bowl
-
గిన్నె చూపించి.. రూ.25 లక్షలు స్వాహా!
సాక్షి, హైదరాబాద్: గతంలో రైస్ పుల్లింగ్ గ్యాంగ్స్ చేతిలో మోసపోయిన ముగ్గురు వ్యక్తులు మోసగాళ్ల అవతారం ఎత్తారు. వీళ్లూ వరుసపెట్టి మోసాలు చేయడం ప్రారంభించారు. రూ.2500 విలువ చేసే రాగి గిన్నెకు అతీంద్రియశక్తులున్నాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు కాజేశారు. మరో రూ.23 లక్షలు స్వాహా చేయడానికి ప్రయత్నిస్తుండగా ఉత్తర మండల టాస్‌్కఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర బుధవారం తెలిపారు. రైస్ పుల్లర్లుగా పిలిచే ఇరీడియం నాణేల పేరుతో మోసం చేసే ముఠాలు గతంలో అనేకం ఉండేవి. 2015లో ఇలాంటి ఓ గ్యాంగ్ బారినపడిన స్నేహితులు ఓల్డ్ అల్వాల్ వాసి పి.శివసంతోష్ కుమార్, ఏపీలోని పలమనేరుకు చెందిన జి.మంజునాథ్‌రెడ్డి, బెంగళూరు వాసి ప్రతాప్ ఎస్సార్ రూ.5 లక్షలు నష్టపోయారు. దీంతో తామూ అదే పంథాలో మోసాలు చేయాలని నిర్ణయించుకుని రంగంలోకి దిగారు. మంజునాథ్‌రెడ్డి రాగి గిన్నెను కొని తన వద్ద ఉంచుకున్నాడు. దీనికోసం ఓ గాజు బాక్సు, చుట్టూ ధర్మకోల్ షీట్లు పెట్టి అదేదో అద్భుత వస్తువు అన్నట్లు రూపొందించాడు. నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ తనకు పరిచయమైన వారితో రైస్ పుల్లర్స్ పేరుతో ఎర వేసేవాడు. అతీంద్రియశక్తులు ఉన్న ఈ గిన్నెలు ఎవరి వద్ద ఉంటే వాళ్లు కోటీశ్వరులు అవుతారని, వివిధ రకాలైన ప్రయోగాల్లో వినియోగించే ఆ గిన్నెలకు భారీ రేటు ఉంటుందని నమ్మించేవాడు. ఇలానే ఇతడికి సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన శశికాంత్‌ను నమ్మబలికాడు. ఆ పాత్రను రూ.10 కోట్లకు ఖరీదు చేయడానికి అంతర్జాతీయ సంస్థ అయిన అప్రెచెస్ అండ్ రీసెర్చ్ సిద్ధంగా ఉందని చెప్పాడు. సికింద్రాబాద్‌లోని ఓ హోటల్ వద్ద శశికాంత్‌ను కలిసిన శివ సంతోష్ తాను సదరు కంపెనీ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. బెంగళూరులోని డీఆర్డీఓ నుంచి స్కానింగ్ మిషన్ తీసుకువచి్చ, ఈ పాత్రను స్కానింగ్ చేయించి, సైంటిస్టు నుంచి సర్టిఫికెట్ పొందాలని చెప్పాడు. అప్పుడు రంగంలోకి దిగిన ప్రతాప్ డీఆర్డీఓలో పని చేసే సైంటిస్ట్ రవీంద్ర ప్రసాద్‌గా శశికాంత్‌కు పరిచయం అయ్యాడు. స్కానింగ్, సరి్టఫికేషన్ కోసం రూ.25 లక్షలు ఖర్చవుతాయని చెప్పాడు. ఇలా ముగ్గురి మాటలు నమ్మిన బాధితుడు ఈ నెల 6న వారికి రూ.25 లక్షలు చెల్లించాడు. అయినప్పటికీ స్కానింగ్ మిషన్ తీసుకురాని మంజునాథ్ కాలయాపన చేస్తూ వచ్చాడు. అదేమిటంటూ నిదీయగా... మరో రూ.23 లక్షలు అవసరమని చెప్పాడు. వీరి వ్యవహారంపై అనుమానం వచ్చిన శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మార్కెట్ ఠాణాలో కేసు నమోదైంది. వీరి వ్యవహారంపై నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ కె.సైదులు నేతృత్వంలో రంగంలోకి దిగిన ఎస్సైలు పి.గగన్‌దీప్, శ్రీనివాసులు దాసు వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. వీరి నుంచి రూ.25 లక్షల నగదు, రాగి గిన్నె తదితరాలు స్వా«దీనం చేసుకున్నారు. 2016 నుంచి ఈ తరహా మోసాలు చేస్తున్న ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు దాదాపు రూ.10 కోట్లు కాజేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఎవరూ ముందుకు వచ్చి ఫిర్యాదు చేయకపోవడం వీరికి కలిసి వచ్చింది. -
ప్లాస్టిక్ బౌల్స్‌లో ఆహారం ఎందుకు తినకూడదంటే..?
ఇటీవల డైనింగ్ టేబుల్స్ మీద ఉండే కిచెన్ వేర్లలో అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్స్‌లో కూడా ఉంటున్నాయి. అందులో వేడివేడి కూరలూ, పులుసు, అన్నం వంటి ఆహారాలు తీసి ఉంచి వడ్డిస్తూ ఉండటం చాలా మంది ఇళ్లలో కనిపించేదే. పైకి అనేక డిజైన్లతో చాలా అందంగా కనిపించే ఈ బౌల్స్... అందులో ఉంచే ఆహారం విషయానికి వచ్చేటప్పటికి ఆరోగ్యానికి అంత మంచిది కాదని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణంగా ఈ బౌల్స్‌ను ‘మెలమైన్’ అనే ప్లాస్టిక్ వంటి పదార్థంతో తయారు చేస్తారు. వేడి వేడి కూరలు, పులుసుల వంటి ఆహారపదార్థాలను ఇందులోకి తీయగానే ఆ వేడికి మెలమైన్... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందనీ, దేహంలోకి ప్రవేశించే ఈ మెలమైన్ వల్ల మూత్రపిండాలకు సంబంధించిన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. అధ్యయనం నిర్వహించిన తీరిది... ఈ అధ్యయనంలో భాగంగా కొంతమందికి మెలమైన్ బౌల్స్‌లో నూడుల్స్ ఇచ్చారు. మరికొందరికి పింగాణీ బౌల్స్‌లో ఇచ్చారు. ఈ రెండు గ్రూపుల వారికి చేసిన మూత్ర పరీక్షల్లో మెలమైన్ బౌల్స్‌లో తిన్నవారి మూత్రంలో మెలమైన్ మోతాదులు దాదాపు ఎనిమిది రెట్లు ఉన్నాయని తేలింది. ఫలితంగా వారిలో కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసే అవకాశంతోపాటు కేన్సర్ ప్రమాదమూ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ఈ పని అస్సలు వద్దు... మెలమైన్తో చేసిన వంటపాత్రలలో వేడి ఆహారాన్ని తీయడమే చాలా ప్రమాదకరమంటే కొందరు మెలమైన్ బౌల్లో పెట్టిన ఆహారాన్నీ మైక్రోవేవ్ ఒవెన్‌లో ఉంచి వేడిచేస్తుంటారు.ఇలా అస్సలు చేయకూడదని అమెరికన్ ప్రమాణాల సంస్థ ఎఫ్‌డీఏ గట్టిగా చెబుతోంది. అనర్థాలేమిటంటే... ఈ మెలమైన్ దుష్ప్రభావాలు ముఖ్యంగా హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావాలపై ఉంటాయి. దాంతో ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యతలలో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చు. అలాగే పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యత, వీర్య కణాల కదలికలు తగ్గడం, పురుష హార్మోన్ల స్రావం తగ్గడం వంటివి జరగవచ్చు. ఇక చాలామందిలో డయాబెటిస్ ముప్పు పెరుగుతున్నట్లుగా ఇలాంటిదే మరో అధ్యయనంలో తేలింది. ఈ ప్లాస్టిక్ పాత్రలలో తింటున్నవారిలో స్థూలకాయం కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా రొమ్ము కేన్సర్ వంటి కేన్సర్ల రిస్క్‌లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ బౌల్స్‌లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు, అల్జిమర్స్ కేసులు కూడా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. అందుకే కూరలు, పులుసుల వడ్డింపునకు ప్లాస్టిక్ బౌల్స్‌కు బదులు పింగాణీ బౌల్స్ మంచిదన్నది నిపుణుల మాట. ఈ పరిశోధనల ఫలితాలన్నీ ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి.(చదవండి: దుర్గాపూజను శక్తిమంతంగా మార్చిన క్రెడిట్ ఆ సమరయోధుడికే దక్కుతుంది..!) -
బౌల్ మసాజ్‌తో మెరిసిపోండి!
