ఉపాధిహామీ పథకం అధికారుల పనితీరు నలుగురూ నవ్వుకునేలా ఉంది. ఉపాధి పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలను రికవరీ చేస్తున్న వైనం చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది. పథకం ప్రారంభై ఏడేళ్లు కావస్తుండగా జిల్లాలో ఇప్పటివరకు రూ.7.47 కోట్ల అవినీతి జరిగినట్టు సామాజిక తనిఖీల్లో తేల్చారు. ఇందులో కేవలం రూ.2.42 కోట్లు రికవరీ చేశారు. సామాజిక తనిఖీలు, అవినీతి సొత్తు రికవరీ చేసేందుకు రూ.6.93 కోట్లపైగా ఖర్చు చేశారు. ప్రభుత్వ పథకాలపై వాటి అమలుపై అధికారులుకున్న చిత్తశుద్ధికి దీనికి మించిన ఉదాహరణ మరొకటి దొరకదేమో!
ముకరంపుర : ఉపాధి హామీ పథకం కూలీలకంటే ఎక్కువగా అవినీతిపరులకే ‘ఉపాధి’ కల్పిస్తోందంటే అతిశయోక్తి కాదేమో! కూలీల సొమ్మును కాజేసిన వారిలో అన్ని వర్గాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఉన్నారు. కొత్త టెక్నాలజీలు వస్తున్నా అక్రమాలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. మాజీ ప్రజాప్రతినిధులతో పాటు ప్రస్తుత ప్రజాప్రతినిధులు సైతం అవినీతిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములే. సామాజిక తనిఖీల్లో రూ.కోట్లు పక్కదారిపట్టినట్టు గుర్తించినా.. ఆ సొమ్మును రికవరీ చేయడంలో, బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారు. భారీగా అవినీతికి ఆజ్యం పోసి ఇప్పుడు రికవరీలోనూ తమదైన శైలిలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. సామాజిక తనిఖీలతో కేసులు నమోదు చేయడం, సస్పెన్షన్లు, కిందిస్థాయి ఉద్యోగుల తొలగింపునకు మించి కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ఎందుకీ సామాజిక తనిఖీ...
జిల్లాలో 2006లో ఉపాధిహామీ పథకాన్ని ప్రారంభించారు. 2007లో సామాజిక తనిఖీల పేరుతో అవినీతికి పాల్పడేవారి లెక్కలు తీయడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఆరుసార్లు సామాజిక తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం 7వ సామాజిక తనిఖీ సాగుతోంది. జిల్లాలో 57 మండలాలున్నాయి.
మొదటి రెండు దశల్లో 57 మండలాలు, మూడవ దశలో 56 మండలాలు, నాలుగు, ఐదు దశల్లో 57 మండలాలు, ఆరవ దశలో 56 మండలాలు, ప్రస్తుత 7వ దశలో 8 మండలాల్లో సామాజిక తనిఖీలు పూర్తయ్యాయి. మొత్తంగా 348 మండలాల్లో సామాజిక తనిఖీ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా రూ.7.47 కోట్లు దుర్వినియోగమైనట్లు తేల్చారు. ఇందులో డబ్బుల రూపేణా రూ.5.72 కోట్లున్నాయి.
ఈ అవినీతి సొమ్మును రాబట్టేందుకు చర్యలు తీసుకున్నా ఫలితమివ్వలేదు. ఇప్పటివరకు రూ.2.43 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. రూ.2.09 కోట్లను ప్రభుత్వ ఖాతాలో జమచేశారు. తనిఖీలు నిర్వహించినపుడు ఆడిట్ రిసోర్స్‌పర్సన్‌లు 10 మంది, ఒక డీఆర్‌సీతో పాటు అంబుడ్స్‌మెన్ వెళ్తారు. స్థానికంగా ఉన్న ఆడిటర్ సహకారంతో తనిఖీలు నిర్వహిస్తారు. ఏడాదిలో రెండుసార్లు సామాజిక తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో సామాజిక తనిఖీ పూర్తికావడానికి రూ.లక్ష నుంచి రూ.2లక్షల ప్రభుత్వ ధనాన్ని వినియోగించారు. ఈ లెక్కన రూ.5 కోట్లకు పైగా ఖర్చు చేశారు. కానీ వీళ్లు రికవరీ చేసింది మాత్రం రూ.2.43 కోట్లే కావడం గమనార్హం.
