ఇది ఈశాన్య రాష్ట్రాల మహిళల విజయం. వారు ప్లాస్టిక్, ఇతర ఫైబర్‌లకు ప్రత్యామ్నాయంగా వెదురును ఉపయోగిస్తున్నారు. సంప్రదాయ లాంగ్‌పై పోటరీని క్యాండిల్ తయారీకి మలుచుకున్నారు. పంటను నిల్వచేయడానికి కరెంటుతో పని లేని ప్రత్యామ్నాయాన్ని కనుక్కున్నారు. తమ దగ్గర దొరికే వస్తువులను అది కూడా పర్యావరణహితమైన వస్తువులు, వాడి పారేసిన తర్వాత త్వరగా మట్టిలో కలిసిపోయే వస్తువులతో మోడరన్ లైఫ్‌స్టయిల్‌ని ఎకో ఫ్రెండ్లీగా మారుస్తున్నారు.
నాటి కుండల్లో నేటి క్యాండిల్..
మణిపూర్ రీజియన్‌లో విస్తరించిన హస్తకళలలో లాంగ్‌పై ఒకటి. నల్లటి మట్టితో కుండల తయారీ అన్నమాట. రిన్‌ఛోన్ అనే మహిళ లాంగ్‌పై కళను మోడరన్ లైఫ్‌స్టయిల్‌కి అనుగుణంగా మలుచుకుంది. పరిమళాలను వెదజల్లే సోయా వ్యాక్స్ క్యాండిల్ జార్‌లు తయారు చేసింది. పారాఫిన్ వ్యాక్స్‌కు బదులుగా సోయా వ్యాక్స్‌ను ఉపయోగిస్తోందామె. సువాసన కోసం పర్యావరణానికి ఏ మాత్రం హానికరం కాని వస్తువులనే వాడుతోంది. ఆ ఉత్పత్తులన్నీ పర్యావరణహితమైనవే కావడంతో వీటికి ప్రత్యేకమైన ఆదరణ లభిస్తోంది.
ఇలాంటి ప్రయోగాలను చేస్తోన్న రిన్‌ఛోన్ వెంచర్ ‘అక్టోబర్ పంప్‌కిన్’ను రాజస్థాన్‌లోని బిట్స్ పిలానీ విద్యాసంస్థ ‘ఉమెన్‌ప్రెన్యూర్ ఫర్ భారత్ 2.0 పప్రోగ్రామ్’ కింద 15 లక్షల ప్రోత్సాహకానికి ఎంపిక చేసింది. తాంగ్‌ఖుల్ ఆదివాసీ తెగకు చెందిన రిన్‌ఛోన్ తన కుటుంబంలో మాత్రమే కాదు, ఆ తెగలోని తొలితరం ఎంటర్‌ప్రెన్యూర్.
మేఘాలయకు చెందిన వెస్ట్ ఖాసీ హిల్స్‌లో నివసించే బినోలిన్ సైయిమ్‌లే జీరో ఎనర్జీ స్టోరేజ్ యూనిట్స్ తయారీలో విజయవంతమైంది. కాల్చిన ఇటుకలు, నదిలో దొరికే ఇసుక, వెదురు, సీజీఐ షీట్స్, ఇనుపమేకులు, సిమెంట్, గులకరాళ్లు ఉపయోగించి రైతులకు ఉపయోగపడే స్టోరేజ్ కంటెయినర్స్ తయారు చేసింది. ఇక్కడ రైతుల ప్రధానపంట కూరగాయల సాగు. పంటను కోసి మార్కెట్‌కు తరలించే లోపు పాడయ్యేవి. ఈ స్టోరేజ్ కంటెయినర్‌ల వల్ల రైతులు పండించిన పంట మార్కెట్‌కు చేరేలోపు పాడయ్యే దుస్థితి దూరమైంది.
అర్థవంతమైన వ్యర్థం
మరో మహిళ నాగాలాండ్‌కు చెందిన నెంగ్నెథెమ్ హెంగ్నా. ఆమె అరటి నారతో ఇంట్లో ఉపయోగించే వస్తువులను తయారు చేసి పాలిమర్ ఫైబర్‌కు ప్రత్యామ్నాయాన్ని చూపించింది. టేబుల్ మ్యాట్, కోస్టర్, పండ్లు, కూరగాయలు నిల్వ చేసే బుట్టలు, క్యారీ బ్యాగ్‌ల వరకు పదమూడేళ్లుగా ఆమె తయారు చేస్తున్న అరటినార వస్తువులు దేశమంతటా విస్తరించాయి.
ఇక అస్సామీయులు పడవ తయారీలో ప్రయోగం చేశారు. నాటుపడవలను చెక్కతో తయారు చేస్తారు. మన్నిక దృష్ట్యా వాటికి ప్రత్యామ్నాయంగా ఫైబర్ గ్లాస్ బోట్స్ వాడుకలోకి వచ్చాయి. వీటికి పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాన్ని వెదురుతో కనుక్కున్నారు. ఈ ఇన్నోవేటివ్ బోట్స్ తయారీలో 85 శాతం వెదురు, పది శాతం పాలిమర్, ఐదు శాతం ఫైబర్ గ్లాస్ వాడుతున్నారు. ఈ పడవలు పదిహేనేళ్లపాటు మన్నుతాయి. పాడైన తర్వాత ఈ విడిభాగాలు భూమిలో కలిసిపోతాయి.
(చదవండి: కృష్ణభక్తురాలిగా ఐపీఎస్ అధికారిణి .. పదేళ్ల సర్వీస్ ఉండగానే..)
Comments
Please login to add a commentAdd a comment