కొబ్బరి నూనె, ఫేస్ ఆయిల్, మాయిశ్చరైజర్... వీటిలో ఏదైనా ఒకటి ముఖానికి రాయాలి. ఇప్పుడు చిన్న స్టీల్గిన్నెను తీసుకుని ముఖమంతా మర్దన చేయాలి. నుదురు, కనుబొమ్మలు, బుగ్గలు, మెడ భాగంలో గిన్నెను గుండ్రంగా తిప్పుతూ ముఖానికి రాసిన నూనె లేదా మాయిశ్చరైజర్ చర్మంలోకి పూర్తిగా ఇంకిపోయేంత వరకు మర్దన చేయాలి. ఇలా చేస్తే... ముఖం మీద ముడతలు తగ్గుతాయి. చర్మం మృదువుగా మారుతుంది. రక్తప్రసరణ మెరుగుపడి చర్మం కాంతిమంతంగా మెరుస్తుంది. కండరాల మీద ఒత్తిడి తగ్గి చర్మానికి విశ్రాంతి దొరుకుతుంది. ఈ బౌల్ మసాజ్ ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తారు కూడా. దీంతో కేవలం ముఖం మాత్రమే కాకుండా పాదాలు దగ్గర నుంచి బాడీ అంతా మసాజ్ చేస్తారు. ప్రత్యేకించి ఇత్తడి వంటి బౌల్‌తో మసాజ్ చేస్తారు. ఇది అలసట, వాపును తగ్గిస్తుంది. నిద్రలేమి నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే అలసటతో ఉన్న పాదాలను ఈ బౌల్‌తో మసాజ్ చేసుకుంటే రిలీఫ్‌గా ఉండటమే గాక రక్తప్రసర సంక్రమంగా జరిగి చాలా ఉపశమనంగా ఉంటుంది. కంటి పనితీరుకి ఈ మసాజ్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ బౌల్ మసాజ్ విధానం వల్ల శరీరీ పనితీరుని నియంత్రించే వాతపిత్త కఫా దోషాలను సమతుల్యం చేస్తుందట. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక్కసారి ఈ బౌల్ మసాజ్ ట్రై చేయండి. (చదవండి: ఈ కిట్ మీవద్ద ఉంటే..పార్లర్‌కి వెళ్లాల్సిన పని ఉండదు!) -
పగిలితే అతికించలేం.. కానీ ధర మాత్రం రూ.200 కోట్లు! ఎవరు కొన్నారంటే?
పింగాణీ గిన్నె! పగిలితే అతికించలేం. కానీ రెండు పక్షులు, ఆఫ్రికాట్ చెట్టు పెయింటింగ్ ఉన్న పింగాణీ గిన్నె వేలం పాటలో అక్షరాల 25 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోయింది. అంటే భారత కరెన్సీలో రూ.200 కోట్లు అమెరికాకు చెందిన పూరాతన వస్తువుల్ని వేలం నిర్వహించే ప్రముఖ సంస్థ సోథిబె 40 దేశాల్లో 80 ప్రాంతాల్లో కార్యకాపాలు నిర్వహిస్తుంది. అయితే ఈ కంపెనీ స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో హాంకాంగ్‌లో ప్రత్యేకంగా ఓ వేలం పాట నిర్వహించింది. ఆ ఆక్షన్‌లో చైనా రాజధాని బీజింగ్‌లో 18 శతాబ్ధంలో అంటే? 1722-35 మధ్య యోంగ్‌జింగ్ రాజు చనిపోయిన కొద్ది కాలానికి 'ఫలాంగ్‌కాయ్,' 'ఫారిన్ కలర్స్' అని పిలిచే సంప్రదాయంలో భాగంగా సిరామిక్స్‌తో ఈ పింగాణీ గిన్నెను తయారు చేశారు. గిన్నె మీద రెండు పక్షులు, ఆప్రికాట్ చెట్టు బొమ్మలు యోంగ్జెంగ్ వంశానికి చెందిన రాజు పద్యం నుంచి కొన్ని పదాలు ఉన్నాయి. ఇలాంటివి రెండు గిన్నెలను తయారుచేయగా.. 19వ శతాబ్దం చివరలో షాంఘైకి చెందిన షిప్పింగ్ వ్యాపారి కెప్టెన్ చార్లెస్ ఓస్వాల్డ్ లిడ్డెల్ నుంచి వీటిని సేకరించినట్లు తెలుస్తోంది. 1929లో వీటిని 150 పౌండ్లకు వేర్వేరుగా విక్రయించారు. వీటిలో లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉందని సోథెబీస్ తెలిపింది. రెండో దానిని హాంకాంగ్‌లో తాజాగా వేలం వేశారు. ఈ గిన్నె దశాబ్దాలుగా అనేక మంది చేతులు మారింది. వీరిలో అమెరికాకు చెందిన బార్బరా హట్టన్ సైతం వేలం పాటలో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఏప్రిల్ 8న వేసిన వేలంలో ఆ గిన్నెను వ్యాపారవేత్త, కలెక్టర్ అలిస్ చెంగ్ కొనుగోలు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. View this post on Instagram A post shared by Sotheby's (@sothebys) -
