IPL9
-
ముంబై ఇండియన్స్ 'ఢమాల్'
విశాఖ: తడబాటుకు మారు పేరు అన్న చందంగా ఉంది ముంబై ఇండియన్స్ పరిస్థితి. ఒక మ్యాచ్‌లో గెలిస్తే.. మరో మ్యాచ్‌లో ఘోర ఓటమి. ఐపీఎల్ ఆరంభం నుంచి నిలకడలేమితో సతమవుతున్న రోహిత్ సేన మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆదివారం ఇక్కడ డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 85 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అంతకుముందు సన్ రైజర్స్ లో చతికిలబడ్డ రోహిత్ అండ్ గ్యాంగ్ మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. సన్ రైజర్స్ విసిరిన 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పార్థీవ్ పటేల్ డకౌట్ గా వెనుదిరగగా, రోహిత్ శర్మ(5) నిరాశపరిచాడు. ఆ తరువాత అంబటి రాయుడు(6), బట్లర్(2), కృనాల్ పాండ్యా(17), పొలార్డ్(11),హార్దిక్ పాండ్యా(7)లు స్వల్ప విరామాల్లో పెవిలియన్ కు చేరడంతో ముంబైకు కష్టాల్లో పడింది. ఐదు టాప్ ఆర్డర్ వికెట్లను 30 పరుగులకే కోల్పోయిన ముంబై ఏ దశలోనూ కోలుకోలేదు. ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలో 92 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ముంబై ఆటగాళ్లలో హర్భజన్ సింగ్(21 నాటౌట్) దే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఆశిష్ నెహ్రా, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలో మూడు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా, బరిందర్ శ్రవణ్ కు రెండు,భువనేశ్వర్ కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ధవన్(82 నాటౌట్; 57 బంతుల్లో 10 ఫోర్లు, 1సిక్స్)తో దుమ్మురేపడంతో పాటు, అతనికి జతగా డేవిడ్ వార్నర్(48; 33 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆ తరువాత యువరాజ్ సింగ్(39;23 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు) మెరుపులు తోడవడంతో సన్ రైజర్స్ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. -
రోహిత్ సేన 'చెత్త రికార్డు'
విశాఖ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డును మూట గట్టుకుంది. ఈ టోర్నీలో పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న రోహిత్ సేన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబాటుకు లోనైంది. నగరంలోని డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 30 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి చెత్త రికార్డును నమోదు చేసింది. ఈ సీజన్ తొలి ఐదు వికెట్లను స్వల్ప స్కోరుకే కోల్పోవడం ముంబై ఇన్నింగ్స్ లో ఇదే ప్రథమం కాగా, ఓవరాల్ గా ఇది ఆరో అత్యల్పం కావడం గమనార్హం. సన్ రైజర్స్ విసిరిన 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పార్థీవ్ పటేల్ డకౌట్ గా వెనుదిరగగా, రోహిత్ శర్మ(5) నిరాశపరిచాడు. ఆ తరువాత అంబటి రాయుడు(6), బట్లర్(2),కృనాల్ పాండ్యా(17)లు పెవిలియన్ బాటపట్టారు. ముంబై కోల్పోయిన ఐదు వికెట్లలో ఆశిష్ నెహ్రా మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్ కుమార్, బరిందర్ శ్రవణ్‌లకు తలో వికెట్ దక్కింది. -
చెలరేగిన ధవన్
విశాఖపట్నం:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఆదివారం ఇక్కడ డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు శిఖర్ ధవన్ చెలరేగిపోయాడు. ఓపెనర్‌గా వచ్చిన ధవన్ ఆద్యంతం తనదైన మార్కుతో ఆకట్టుకున్నాడు. ధవన్(82 నాటౌట్; 57 బంతుల్లో 10 ఫోర్లు, 1సిక్స్)తో దుమ్మురేపడంతో పాటు, అతనికి జతగా డేవిడ్ వార్నర్(48; 33 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో సన్ రైజర్స్ 178 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కు శుభారంభం లభించింది. శిఖర్ ధవన్, వార్నర్‌లు చక్కటి పునాది వేశారు. తొలుత నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ జోడి తరువాత ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఈ జోడి 9.5 ఓవర్లలో 85 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన అనంతరం తొలి వికెట్ గా వార్నర్ వెనుదిరిగాడు. అనంతరం కేన్ విలియమ్సన్(2) కూడా పెవిలియన్ చేరడంతో సన్ రైజర్స్ 91 పరుగుల వద్ద రెండో వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలోశిఖర్ కు జత కలిసిన యువరాజ్ సింగ్ ఆకట్టుకున్నాడు. యువరాజ్ సింగ్(39;23 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. శిఖర్-యువరాజ్ ల జోడి మూడో వికెట్ కు మరో 85 పరుగులను జోడించడం విశేషం. -
ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై
విశాఖపట్నం: ఐపీఎల్ 9లో భాగంగా విశాఖపట్నంలోని వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు 10 పాయింట్లతో పట్టికలో అమీతుమీగా ఉన్నాయి. ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడు విశాఖలో ఒక్క మ్యాచ్ కూడా లేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఏకంగా ఆరు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం లభించింది. గతంలో హైదరాబాద్ జట్టు ఇక్కడ కొన్ని మ్యాచ్‌లను ఆడినా ఈ సీజన్లో అన్ని హోమ్ మ్యాచ్‌లను భాగ్యనగరంలోనే ఆడుతోంది. అయితే మహారాష్ట్ర మ్యాచ్‌లను తరలించాల్సి రావడం విశాఖ అభిమానులకు వరంగా మారింది. పుణే, ముంబై రెండు జట్లూ తమ హోమ్ మ్యాచ్‌లను ఇక్కడే ఆడనున్నాయి. -
వాట్సన్ గిటార్.. కోహ్లి, గేల్ తీన్మార్!!
