ముంబై ఇండియన్స్ 'ఢమాల్'
విశాఖ: తడబాటుకు మారు పేరు అన్న చందంగా ఉంది ముంబై ఇండియన్స్ పరిస్థితి. ఒక మ్యాచ్లో గెలిస్తే.. మరో మ్యాచ్లో ఘోర ఓటమి. ఐపీఎల్ ఆరంభం నుంచి నిలకడలేమితో సతమవుతున్న రోహిత్ సేన మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆదివారం ఇక్కడ డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 85 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అంతకుముందు సన్ రైజర్స్ లో చతికిలబడ్డ రోహిత్ అండ్ గ్యాంగ్ మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.
సన్ రైజర్స్ విసిరిన 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పార్థీవ్ పటేల్ డకౌట్ గా వెనుదిరగగా, రోహిత్ శర్మ(5) నిరాశపరిచాడు. ఆ తరువాత అంబటి రాయుడు(6), బట్లర్(2), కృనాల్ పాండ్యా(17), పొలార్డ్(11),హార్దిక్ పాండ్యా(7)లు స్వల్ప విరామాల్లో పెవిలియన్ కు చేరడంతో ముంబైకు కష్టాల్లో పడింది. ఐదు టాప్ ఆర్డర్ వికెట్లను 30 పరుగులకే కోల్పోయిన ముంబై ఏ దశలోనూ కోలుకోలేదు. ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలో 92 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ముంబై ఆటగాళ్లలో హర్భజన్ సింగ్(21 నాటౌట్) దే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఆశిష్ నెహ్రా, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలో మూడు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా, బరిందర్ శ్రవణ్ కు రెండు,భువనేశ్వర్ కు ఒక వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ధవన్(82 నాటౌట్; 57 బంతుల్లో 10 ఫోర్లు, 1సిక్స్)తో దుమ్మురేపడంతో పాటు, అతనికి జతగా డేవిడ్ వార్నర్(48; 33 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆ తరువాత యువరాజ్ సింగ్(39;23 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు) మెరుపులు తోడవడంతో సన్ రైజర్స్ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది.