మీకు తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా తయారవుతున్న ప్యాకింగ్ మెటీరియల్‌లో మూడింట రెండు వంతులు ఆహార పదార్థాలను ప్యాక్ చేయడానికే ఖర్చవుతోంది. ఈ ప్యాకింగ్ మెటీరియల్‌లో పేపర్, పేపర్ బోర్డ్, కార్డ్బోర్డ్, వ్యాక్స్, ఉడ్, ప్లాస్టిక్‌లు, మోనో కార్టన్‌లు... ఇంకా రకరకాలవి ఉపయోగిస్తారు. మిగిలిన అన్నిటికన్నా ప్యాకింగ్ మెటీరియల్ లో ఉపయోగించే ప్లాస్టిక్ శాతం తక్కువే.
కానీ మట్టిలో కలిసిపోకుండా పల్లపు ప్రదేశాలకు కొట్టుకుపోతూన్న ప్లాస్టిక్ తోనే సమస్య. క్లైమేట్ చేంజ్, పర్యావరణానికి ఎదురవుతున్న ఇబ్బందుల మీద చర్చించిన ఐక్యరాజ్య సమితి... నదులు, సముద్రాలను ముంచెత్తుతోన్న కాలుష్యాన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభంగా పేర్కొంది. మారుతున్న జీవనశైలి, ఆర్థిక వ్యవస్థ సృష్టిస్తున్న ఈ సమస్యకు మన వంతుగా చెక్ పెట్టడం ఎంతవరకు సాధ్యమో చూద్దాం.
ఫ్యామిలీ ఆడిట్
ప్యాకింగ్ మెటీరియల్‌ని తిరిగి ఉపయోగించడం పట్ల శ్రద్ధ చూపించకపోవడం కూడా ప్రధానమైన కారణం. ‘స్వీడన్ వంటి కొన్ని దేశాల్లో ఒక్కశాతం కంటే ఎక్కువ ప్యాకింగ్ మెటీరియల్ చెత్త లోకి వెళ్లదు. అంటే అక్కడ 99 శాతం మళ్లీ వాడకంలోకి వస్తోంది. అదే మనదేశంలో రీయూజ్ 22 శాతానికి మించడం లేద’ని బెంగళూరుకు చెందిన పర్యావరణవేత్త నరేశ్ హెగ్డే చెప్పా రు.
‘‘మన దేశంలో ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఒక్కో కుటుంబం నుంచి ఉదయంపాలప్యాకెట్‌తో మొదలయ్యే ప్యాకింగ్ అవసరం రాత్రి పడుకునే ముందు ఇంటి బయట పెట్టే చెత్త కవర్‌ల వరకు సగటున రెండు నుంచి మూడు కిలోల ప్యాకింగ్ వేస్ట్ ఉత్పత్తి అవుతోంది. ఫుడ్ ఆర్డర్‌ల ద్వారా వచ్చే ప్యాకెట్లది సింహభాగం. ఈ సమస్య సంపన్న కుటుంబాల్లోనే ఎక్కువ. కానీ ఈ విషయంలో ప్రతి కుటుంబం ఆడిట్ చేసుకోవాలి. వ్యర్థాల ఉత్పత్తిని ఎంత మేర నిలువరించవచ్చు అని విశ్లేషించుకుని అమలు చేయాలి’’ అని చెబుతున్నారు పర్యావరణవేత్తలు.
రీ యూజ్
‘‘మనం ఇప్పుడిప్పుడు ఇళ్లలో తడిచెత్త, పొడిచెత్తలను వేరు చేయడం వరకు అలవరుచుకుంటున్నాం. ఇకపై ఈ రెండింటితోపాటు రీ యూజబుల్ మెటీరియల్‌ను వేరు చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఒకసారి వాడిపారేయకుండా వీలైనన్ని ఎక్కువ దఫాలు వాడడం ఒక సూచన. ఇక కొన్నింటిని వాడిపారేయాల్సిందే, తిరిగి వాడడానికి వీలుకాదు. ఉదాహరణకు షాంపూ ప్యాకెట్‌లు, కాస్మటిక్ ఉత్పత్తులు ఈ కోవలోకి వస్తాయి.
చైతన్యం ఉన్నప్పటికీ ఎలా డిస్పోజ్ చేయాలో తెలియకపోవడం ఒక కారణం. ప్లాస్టిక్‌ని సరైన విధానంలో రీ సైకిల్ చేయడం, పరిహరించడం మనకు మనంగా చేయగలిగిన పని కాదు. తయారు చేసిన కంపెనీలకే ఆ బాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వాలు చట్టాలు చేయాలని పలు సందర్భాల్లో సూచించాం. ఇదెలాగంటే... సౌందర్యసాధనాలు, షాంపూ, వాషింగ్‌పౌ డర్, క్లీనింగ్ ఉత్పత్తులను వాడేసిన తర్వాత ప్యాకెట్‌లను ఏ దుకాణంలో కొన్నామో అదే దుకాణంలో తిరిగి డిపాజిట్ చేయడం అన్నమాట.
ఒక వస్తువు ఉత్పత్తి చేసిన కంపెనీ నుంచి కిరాణా దుకాణం వరకు సరఫరా అయినట్లే ఖాళీ ప్యాకెట్లు కూడా సప్లయ్ బ్యాక్ సిస్టమ్ ద్వారా తయారీ స్థానానికి తిరిగి చేరాలి. ఈ నియమాన్నిపాటించగలిగితే ఈ సంక్షోభానికి అడ్డుకట్ట వేయవచ్చు’’ అంటారు పర్యావరణ విశ్లేషకులు దొంతి నరసింహారెడ్డి. నిజానికి భారతీయుల జీవనశైలిలో సింగిల్ యూజ్ కంటే ముందు రీ యూజ్ ఉండేది.పాళీతో రాసే ఇంకు పెన్నుల నుంచి కాటన్ చేతి సంచీ వరకు ప్రతి వనరునీ వీలైనన్ని ఎక్కువసార్లు ఉపయోగించేవాళ్లం.
యూజ్ అండ్ త్రో, సింగిల్ యూజ్ మాటలుపాశ్చాత్యదేశాల నుంచి నేర్చుకున్న అపభ్రంశమే. కానీ ఇప్పుడు ఆయా దేశాలు రీ యూజ్ వైపు మరలుతూ ఇండియాను వేలెత్తి చూపిస్తున్నాయి. మనం వీలైనంత త్వరగా మనదైన రీ యూజ్ విధానాన్ని తిరిగి మొదలుపెడదాం. ఇంటి వాతావరణాన్ని మార్చుకోగలిగితే అది పర్యావరణ సమతుల్యత సాధనలో తొలి అడుగు అవుతుంది.
ప్రత్యామ్నాయాలున్నాయి!
► బర్త్‌డేపార్టీలో ధర్మాకోల్ బాల్స్, ప్లాస్టిక్ చమ్కీలను వాడుతుంటారు. అవి లేకుండా వేడుకను ఎకో ఫ్రెండ్లీగా చేసుకోవాలి.
► పెళ్ళిళ్లు ఎకో ఫ్రెండ్లీ వాతావరణంలో చేసుకోవాలి.
► ఇంట్లో ప్లాస్టిక్‌ని అవసరమైన వరకు మాత్రమే ఉపయోగించాలని, తప్పనిసరిగా రీయూజ్ చేయాలనే నియమాలను పెట్టుకోవాలి. ఆ నినాదాన్ని ఇంటి గోడ మీద రాసుకుంటే మనల్ని చూసి మరికొంత మంది ప్రభావితమవుతారు.
► పేపర్ బ్యాగ్, కాటన్ బ్యాగ్, మొక్కజొన్న పిండితో తయారవుతున్న క్యారీ బ్యాగ్‌ల వంటి ప్రత్యామ్నాయాలను వాడవచ్చు.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment