చెలరేగిన ధవన్
విశాఖపట్నం:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఆదివారం ఇక్కడ డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు శిఖర్ ధవన్ చెలరేగిపోయాడు. ఓపెనర్గా వచ్చిన ధవన్ ఆద్యంతం తనదైన మార్కుతో ఆకట్టుకున్నాడు. ధవన్(82 నాటౌట్; 57 బంతుల్లో 10 ఫోర్లు, 1సిక్స్)తో దుమ్మురేపడంతో పాటు, అతనికి జతగా డేవిడ్ వార్నర్(48; 33 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో సన్ రైజర్స్ 178 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కు శుభారంభం లభించింది. శిఖర్ ధవన్, వార్నర్లు చక్కటి పునాది వేశారు. తొలుత నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ జోడి తరువాత ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఈ జోడి 9.5 ఓవర్లలో 85 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన అనంతరం తొలి వికెట్ గా వార్నర్ వెనుదిరిగాడు. అనంతరం కేన్ విలియమ్సన్(2) కూడా పెవిలియన్ చేరడంతో సన్ రైజర్స్ 91 పరుగుల వద్ద రెండో వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలోశిఖర్ కు జత కలిసిన యువరాజ్ సింగ్ ఆకట్టుకున్నాడు. యువరాజ్ సింగ్(39;23 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. శిఖర్-యువరాజ్ ల జోడి మూడో వికెట్ కు మరో 85 పరుగులను జోడించడం విశేషం.