ఆమె పేరు స్నేహాషాహీ.
పర్యావరణంతో స్నేహం చేసింది.
పర్యావరణ రక్షణను చదివింది.
నీటి చుక్క... మీద పరిశోధన చేస్తోంది.
నీటి విలువ తెలుసుకుని జీవించమంటోంది.
ఇన్ని చేస్తున్న ఆమెను యూఎన్ గుర్తించింది.
ఇటీవల ‘యూత్ ఫర్ ఎర్త్’ అవార్డుతో గౌరవించింది.
ఈ సందర్భంగా ఆమె గురించి.
స్నేహాషాహీకి 28 ఏళ్లు. ఎం.ఏ. ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ కోసం 2019లో బరోడాలోని మహారాజా షాయాజీరావ్ యూనివర్సిటీలో చేరింది. పర్యావరణ పరిరక్షణను ప్రాక్టికల్‌గా చేసి చూపించడం కూడా అప్పుడే మొదలు పెట్టిందామె. క్రియాశీలకంగా పని చేయడానికి ముందుకు వచ్చిన మరో మూడు వందల మంది విద్యార్థులను కూడా చేర్పించింది. ఇక పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించిన ప్రచారంలో ఆ యూనివర్సిటీ క్యాంపస్‌లోని స్టూడెంట్స్ అందరినీ భాగస్వాములను చేసింది.
అందరూ కలిసి క్యాంపస్‌లో ప్రవహిస్తున్న కాలువను శుభ్రం చేసే పని మొదలు పెట్టారు. అది సహజమైన కాలువ, అందులో అనేక ప్రాణులు నివసిస్తుంటాయి. అలాంటి వాటర్ బాడీ మనుషుల బాధ్యతరాహిత్యం వల్ల మొత్తం ΄్లాస్టిక్ వ్యర్థాలతో పూడుకు పోయింది. స్టూడెంట్స్ అంతా కలిసి బయటకు తీసిన చెత్త ఎంతో ఊహించగలరా? ఏడు వందల కేజీలు. ఆ తర్వాత వర్షాలకు ఆ కాలువ పూర్వపు వైభవాన్ని సంతరించుకుని తాబేళ్లు, మొసళ్లకు ఆలవాలం అయింది.
వ్యర్థాల ప్రదర్శన
కాలువ నుంచి తీసిన థర్మోకోల్ షీట్‌లు, గాజు సీసాలు, మైక్రో ΄్లాస్టిక్ వ్యర్థాలను వాల్ హ్యాంగింగ్‌లు, పూల కుండీలుగా రీ సైకిల్ చేసి క్యాంపస్‌లోనే ప్రదర్శనకు ఉంచారు. ఒకసారి కాలువను శుభ్రం చేయడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చినట్లు కాదు, ఇకపై కూడా ఇలాంటివేవీ కాలువలో కనిపించకూడదనే సందేశం ఇవ్వడానికే ఈ పని చేశారు వాళ్లు. ఇంతటి బృహత్తరమైన కార్యక్రమానికి రూపకల్పన చేసిన స్నేహ, ఆమె బృందం ‘యూత్ ఫర్ ఎర్త్’ అవార్డుకు ఎంపికయ్యారు.
స్నేహ ఆ సందర్భంగా మాట్లాడుతూ ‘‘మనకందరికీ చెత్తను అలవోకగా ఏదో ఒక వైపుకు విసిరేయడం బాగా అలవాటై ΄ోయింది. చాక్లెట్ ర్యాపర్‌ని రోడ్డు మీద వేయడానికి సందేహించే వాళ్లు కూడా నీటి కాలువ కనిపిస్తే మరో ఆలోచన లేకుండా అందులోకి విసిరేస్తారు. నిజానికి ఆ పని రోడ్డు మీద వేయడం కంటే ఇది ఇంకా ప్రమాదకరం. మా క్యాంపస్‌లో చెత్తను తొలగించడానికి ముందు కొద్ది నెలల ΄ాటు చెత్తను ఇష్టానుసారంగా పారేయవద్దని ప్రచారం మొదలు పెట్టాం.
ఆ మేరకు బాగానే చైతన్యవంతం చేయగలిగాం. నిజానికి కాలువను శుభ్రం చేయడానికంటే చైతన్యవంతం చేయడమే అదే పెద్ద టాస్క్. అయితే అందరూ యూత్, చదువుకుంటున్న వాళ్లు, మంచి మార్పుని స్వాగతించడానికి సిద్ధంగా ఉండే వాళ్లే కావడంతో మొత్తానికి మా ప్రయత్నం విజయవంతమైంది. ఆ తర్వాత క్యాంపస్ బయట నివసిస్తే స్థానికుల్లో కూడా మార్పు తీసుకు రాగలిగాం. క్లీనింగ్ మొదలుపెట్టిన తర్వాత క్యాంపస్‌లో అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పని చేశారు.
మేము మొదలు పెట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఇప్పుడు మా జూనియర్ బ్యాచ్‌లు కొనసాగిస్తున్నాయి. బరోడా వాసులు ఎంతగా చైతన్యవంతం అయ్యారంటే... ఎవరైనా చేతిలోని ప్లాస్టిక్ కవర్‌ని నిర్లక్ష్యంగా రోడ్డుమీద కానీ కాలువల్లో కానీ విసిరేస్తుంటే చూస్తూ ఊరుకోవడం లేదు. ‘ఇది ఏం పని? పర్యావరణం పట్ల బాధ్యతగా వ్యవహరిద్దాం’ అని గుర్తు చేస్తున్నారు’’ అని చెప్పింది.
యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ 1972లో ప్రారంభమైంది. ఈ విభాగం భూగోళాన్ని ప్లాస్టిక్ రహితం గా మార్చడం కోసం పని చేస్తోంది. ఇందుకోసం 25 దేశాల నుంచి రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది యువతను భాగస్వాములను చేసింది. అందులో భాగంగానే స్నేహ ఈ గుర్తింపును, గౌరవాన్ని అందింది. ఇప్పుడామె బెంగళూరులో ఎక్స్‌ట్రీమ్ హైడ్రోలాజికల్ ఈవెంట్స్‌లో పీహెచ్‌డీ చేస్తోంది.
‘‘చిన్నప్పుడు ఈశాన్య రాష్ట్రాలను చూశాను. రక్షిత మంచినీటి సౌకర్యం లేకపోవడంతో వాళ్లు వీథిలో బోరు నీటినే తాగుతున్నారు. అప్పటినుంచి నాకు తెలియకుండానే నీటి గురించి శ్రద్ధ మొదలైంది. ఎవరైనా నీటి కష్టాలు తెలియకుండా పెరిగారంటే నా దృష్టిలో వాళ్లు విశేషాధికారాలు, సౌకర్యాలతో పెరిగినట్లే. నీటి ఎద్దడి కారణంగా కిలోమీటర్ల దూరం నుంచి నీటిని మోసుకునే జీవితాలెన్నో. ఒకవేళ నీరు ఉన్నప్పటికీ అది కలుషితమైన నీరు అయితే ఆ బాధలు వర్ణనాతీతం. అందుకే నీటి వనరులను కా΄ాడుకుందాం. రేపటి రక్షణ కోసం నేడు కొద్దిగా శ్రమిద్దాం’’ అని చెస్తోంది స్నేహాషాహీ.
Comments
Please login to add a commentAdd a comment