క్రీస్తు పూర్వం నుంచే పాత్రలపై పేరు చెక్కే పద్ధతి
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో ఉపయోగించే పాత్రలపై పేర్లు రాయించుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఆ వస్తువు కొన్నందుకు గుర్తుగా కొందరు రాయించుకుంటే, ఇతరులకు బహుమతిగా ఇచ్చేప్పుడు కొందరు రాయిస్తారు. ఇలా పాత్రలపై పేర్లు రాయించుకునే అలవాటు ఎప్పటినుంచి ఉందో తెలుసా..? క్రీ.పూ. నుంచే ఆ ఆనవాయితీ ఉందని తాజాగా లభించిన ఓ ఆధారం చెబుతోంది. 2 వేల ఏళ్ల క్రితం వినియోగించిన రాతి పాత్ర ఇటీవల వెలుగు చూసింది. దానిపై ప్రాకృత భాషలో చెక్కిన బ్రాహ్మీ లిపిని పరిశోధకులు గుర్తించారు. అది ఓ బౌద్ధ భిక్షుకి పేరుగా భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సమీపంలోని బొర్లామ్ గ్రామంలోని కవి మడివాళ్లయ్య మఠానికి చెందిన ఆది బసవేశ్వర దేవాలయం పరిసరాల్లోని ఓ మట్టి దిబ్బలో క్రీ.పూ.ఒకటో శతాబ్దికి చెందిన ఆ రాతి పాత్ర దొరికింది. పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ సంస్థ (ప్రీహా) బృందం ఆ పాత్రను గుర్తించింది. బౌద్ధం జాడలు మరింత లోతుగా.. ఆ ప్రాంతంలో గతంలో బౌద్ధం జాడలు వెలుగుచూసిన నేపథ్యంలో.. ఈ పాత్ర కూడా బౌద్ధాన్ని అనుసరించిన వారు వినియోగించినదిగా ప్రాథమికంగా భావించారు. నిశితంగా పరిశీలించగా.. బ్రాహ్మీ లిపిలో రాసిన ప్రాకృత భాష అక్షరాలు కనిపించాయి. ‘హిమాబుహియ’ లేదా ‘హిమాబుధియా’ అన్న అక్షరాలుగా వాటిని గుర్తించారు. ప్రీహా బృంద ప్రతినిధులు డాక్టర్ ఎంఏ శ్రీనివాసన్, బి.శంకర్‌రెడ్డి, చుక్కా నివేదిత, శాలినులు దీనిపై పరిశోధించినట్టు ప్రీహా ఓ ప్రకటనలో పేర్కొంది. హిమా అన్నది బౌద్ధ భిక్షుకి (మహిళ) పేరు అని బుధియ/బుహియ ఆమె ఇంటి పేరు అయి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. అది భిక్షా పాత్రేనన్నది వారి మాట. ఎపిగ్రఫిస్ట్ డాక్టర్ మునిరత్నం రెడ్డి ఆ అక్షరాలను పరిశీలించి.. ఆ లిపి పరిణామం ఆధారంగా అది క్రీ.పూ.ఒకటో శతాబ్దానికి చెందిందిగా చెప్పారు. లిపి తీరు ఆధారంగా ఆ రాతి పాత్ర కాలాన్ని గుర్తించారు. ఈ ప్రాంతం మంజీరా నదికి ఐదు కి.మీ. దూరంలో ఉంది. గతంలో ఇక్కడికి చేరువలోని మాల్తుమ్మెదలో ఒక బ్రాహ్మీ శాసనం, ఏడుపాయల పరిసరాల్లో నాలుగు బ్రాహ్మీ శాసనాలు దొరికాయని, మంజీరా పరివాహక ప్రాంతంలో మరింత పరిశోధిస్తే శాతవాహనుల చరిత్ర మాత్రమే కాకుండా తెలంగాణలో బౌద్ధం జాడలు మరింత లోతుగా తెలుస్తాయని ప్రీహా ప్రతినిధి శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఈ రాతి పాత్రను గుర్తించటంలో స్థానిక మఠాధిపతి సోమాయప్ప సహకరించారని తెలిపారు. కామారెడ్డి జిల్లా బొర్లామ్‌లో వెలుగుచూసిన రాతి పాత్ర.. దానిపై ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపి అక్షరాలు -