అక్రమార్కుల చిట్టా..
ఆరుసార్లు జరిగిన సామాజిక తనిఖీలో అక్రమాలకు పాల్పడిన వారి వివరాలు పరిశీలిస్తే మొత్తంగా 5,313 మందిపై కేసులు నమోదయ్యాయి. 24 మంది ఎంపీడీవోలు, 81 మంది ఏపీవోలు, 60 మంది ఏఈలు, 719 మంది టీఏలు, ఇద్దరు వర్క్ ఇన్స్‌పెక్టర్లు, 364 మంది సీవోలు, 2769 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరితో పాటు 121 మంది ఈసీలు, ఏడుగురు పీఎస్‌లు, 25 మంది సర్పంచులు, 77 మంది వీవోలు, 216 మంది బీపీఎంలు, 46 మంది గ్రౌండ్ లీడర్లు, 615 మంది మేట్లు, 187 మంది ఇతరులున్నారు. ఇందులో కేసులు నమోదు చేయడంతో పాటు పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించారు.
ఇందులో ఆరుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏడుగురు టీఏలు, ఒక సీవో, ఇద్దరు ఏపీవోలు, నలుగురు ఎంపీడీవోలు, ఇద్దరు ఏఈలు, ముగ్గురు ఈసీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ కేసులను రెండు కేటగిరీలుగా విభజించారు. బీ-కేటగిరీలో పరిశీలిస్తే సస్పెండయిన వారిలో 22 మంది ఎఫ్‌ఏలు, ఒక టీఏ, ముగ్గురు ఇతరులున్నారు. ఇందులో ప్రత్యేకించి క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. 12 మంది ఎఫ్‌ఏలు, ఇద్దరు టీఏలు, మరో ఇద్దరు ఏపీవోలు, 14 మంది బ్రాంచి పోస్టుమాస్టర్‌లు, ఐదుగురు ఎంపీడీవోలు, ఇద్దరు ఏఈలు, ఐదుగురు సర్పంచులు, ఐదుగురు మేట్లున్నారు.
డబ్బు ఖర్చయినా ఫలితముంది..
ఉపాధిహామీ పథకంపై సామాజిక తనిఖీల్లో డబ్బు ఖర్చయిన మాట వాస్తవమే. ఒక్కో తనిఖీకి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చయ్యింది. కానీ ఎక్కువ కేసుల పరిష్కారం, తక్కువ అవినీతి జరగడంలో జిల్లా ముందుంది. సామాజిక తనిఖీలతో అవినీతి కూడా తగ్గింది.
- ఇన్‌చార్జి డ్వామా పీడీ శ్రీనివాస్
కేసులు పెట్టడంతో సరిపోదు..
ఉపాధిహామీ పథకంలో సామాజిక తనిఖీలతో కేసులు పెట్టడంతో సరిపోదు. అవినీతి సొమ్మును రికవరీ చేసి కూలీలకు అందించాలి. అవినీతిలో పెద్దల హస్తం ఉంది. కేవలం కింది స్థాయి సిబ్బందిపై తోసేయడం సరికాదు. సామాజిక తని ఖీలతో కూలీలకు ఒరిగిందేమీ లేదు. - గుడికందుల సత్యం,
వ్యవసాయ కార్మిక సంఘ నాయకుడు
కొండను తవ్వి ఎలుకను పట్టారు!
Published Sat, Dec 6 2014 2:41 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement