మట్టి వాసనను ఇష్ట పడని మనుషులుండరు. చిన్న తనంలో చాలామందికి మట్టి, చాక్ పీస్ లు వంటివి తిన్న అనుభవాలూ ఉంటాయి. కొందరు గర్భిణిలకు కొన్ని వాసనలు పడకపోవడంతోపాటు, కొన్ని వస్తువులను పదే పదే తినాలన్న కోరిక కూడ కలుగుతుంటుంది. అయితే అవి గర్భంలోని పిల్లలకు ఎటువంటి హాని కలిగించనివి అయితే ఫర్వాలేదు. కానీ ఓ మహిళ ఏకంగా మూడు నెలల గర్భిణిగా ఉన్నప్పటినుంచీ ఇటుక పొడిని, మట్టిని తినడం పనిగా పెట్టుకొందట. మట్టి తినేందుకు, ఆ విషయం ఎవ్వరికీ తెలియకుండా ఉండేందుకు అనేక అబద్ధాలు కూడ చెప్తుండేదట.
లివర్పూల్ కు చెందిన చెందిన 30 ఏళ్ళ జెన్నీ మాసన్.. మూడు నెలల గర్భిణిగా ఉన్నపుడు ఇటుకపొడి, ఇసుక, మట్టి వంటి పదార్థాలను ఎవ్వరికీ తెలియకుండా తినేసేదట. ఇంట్లోని గోడల్లో ఉండే ఇటుకల పొడి, గార్డెన్ లోని మట్టిలను అందరి కళ్ళూగప్పి సేకరించుకొని, ఆహార పదార్థాలతోపాటు.. ఎంతో ఇష్టంగా తినేదట. అయితే అటువంటి పదార్థాలను తినాలన్న అలవాటు... ఆమెలో చివరికి 'పికాగా' నిర్థారణ అయ్యిందట. రైలీ కొన్నోర్ గర్భంలో పడినప్పుడు అలవాటుగా మారిన మట్టి తినే సమస్య... ఆమెకు అతడు పుట్టిన మూడు నెలల తర్వాత తీరిందట. ఓ టీవీ కార్యక్రమంలో మట్టి తినడంవల్ల కలిగే నష్టాలను వివరించినా ఆమె మానుకోలేక పోయిందట. అంతకు ముందు పికా గురించి తాను ఎప్పుడూ వినలేదని, అటువంటి సమస్య ఉంటుందని తనకు తెలియదని జెన్నీమాసన్ చెప్తోంది.
పికా అనేది శరీరంలో రక్త హీనత, పోషక లోపాల వల్ల సంభవించే రుగ్మత అని, అది మట్టి, ఇసుక, ఇటుకపొడి వంటివి తినే కోరిక కలిగేట్లుగా చేస్తుందని తెలుసుకొన్న జెన్నీ తర్వాత... వాటి జోలికి పోలేదు. గర్భధారణ సమయంలో ఇటువంటి లోపాలు సంభవించడం సాధారణమేనని, అయితే సమస్యను వెంటనే వైద్యులకు వివరించి తగిన జాగ్రత్తలు, వైద్యం తీసుకోకుంటే తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందని తెలుసుకొంది. పోషక విలువలు కలిగిన పదార్థాలను సేవించడం మానుకొని, పనికిరాని మట్టిని తినడం నష్టాన్ని కలుగజేస్తుందని తెలుసుకొంది. ఇసుక మట్టి దంతాలకు కూడ తీవ్ర నష్టాన్నికలిగిస్తాయని వైద్యుల ద్వారా తెలుసుకొంది. అయితే ప్రసవం వరకూ కూడ ఎవరు ఎన్ని చెప్పినా అలవాటును మానలేకపోయింది. చివరకు బిడ్డ పుట్టిన మూడు నెలల తర్వాత ఆమెలో మట్టి తినాలన్న కోరిక దూరమైంది. ప్రస్తుతం మూడేళ్ళ తన కొడుకు రైలీ కొన్నోర్ ను చూసినప్పుడల్లా ఎంతో భయం వేస్తుందని, అదృష్టం కొద్దీ బిడ్డకు ఎటువంటి అవకరాలు రాకపోయినా, తదుపని బిడ్డల విషయంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఆలోచనతో మట్టి తినడం మానుకున్నాని జెన్నీ చెప్తోంది. తనకు వచ్చిన సమస్య ఇంకెవరికైనా వస్తే వెంటనే వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకొని, కడుపులోని బిడ్డల ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవాలని హెచ్చరిస్తోంది.
మట్టితినడమే పనిగా...
Published Mon, May 9 2016 3:05 PM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM
Advertisement