కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జై సమైక్యాంధ్ర నినాదాలతో కర్నూలు నగరం మారుమ్రోగింది. శనివారం మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మికులు, న్యాయవాదులు సమైక్య శంఖారావాన్ని పూరించారు.
మహిళా ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో డీఆర్‌డీఏ-ఐకేపీ, మహిళా ఉద్యోగులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు, ఆయాలు, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ తదితర అన్ని శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కలెక్టరేట్ వద్ద ర్యాలీని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ వి.సి.హెచ్.వెంగల్‌రెడ్డి, కోశాధికారి శ్రీరాములు తదితరులు ప్రారంభించారు. రాజ్‌విహార్ వరకు చేపట్టిన ర్యాలీలో వేలాది మంది మహిళలు ఉద్యమ గళం వినిపించారు.
సోనియా, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా నినదించారు. అనంతరం మండుటెండలోనే మానవహారం నిర్మించి రాకపోకలను స్తంభింపజేశారు. ర్యాలీ సందర్భంగా ప్రసంగాలు లేకుండా నినాదాలతోనే హోరెత్తించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ముత్యాలమ్మ, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, మహిళా ఉద్యోగుల సంఘం నేతలు విజయకుమారి, సరస్వతి, జ్ఞానేశ్వరమ్మ, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం నేతలు అరుణకుమారి, రాణి, మాధవీశ్యామల, విజయశంకర్, రెవెన్యూ శాఖకు చెందిన నాగమణి, మధుమతి, రామలక్ష్మి, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు సింధుభైరవి, భాగ్యరేఖ, కళ్యాణి, విజయకుమారి, ఏపీజీఎల్‌ఐ ఉద్యోగులు ఇందిరాదేవి, పద్మావతి, మాధవీ కళ్యాణి, సౌజన్య, జానకి, నాగమణి బాయి తదితరులు పాల్గొన్నారు.