అరుదైన బౌల్.. ధర 3.6 కోట్లు!
ఓ పింగాణీ బౌల్ ధర ఎంతుంటుంది. మహా అయితే ఓ వంద, లేదంటే ఓ వెయ్యి రూపాయల వరకూ ఉండొచ్చు. మరింత కళాత్మకమైతే మరికాస్త ఎక్కువగా ధర పలకవచ్చు. కానీ అమెరికాలో వేలానికి వచ్చిన ఓ పింగాణీ బౌల్ ధర చూస్తే.. కళ్లు చెదరక మానవు. ఆ బౌల్ ధర సింపుల్‌గా రూ. 3.6 కోట్ల వరకూ ఉంటుందని వేలంపాట నిర్వాహకులు అంచనా వేశారు. ఎందుకు ఇంత ధర అంటే.. ఆ పాత్రకు కనీసం ఆరు వందల ఏళ్ల వయసు ఉంటుందట. ఈ పురాతన కప్పును ఈనెల 17న న్యూయార్క్‌లో సోథేబీ కంపెనీ వేలంపాటలో విక్రయించనుంది. అది చైనీస్ కప్పు కనెక్టికట్‌కు చెందిన ఓ పాత వస్తువుల వ్యాపారి గతేడాది ఆ బౌల్‌ను రూ. 2,500కు కొనుగోలు చేశాడు. కొంతకాలం తన దగ్గర ఉంచుకున్నాక దానిలో ఏదో ప్రత్యేకత ఉందని కనిపెట్టాడు. వెంటనే సోథేబీ కంపెనీని సంప్రదించాడు. ఆ బౌల్ చరిత్ర చెప్పాలని, విలువ కట్టాలని కోరాడు. బౌల్‌ను పరిశీలించిన కంపెనీ వాళ్లు కంగుతిన్నారు. ఇది అరుదైన బౌల్ అని, వేలం వేస్తే 5 లక్షల డాలర్ల వరకూ పలుకుతుందని చెప్పారు. దీంతో ఆ వ్యాపారి ఉబ్బితబ్బిబయ్యాడు. ఆ పాత్రను లోటస్ బౌల్‌గా పిలుస్తారు. ఆ బౌల్ 1403 నుంచి 1424 వరకూ చైనాను ఏలిన యోంగిల్ చక్రవర్తి కాలం నాటిది. ఇలాంటి కప్పులు మరో ఆరు మాత్రమే ఇప్పుడు ఉన్నాయని సోథేబీ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తైపీలోని నేషనల్ మ్యూజియంలో రెండు, లండన్ మ్యూజియంలో రెండు, టెహ్రాన్ మ్యూజియంలో ఒకటి అలాంటి కప్పులు ఉన్నాయట. అందమైన ఆర్టు అందమైన ఆర్టుతో ఉన్న ఈ బౌల్‌ను చూస్తే.. వావ్ అద్భుతం అనకుండా ఉండరేమో. 6 అంగుళాల తెల్లటి పాత్ర లోపల, బయటా నీలం రంగులో కళాత్మకంగా తీర్చిదిద్దిన పూల బొమ్మలతో ఆకట్టుకుంటుంది. ఆ బౌల్‌ను పట్టుకుంటే ఎంతో సున్నితంగా, సిల్కును తలపిస్తోంది. 15వ శతాబ్దపు రంగులు, డిజైన్లు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆ పాత్ర ఎంతో అద్భుతంగా ఉందని సోథేబీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మెక్ అటీర్ అన్నారు. పాత్ర పెయింటింగ్, షేప్ ఎంతో యునిక్‌గా ఉందని ఆయన ముచ్చట పడుతూ చెప్పారు. ఇంత పురాతన వస్తువు పాత వస్తువుల వ్యాపారి వద్దకు ఎలా వచ్చిందనేది తెలియడం లేదన్నారు. తరతరాలుగా వారసుల చేతులు మారుతూ ఇక్కడికి వచ్చి ఉంటుందని, దాని విలువ తెలియక పోవడంతో వారు అమ్మేసుకుని ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి వస్తువులు ఇంకా ఉండటం సంతోషమని, దాని వేలం నిర్వహించడం గొప్పగా భావిస్తున్నామని తెలిపారు. -
సాంబార్ గిన్నెలో పడి మూడేళ్ల చిన్నారి మృతి
-
వేడి సాంబార్లో పడి చిన్నారి మృతి
