ఇటీవల డైనింగ్ టేబుల్స్ మీద ఉండే కిచెన్ వేర్‌లలో అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్స్‌లో కూడా ఉంటున్నాయి. అందులో వేడివేడి కూరలూ, పులుసు, అన్నం వంటి ఆహారాలు తీసి ఉంచి వడ్డిస్తూ ఉండటం చాలా మంది ఇళ్లలో కనిపించేదే. పైకి అనేక డిజైన్లతో చాలా అందంగా కనిపించే ఈ బౌల్స్... అందులో ఉంచే ఆహారం విషయానికి వచ్చేటప్పటికి ఆరోగ్యానికి అంత మంచిది కాదని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.
సాధారణంగా ఈ బౌల్స్‌ను ‘మెలమైన్’ అనే ప్లాస్టిక్ వంటి పదార్థంతో తయారు చేస్తారు. వేడి వేడి కూరలు, పులుసుల వంటి ఆహారపదార్థాలను ఇందులోకి తీయగానే ఆ వేడికి మెలమైన్... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందనీ, దేహంలోకి ప్రవేశించే ఈ మెలమైన్ వల్ల మూత్రపిండాలకు సంబంధించిన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. అధ్యయనం నిర్వహించిన తీరిది... ఈ అధ్యయనంలో భాగంగా కొంతమందికి మెలమైన్ బౌల్స్‌లో నూడుల్స్ ఇచ్చారు.
మరికొందరికి పింగాణీ బౌల్స్‌లో ఇచ్చారు. ఈ రెండు గ్రూపుల వారికి చేసిన మూత్ర పరీక్షల్లో మెలమైన్ బౌల్స్‌లో తిన్నవారి మూత్రంలో మెలమైన్ మోతాదులు దాదాపు ఎనిమిది రెట్లు ఉన్నాయని తేలింది. ఫలితంగా వారిలో కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసే అవకాశంతోపాటు కేన్సర్ ప్రమాదమూ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ఈ పని అస్సలు వద్దు... మెలమైన్‌తో చేసిన వంటపాత్రలలో వేడి ఆహారాన్ని తీయడమే చాలా ప్రమాదకరమంటే కొందరు మెలమైన్ బౌల్‌లో పెట్టిన ఆహారాన్నీ మైక్రోవేవ్ ఒవెన్‌లో ఉంచి వేడిచేస్తుంటారు.
ఇలా అస్సలు చేయకూడదని అమెరికన్ ప్రమాణాల సంస్థ ఎఫ్‌డీఏ గట్టిగా చెబుతోంది. అనర్థాలేమిటంటే... ఈ మెలమైన్ దుష్ప్రభావాలు ముఖ్యంగా హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావాలపై ఉంటాయి. దాంతో ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యతలలో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చు. అలాగే పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యత, వీర్య కణాల కదలికలు తగ్గడం, పురుష హార్మోన్ల స్రావం తగ్గడం వంటివి జరగవచ్చు.
ఇక చాలామందిలో డయాబెటిస్ ముప్పు పెరుగుతున్నట్లుగా ఇలాంటిదే మరో అధ్యయనంలో తేలింది. ఈ ప్లాస్టిక్ పాత్రలలో తింటున్నవారిలో స్థూలకాయం కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా రొమ్ము కేన్సర్ వంటి కేన్సర్‌ల రిస్క్‌లు చాలా ఎక్కువ.
ప్లాస్టిక్ బౌల్స్‌లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు, అల్జిమర్స్ కేసులు కూడా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. అందుకే కూరలు, పులుసుల వడ్డింపునకు ప్లాస్టిక్ బౌల్స్‌కు బదులు పింగాణీ బౌల్స్ మంచిదన్నది నిపుణుల మాట. ఈ పరిశోధనల ఫలితాలన్నీ ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి.
(చదవండి: దుర్గాపూజను శక్తిమంతంగా మార్చిన క్రెడిట్ ఆ సమరయోధుడికే దక్కుతుంది..!)
Comments
Please login to add a commentAdd a comment