రోహిత్ సేన 'చెత్త రికార్డు'
విశాఖ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డును మూట గట్టుకుంది. ఈ టోర్నీలో పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న రోహిత్ సేన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబాటుకు లోనైంది. నగరంలోని డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 30 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి చెత్త రికార్డును నమోదు చేసింది. ఈ సీజన్ తొలి ఐదు వికెట్లను స్వల్ప స్కోరుకే కోల్పోవడం ముంబై ఇన్నింగ్స్ లో ఇదే ప్రథమం కాగా, ఓవరాల్ గా ఇది ఆరో అత్యల్పం కావడం గమనార్హం.
సన్ రైజర్స్ విసిరిన 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పార్థీవ్ పటేల్ డకౌట్ గా వెనుదిరగగా, రోహిత్ శర్మ(5) నిరాశపరిచాడు. ఆ తరువాత అంబటి రాయుడు(6), బట్లర్(2),కృనాల్ పాండ్యా(17)లు పెవిలియన్ బాటపట్టారు. ముంబై కోల్పోయిన ఐదు వికెట్లలో ఆశిష్ నెహ్రా మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్ కుమార్, బరిందర్ శ్రవణ్లకు తలో వికెట్ దక్కింది.