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గురుకుల పాఠశాలలో మూడున్నరేళ్ల చిన్నారి సాంబార్ డేక్షాలో పడి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పిట్లం మండలం బీసీ గురుకుల పాఠశాలలో శోభ, యాదులు అనే దంపతులు వంట మనుషులుగా పనిచేస్తున్నారు. వీరికి కీర్తన అనే మూడున్నరేళ్ల కూతురు ఉంది. కుటుంబమంతా ఆ వంట గదిలోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. రోజూ మాదిరిగానే ఈ రోజు(శనివారం) విద్యార్థులకు వంటలు సిద్దం చేశారు. వంటలో భాగంగా సాంబర్ చేసి డేక్షాను పక్కన పెట్టారు. అంతలో అక్కడికి ఆడుకుంటూ వచ్చిన కీర్తన అకస్మాత్తుగా ఆ సాంబార్ వండిన డేక్షా(గిన్నె, బగోనే) లో పడి పోయింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం పిట్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి చివరకు ప్రాణాలు వదిలింది. కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. -
మట్టితినడమే పనిగా...
మట్టి వాసనను ఇష్ట పడని మనుషులుండరు. చిన్న తనంలో చాలామందికి మట్టి, చాక్ పీస్ లు వంటివి తిన్న అనుభవాలూ ఉంటాయి. కొందరు గర్భిణిలకు కొన్ని వాసనలు పడకపోవడంతోపాటు, కొన్ని వస్తువులను పదే పదే తినాలన్న కోరిక కూడ కలుగుతుంటుంది. అయితే అవి గర్భంలోని పిల్లలకు ఎటువంటి హాని కలిగించనివి అయితే ఫర్వాలేదు. కానీ ఓ మహిళ ఏకంగా మూడు నెలల గర్భిణిగా ఉన్నప్పటినుంచీ ఇటుక పొడిని, మట్టిని తినడం పనిగా పెట్టుకొందట. మట్టి తినేందుకు, ఆ విషయం ఎవ్వరికీ తెలియకుండా ఉండేందుకు అనేక అబద్ధాలు కూడ చెప్తుండేదట. లివర్‌పూల్ కు చెందిన చెందిన 30 ఏళ్ళ జెన్నీ మాసన్.. మూడు నెలల గర్భిణిగా ఉన్నపుడు ఇటుకపొడి, ఇసుక, మట్టి వంటి పదార్థాలను ఎవ్వరికీ తెలియకుండా తినేసేదట. ఇంట్లోని గోడల్లో ఉండే ఇటుకల పొడి, గార్డెన్ లోని మట్టిలను అందరి కళ్ళూగప్పి సేకరించుకొని, ఆహార పదార్థాలతోపాటు.. ఎంతో ఇష్టంగా తినేదట. అయితే అటువంటి పదార్థాలను తినాలన్న అలవాటు... ఆమెలో చివరికి 'పికాగా' నిర్థారణ అయ్యిందట. రైలీ కొన్నోర్ గర్భంలో పడినప్పుడు అలవాటుగా మారిన మట్టి తినే సమస్య... ఆమెకు అతడు పుట్టిన మూడు నెలల తర్వాత తీరిందట. ఓ టీవీ కార్యక్రమంలో మట్టి తినడంవల్ల కలిగే నష్టాలను వివరించినా ఆమె మానుకోలేక పోయిందట. అంతకు ముందు పికా గురించి తాను ఎప్పుడూ వినలేదని, అటువంటి సమస్య ఉంటుందని తనకు తెలియదని జెన్నీమాసన్ చెప్తోంది. పికా అనేది శరీరంలో రక్త హీనత, పోషక లోపాల వల్ల సంభవించే రుగ్మత అని, అది మట్టి, ఇసుక, ఇటుకపొడి వంటివి తినే కోరిక కలిగేట్లుగా చేస్తుందని తెలుసుకొన్న జెన్నీ తర్వాత... వాటి జోలికి పోలేదు. గర్భధారణ సమయంలో ఇటువంటి లోపాలు సంభవించడం సాధారణమేనని, అయితే సమస్యను వెంటనే వైద్యులకు వివరించి తగిన జాగ్రత్తలు, వైద్యం తీసుకోకుంటే తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందని తెలుసుకొంది. పోషక విలువలు కలిగిన పదార్థాలను సేవించడం మానుకొని, పనికిరాని మట్టిని తినడం నష్టాన్ని కలుగజేస్తుందని తెలుసుకొంది. ఇసుక మట్టి దంతాలకు కూడ తీవ్ర నష్టాన్నికలిగిస్తాయని వైద్యుల ద్వారా తెలుసుకొంది. అయితే ప్రసవం వరకూ కూడ ఎవరు ఎన్ని చెప్పినా అలవాటును మానలేకపోయింది. చివరకు బిడ్డ పుట్టిన మూడు నెలల తర్వాత ఆమెలో మట్టి తినాలన్న కోరిక దూరమైంది. ప్రస్తుతం మూడేళ్ళ తన కొడుకు రైలీ కొన్నోర్ ను చూసినప్పుడల్లా ఎంతో భయం వేస్తుందని, అదృష్టం కొద్దీ బిడ్డకు ఎటువంటి అవకరాలు రాకపోయినా, తదుపని బిడ్డల విషయంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఆలోచనతో మట్టి తినడం మానుకున్నాని జెన్నీ చెప్తోంది. తనకు వచ్చిన సమస్య ఇంకెవరికైనా వస్తే వెంటనే వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకొని, కడుపులోని బిడ్డల ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవాలని హెచ్చరిస్తోంది. -
ముంబై ఇండియన్స్ 'ఢమాల్'
విశాఖ: తడబాటుకు మారు పేరు అన్న చందంగా ఉంది ముంబై ఇండియన్స్ పరిస్థితి. ఒక మ్యాచ్‌లో గెలిస్తే.. మరో మ్యాచ్‌లో ఘోర ఓటమి. ఐపీఎల్ ఆరంభం నుంచి నిలకడలేమితో సతమవుతున్న రోహిత్ సేన మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆదివారం ఇక్కడ డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 85 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అంతకుముందు సన్ రైజర్స్ లో చతికిలబడ్డ రోహిత్ అండ్ గ్యాంగ్ మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. సన్ రైజర్స్ విసిరిన 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పార్థీవ్ పటేల్ డకౌట్ గా వెనుదిరగగా, రోహిత్ శర్మ(5) నిరాశపరిచాడు. ఆ తరువాత అంబటి రాయుడు(6), బట్లర్(2), కృనాల్ పాండ్యా(17), పొలార్డ్(11),హార్దిక్ పాండ్యా(7)లు స్వల్ప విరామాల్లో పెవిలియన్ కు చేరడంతో ముంబైకు కష్టాల్లో పడింది. ఐదు టాప్ ఆర్డర్ వికెట్లను 30 పరుగులకే కోల్పోయిన ముంబై ఏ దశలోనూ కోలుకోలేదు. ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలో 92 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ముంబై ఆటగాళ్లలో హర్భజన్ సింగ్(21 నాటౌట్) దే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఆశిష్ నెహ్రా, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలో మూడు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా, బరిందర్ శ్రవణ్ కు రెండు,భువనేశ్వర్ కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ధవన్(82 నాటౌట్; 57 బంతుల్లో 10 ఫోర్లు, 1సిక్స్)తో దుమ్మురేపడంతో పాటు, అతనికి జతగా డేవిడ్ వార్నర్(48; 33 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆ తరువాత యువరాజ్ సింగ్(39;23 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు) మెరుపులు తోడవడంతో సన్ రైజర్స్ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. -
రోహిత్ సేన 'చెత్త రికార్డు'
విశాఖ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డును మూట గట్టుకుంది. ఈ టోర్నీలో పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న రోహిత్ సేన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబాటుకు లోనైంది. నగరంలోని డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 30 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి చెత్త రికార్డును నమోదు చేసింది. ఈ సీజన్ తొలి ఐదు వికెట్లను స్వల్ప స్కోరుకే కోల్పోవడం ముంబై ఇన్నింగ్స్ లో ఇదే ప్రథమం కాగా, ఓవరాల్ గా ఇది ఆరో అత్యల్పం కావడం గమనార్హం. సన్ రైజర్స్ విసిరిన 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పార్థీవ్ పటేల్ డకౌట్ గా వెనుదిరగగా, రోహిత్ శర్మ(5) నిరాశపరిచాడు. ఆ తరువాత అంబటి రాయుడు(6), బట్లర్(2),కృనాల్ పాండ్యా(17)లు పెవిలియన్ బాటపట్టారు. ముంబై కోల్పోయిన ఐదు వికెట్లలో ఆశిష్ నెహ్రా మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్ కుమార్, బరిందర్ శ్రవణ్‌లకు తలో వికెట్ దక్కింది. -
చెలరేగిన ధవన్
విశాఖపట్నం:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఆదివారం ఇక్కడ డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు శిఖర్ ధవన్ చెలరేగిపోయాడు. ఓపెనర్‌గా వచ్చిన ధవన్ ఆద్యంతం తనదైన మార్కుతో ఆకట్టుకున్నాడు. ధవన్(82 నాటౌట్; 57 బంతుల్లో 10 ఫోర్లు, 1సిక్స్)తో దుమ్మురేపడంతో పాటు, అతనికి జతగా డేవిడ్ వార్నర్(48; 33 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో సన్ రైజర్స్ 178 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కు శుభారంభం లభించింది. శిఖర్ ధవన్, వార్నర్‌లు చక్కటి పునాది వేశారు. తొలుత నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ జోడి తరువాత ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఈ జోడి 9.5 ఓవర్లలో 85 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన అనంతరం తొలి వికెట్ గా వార్నర్ వెనుదిరిగాడు. అనంతరం కేన్ విలియమ్సన్(2) కూడా పెవిలియన్ చేరడంతో సన్ రైజర్స్ 91 పరుగుల వద్ద రెండో వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలోశిఖర్ కు జత కలిసిన యువరాజ్ సింగ్ ఆకట్టుకున్నాడు. యువరాజ్ సింగ్(39;23 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. శిఖర్-యువరాజ్ ల జోడి మూడో వికెట్ కు మరో 85 పరుగులను జోడించడం విశేషం. -
ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై
విశాఖపట్నం: ఐపీఎల్ 9లో భాగంగా విశాఖపట్నంలోని వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు 10 పాయింట్లతో పట్టికలో అమీతుమీగా ఉన్నాయి. ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడు విశాఖలో ఒక్క మ్యాచ్ కూడా లేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఏకంగా ఆరు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం లభించింది. గతంలో హైదరాబాద్ జట్టు ఇక్కడ కొన్ని మ్యాచ్‌లను ఆడినా ఈ సీజన్లో అన్ని హోమ్ మ్యాచ్‌లను భాగ్యనగరంలోనే ఆడుతోంది. అయితే మహారాష్ట్ర మ్యాచ్‌లను తరలించాల్సి రావడం విశాఖ అభిమానులకు వరంగా మారింది. పుణే, ముంబై రెండు జట్లూ తమ హోమ్ మ్యాచ్‌లను ఇక్కడే ఆడనున్నాయి.