జల్సా చేయడంలో, నైట్ అంతా పార్టీలో చిందులు వేయడంలో, తీన్మార్ డ్యాన్స్ చేయడంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాళ్లకు మరెవరు సాటిరారనే చెప్పాలి. ఇరగదీసే స్టెప్పులు వేయడంలో విరాట్ కోహ్లి ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇక కోహ్లికి సుడిగాలి లాంటి క్రిస్ గేల్ జతకలిస్తే.. షేన్ వాట్సన్ తన గిటారుతో దుమ్ములేపే ట్యూన్ ఇస్తే.. ఇక చెప్పాల్సిన పని లేదు. టాప్ లేచిపోద్ది. అలాంటి టాప్ లేచిపోయే డ్యాన్సులతో సుడి'గేల్', 'వీర' విరాట్ దుమ్ములేపారు. నిజానికి తాజా ఐపీఎల్లో బెంగళూరు జట్టు ఏమంతగా విజయాలు సాధించడం లేదు. అయినా ఆ జట్టు ఆటగాళ్ల జల్సాలకు, పార్టీ లైఫ్ అడ్డులేనట్టు కనిపిస్తోంది. ఇటీవల బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాడు, ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ తన గిటారు నైపుణ్యాన్ని చూపించాడు. అదరగొట్టేలా వాట్సన్ గిటారు వాయిస్తుంటే.. ఆ మ్యూజిక్కు తగ్గట్టు విరాట్ కోహ్లి స్టెప్పులు వేశాడు. ఇటీవల కూతురు పుట్టడంతో ఫుల్ హ్యాపీగా ఉన్న గేల్ కూడా కోహ్లితో జతకలిసి తన డ్యాన్సింగ్ రిథమ్ ను చూపెట్టాడు. క్రికెటర్లు ఫుల్ జోష్‌తో హంగామా చేసిన ఈ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. -
మ్యాచ్‌లు తరలించడం పరిష్కారం కాదు: ధోని
మహారాష్ట్రలో తీవ్ర కరవు, నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మ్యాచ్‌లు తరలించడం సమస్యకు పరిష్కారం కాదని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎం.ఎస్.ధోని అన్నాడు. నీటి ఎద్దడికి దీర్ఘకాల, శాశ్వత పరిష్కారం కావాలన్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్‌కు చివర్లో బౌలింగ్ ఇవ్వడంపై ధోని వివరణ ఇచ్చాడు. అశ్విన్‌కు ఏ సమయంలో బంతి ఇచ్చినా అద్భుతంగా రాణించగలడని చెప్పాడు. గతంలో జట్టు కష్టకాలంలో ఉన్న సమయంలో అశ్విన్ చాలాసార్లు ఆదుకున్నాడని అన్నాడు. -
నరైన్ ఈసారి మరింత మెరుగ్గా ఆడతాడు: గంభీర్
సందేహాస్పద బౌలింగ్ శైలిని సరిచేసుకొని నిషేధాన్ని తొలగించుకున్న తమ జట్టు స్పిన్నర్ సునీల్ నరైన్.. ఈసారి ఐపీఎల్లో మరింత మెరుగ్గా రాణిస్తాడని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు. నిషేధం తొలగిపోవడంతో నరైన్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదని... ఈ పరిస్థితుల్లో అతని నుంచి అత్యుత్తమ ప్రదర్శన వస్తుందని గంభీర్ అన్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 74 వికెట్లు తీసుకున్న నరైన్ 2012, 2014లలో కోల్‌కతాకు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించాడు.