పగించారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ అందించనున్నారు. షీ టాయిలెట్లు, స్టోన్ బెంచీలు, టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఆకర్షించేలా ఫుడ్ సంబంధిత పెయింటింగ్స్ వేశారు. స్టాళ్లలో ఆహారాన్ని తయారు చేసే వారికి జీహెచ్‌ఎంసీ ఫుడ్‌సేఫ్టీ సర్టిఫికెట్ ఇవ్వనున్నారు.
రెడ్ జోన్ ఇదే....
చందానగర్ సర్కిల్–21 పరిధిలోని మాదాపూర్‌లోని నీరూస్ నుంచి కొత్తగూడ జంక్షన్‌కు కుడివైపు, మెటల్ చార్మినార్ కమాన్ నుంచి న్యాక్ గేట్ వరకు రెండు వైపుల రెడ్ జోన్‌గా ప్రకటించారు. రోడ్లపై వీధి వ్యాపారులు ఉండరాదని.. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడోద్దనే నినాదంతో రెడ్ జోన్ పరిధిలో శిల్పారామం ఎదురుగా అండర్ పాస్ పక్కన ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్‌ను ఏర్పాటు చేశారు.
మాదాపూర్‌లోని ఫుడ్ జోన్‌లో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్స్‌తదితర సౌకర్యాలు
స్టాళ్ల అలాట్‌మెంట్..
మాదాపూర్‌లోని ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఇప్పటికే 47 మంది వ్యాపారులకు అప్పగించారు. హైదరాబాద్, ఇండియన్, ఇటాలియన్, చైనీస్ వంటకాలు అందుబాటులో ఉంటాయి. ఒకటో నెంబర్ స్టాల్‌లో మొక్కజొన్న పిండితో చేసిన ప్లేట్స్, గ్లాసులు, స్పూన్‌లు, కంటెయినర్స్ విక్రయిస్తారు. ఇవి వాడిన తరువాత నీటిలో వేస్తే కరిగిపోతాయి. రెండో నెంబర్ స్టాల్‌లో కాటన్ బ్యాగ్స్, జ్యూట్ బాగ్స్, పేపర్ బ్యాగ్స్ అందుబాటులో ఉంటాయి. సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఉత్పత్తులు ఇక్కడ నిషేధం. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు ఫుడ్ జోన్ తెరిచి ఉంటుంది. ప్రతి ఒక్కరూ నెలకు మెయింటెనెన్స్ రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్, నీటి వసతి జీహెచ్‌ఎంసీ కల్పిస్తోంది.
సోలార్ ప్యానెల్స్ ..
ఫుడ్ జోన్‌లో 6 కేవీ కెపాసిటీ కల్గిన రెండు చోట్ల సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఫుడ్ జోన్‌కు విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు. స్టాళ్లకు ఎదురుగా రాతి బెంచీలు, టేబుల్స్ ఏర్పాటు చేయగా సోలార్ ప్యానెల్స్ వద్ద గ్రీనరీతో పాటు టాయిలెట్లు సిద్ధంగా ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment