ప్రపంచంలోని 175 దేశాలు... దాదాపు 1000 మంది ప్రతినిధులు... అయిదు రోజుల చర్చోప చర్చలు... ఎట్టకేలకు ప్రపంచ సమస్యకు పరిష్కారం దిశగా చిన్న ముందడుగు. మే 29 నుంచి జూన్ 2 వరకు ప్యారిస్‌లో ప్లాస్టిక్‌పై ఐరాస అంతర్ ప్రభుత్వ చర్చల సంఘం2 (ఐఎన్‌సీ–2) సమావేశంలో జరిగింది ఇదే. ప్లాస్టిక్ కాలుష్యభూతాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా విశ్వవ్యాప్త ఒప్పందానికి చిన్నగా అడుగులు పడ్డాయి.
‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని పారద్రోలండి’ అన్నది ఈసారి ప్రధానాంశమైన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి కొద్దిగా ముందు జరిగిన ఈ సమావేశం ఆ మేరకు ఆనందించదగ్గది, అయితే, నవంబర్‌లో నైరోబీలో జరిగే ‘ఐఎన్‌సీ–3’ నాటికి కేవలం ఆలోచనలు ఏకరవు పెట్టే చిత్తు ప్రతి తయారీనే ఈ సమావేశం లక్ష్యంగా పెట్టుకోవడం ఆశ్చర్యకరం. పారేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు పసి ఫిక్ మహాసముద్రంలో కదులుతున్న కృత్రిమ ద్వీపంలా తయారైన వేళ ఇది అతి జాప్యమే.
నిజానికి, వచ్చే 2024 చివర లోపల ప్లాస్టిక్ భూతంపై ఈ చర్చోపచర్చలు ముగించాల్సి ఉంది. అందులో భాగంగా తలపెట్టిన అయిదు సమావేశాల్లో తాజా ప్యారిస్ సమావేశం రెండోది. ఆరు నెలల క్రితం ఉరుగ్వేలో జరిగిన తొలి సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. కొన్ని దేశాలు విశ్వవ్యాప్త కార్యాచరణ కోరితే, మరికొన్ని దేశాలు జాతీయ పరిష్కారాలు కావాలన్నాయి. ఇంకొన్ని దేశాలు రెండూ కావాల్సిందే అన్నాయి.
తీరా ఆరునెలల తర్వాత తాజా సమావేశంలోనూ తొలి రెండు రోజులూ ఉద్రిక్తత నడుమ వృథా అయ్యాయి. సహజంగానే ప్లాస్టిక్‌తో తమ ఆర్థిక అంశాలు ముడిపడ్డ చమురు, సహజవాయు, పాలిమర్ ఉత్పాదక దేశాలు ఏకాభిప్రాయం కుదరనివ్వక తమకు అనుకూల వాదనను ఎంచుకుంటూ, చర్చలను జాప్యం చేశాయి. ఎట్టకేలకు మూడో రోజున చర్చల రథం కొంత ముందుకు కదిలింది. ఆర్థిక ప్రయోజనాలు అర్థం చేసుకోదగినవే కానీ, వాటి కోసం ప్రపంచమే ప్రమాదంలో ఉన్నా పట్టదంటే ముమ్మాటికీ తప్పే.
మానవాళికి ప్లాస్టిక్ పెనుభూతమే. ప్రపంచంలో ఏటా 43 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తవుతోంది. అందులో సగానికి పైగా ఉత్పత్తులు పరిమిత కాలం ఆయువున్నవే. ఉత్పత్తి చేస్తున్న ప్లాస్టిక్‌లో మూడింట రెండు వంతులను వ్యర్థాలుగా పారేస్తున్నారు. పది శాతం ప్లాస్టిక్కే రీసైక్లింగ్‌కు నోచు కుంటోంది. అతి కొద్దిభాగం ప్లాస్టిక్ వ్యర్థాలనే దహనం చేస్తున్నారు.
అత్యధిక భాగం భూమిలో, జల వనరుల్లో, సముద్రాల్లో చేరిపోతున్నాయి. ఇది సమస్త జీవరాశికీ ముప్పు. ఇలా పేరుకుంటున్న వ్యర్థాల పరిమాణం వచ్చే 2060కి మూడు రెట్లవుతుంది. అందులో అయిదోవంతే రీసైకిల్ చేయడా నికి వీలుంటుంది. ఇక, 2019లో ప్రపంచవ్యాప్త ఉద్గారాల్లో 3 శాతం పైగా ప్లాస్టిక్ వ్యర్థాల పాపమే. ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) ఈ ప్రమాదాలపై తాజాగా అప్రమత్తం చేసింది.
కొత్తగా మైక్రో ప్లాస్టిక్స్ మరో పెను ఆందోళన. చేపలు, బ్లూ వేల్ లాంటి సముద్రచరాలు రోజూ కోటి ముక్కల మైక్రో ప్లాస్టిక్‌ను పొట్టలో వేసుకుంటున్నాయి. వాటిని భుజిస్తున్న మన రక్తంలో, చనుబాలలో, చివరకు గర్భస్థ మావిలో సైతం చేరి, ఆరోగ్య సమస్యగా మారాయి. కానీ, ప్లాస్టిక్ ఉత్పత్తిని పరిమితం చేయాలంటున్న దేశాలకూ, వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తే సరి అంటున్న దేశాలకూ మధ్య భేదాభిప్రాయాలు మరోసారి ప్యారిస్ సాక్షిగా బయటపడ్డాయి.
మన దేశంతో సహా సౌదీ అరేబియా, చైనా తదితర దేశాలూ నియంత్రణ చర్యలపై మెజారిటీ ఓటింగ్ కాక, ఏకాభిప్రాయం కావాలని పట్టుబట్టడం చిత్రం. లెక్కల్లో మన దేశ తలసరి ప్లాస్టిక్ వినియోగం అనేక ఇతర దేశాలతో పోలిస్తే తక్కువే. కానీ మన మొత్తం జనాభా, అన్ని కోట్లమంది అవసరాలకై ప్లాస్టిక్ ఉత్పత్తి, తత్ఫలి తంగా వ్యర్థాలు మాత్రం ఎక్కువే. పైపెచ్చు, ఎప్పటికప్పుడు అది అధికమవుతోంది.
ప్లాస్టిక్ ఉత్పత్తిని నియంత్రిస్తూ, కాలుష్యాన్ని మొగ్గలోనే తుంచేసే అంతర్జాతీయ ప్లాస్టిక్ ఒడంబడిక ప్రపంచానికి ఇప్పుడు అవసరమంటున్నది అందుకే. ప్యారిస్ పరిణామాలు, అధిగమించా ల్సిన అడ్డంకుల్ని చూస్తుంటే ఆ ఒడంబడిక అంత త్వరగా వచ్చేలా లేదు. ఇవాళ్టికీ సామాన్య ప్రజలు తమ జీవితంపై ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావాన్ని గుర్తించడం లేదు. ఆ వైఖరిని మార్చడం విశ్వ ఒడంబడికను మించిన సవాలు.
అలాగే వచ్చే ఏడాది చివరకి అంతర్జాతీయ సమాజం కట్టుబడి ఉండే చట్టబద్ధమైన విశ్వవ్యాప్త ఒడంబడిక తెద్దామని యోచన బాగున్నా, అందుకు కట్టుబడి ఉండడం కీలకం. ఒప్పందంలోనూ శషభిషలు లేకుండా ప్లాస్టిక్‌పై కఠిన కార్యాచరణ మరీ కీలకం. అలాకాక, మునుపటి పర్యావరణ ఒప్పందాల్లా ఈ కొత్త ఒడంబడికనూ కాలయాపన వ్యవహారంగా, ధనిక దేశాలకు అనుకూలంగా మారిస్తే ఫలితం శూన్యం. వర్ధమాన దేశాలకు న్యాయం జరిగేలా చూడాలి.
ప్యారిస్ సమావేశం ప్రారంభ చర్చల వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అన్నట్టు, ప్లాస్టిక్ కాలుష్యం ఇప్పుడు ఓ టైమ్ బాంబ్. తక్షణ చర్యలకు దిగకపోతే, పర్యావరణానికీ, జీవవైవిధ్యానికీ, యావత్ ప్రపంచ మానవాళి ఆరోగ్యానికే ప్రమాదం. దీన్ని కేవలం వ్యర్థాల నిర్వహణ అంశంగానే చూస్తే ఇబ్బందే.
కేవలం రీసైక్లింగ్‌కో, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధానికో పరిమితం కాకుండా పాలు, నీళ్ళ నుంచి తిండి దాకా అన్నీ ప్యాకెట్లూ ప్లాస్టిక్‌మయమైన ఈ రోజుల్లో ప్రజల జీవన విధానాన్ని మార్పించడంపై దృష్టి పెట్టాలి. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై త్వరపడాలి. ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల పైనే బాధ్యత మోపే ఆలోచన చేయాలి. ముప్పు ముంచుకొచ్చిన వేళ ఆలసిస్తే ఆనక ఏ ఒడంబడి కైనా నిరుపయోగమే. మెక్రాన్ మాటల్లోనే చెప్పాలంటే... ఆట్టే సమయం లేదు మిత్రమా!
సమయం లేదు మిత్రమా!
Published Wed, Jun 7 2023 12:39 AM | Last Updated on Wed, Jun 7 2023 3:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment