డ్వామా తనిఖీ డ్రామా | Check dvama Drama | Sakshi
Sakshi News home page

డ్వామా తనిఖీ డ్రామా

Published Mon, Nov 4 2013 2:06 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

Check dvama Drama

=ఫలితమివ్వని ఉపాధి హామీ సోషల్ ఆడిట్
 =తడిసి మోపెడవుతున్న ఖర్చు

 
సాక్షి, విశాఖపట్నం : ఉపాధి హామీ పనులపై చేస్తున్న సోషల్ ఆడిట్(సామాజిక తనిఖీలు) ఆశించిన ఫలితమివ్వడం లేదు.  లోతుగా అక్రమాలను గుర్తించకపోవడం, తేల్చిన అక్రమాలపై చర్యలు విషయంలో అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడంతో కొండను తవ్వి...ఎలుకను పట్టినట్టవుతోంది. దీంతో ఆడిట్ కయ్యే ఖర్చు డ్వామాకు తడిసి మోపెడవుతోంది. రికవరీ కన్నా ఖర్చే ఎక్కువగా ఉంటోంది. ఆరేళ్ల క్రితం అమలులోకి వచ్చిన ఉపాధిహామీ పథకంలో జిల్లాలో ఇప్పటివరకూ రూ.1259 కోట్ల విలువైన పనులు చేపట్టారు. వీటిల్లో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు సమాంతరంగా సోషల్ ఆడిట్ కూడా ప్రభుత్వం నిర్వహిస్తోంది.

ఇంతవరకు బాగానే ఉన్నా.. అక్రమాల గుర్తింపులో సోషల్ ఆడిట్ సిబ్బంది విఫలమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అధికారుల జోక్యం, ప్రజాప్రతినిధుల ఒత్తిడి వెరసీ నామమాత్రంగానే ఆడిట్ నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఆరేళ్లలో సామాజిక తనిఖీల్లో  కేవలం రూ.2.63కోట్లు మాత్రమే అవినీతి జరిగినట్టు లెక్కతేల్చారు. వాస్తవానికైతే ఉపాధి పనులపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి గ్రామంలోనూ రూ. లక్షల్లో పక్కదారి పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదులు కూడా అదే స్థాయిలో అధికారులకు అందుతున్నాయి. కానీ సోషల్ ఆడిట్‌లో ఇది వెలుగులోకి రావడం లేదు. ఇందుకు ఒత్తిడిలు, ప్రలోభాలే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
 
అరకొరగా తేల్చిన అవినీతిపై కూడా అధికారులు చర్యలు తీసుకోలేకపోయారు. ఇప్పటి వరకు జిల్లాలోని 39 మండలాల్లో ఐదేళ్ల ఆడిట్ చేపట్టగా, నాలుగు మండలాల్లో మాత్రమే ఆరో ఏడాది ఆడిట్ కూడా పూర్తయింది. ఇంత వరకు రూ.2.63కోట్లు అవినీతి జరిగినట్టు లెక్క తేల్చారు. ఇందులో రూ.1.21కోట్లు రికవరీ చేశారు. మిగతా మొత్తం విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ అవినీతిలో  1604 మంది ప్రమేయం ఉన్నట్టు తేల్చగా ఇంతవరకు 246మందిని మాత్రమే తొలగించారు. 1225 మందిపై క్రమశిక్షణ చర్యలంటూ నాన్పుడు ధోరణి ప్రదర్శిస్తున్నారు.

మరో 133 మందివైపు కన్నెత్తి చూడలేదు. వాస్తవానికి అవినీతికి పాల్పడిన మొత్తానికి చెల్లించకుంటే బాధ్యులపై రెవెన్యూ రికవరీ(ఆర్‌ఆర్) యాక్ట్ ప్రయోగించాలని కేంద్రం ఆదేశించింది. అవసరమైతే కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని సూచించింది. కానీ మన అధికారులు చలించలేదు. చర్యలు విషయంలో తాత్సారం కనబరుస్తున్నారు. ఇదిలా ఉండగా ఆరేళ్లుగా సోషల్ ఆడిట్ సిబ్బంది కోసం అయిన ఖర్చు మాత్రం రూ.2కోట్లు దాటిపోయింది.

తేల్చిన అవినీతి మొత్తానికి  దరిదాపుగా ఆడిట్ ఖర్చు చేరుతుంది. ఇంకా చెప్పాలంటే రికవరీ అయ్యే మొత్తాన్ని మించిపోయింది. దీంతో డ్వామాకు అదనపు భారంగా సోషల్ ఆడిట్ ఖర్చు తయారైంది. చెప్పాలంటే తడిసిమోపెడవుతోంది. ఇప్పటికైనా సోషల్ ఆడిట్‌లో పురోగతి రావాలి. అవినీతి మొత్తాన్ని రికవరీలో అధికారులు చిత్తశుద్ధి కనబరచాలి. లేదంటే ఆడిట్ అక్కరకు రాకుండా పోతుంది.

=ఆరేళ్ల ఉపాధి పనుల వ్యయం రూ.1259కోట్లు
=ఐదేళ్ల ఆడిట్‌లో తేల్చిన అవినీతి రూ. 2.65కోట్లు
=ఇంతవరకు రికవరీ చేసినది రూ.1.21కోట్లు
= సోషల్ ఆడిట్‌కు ఖర్చు సుమారు రూ. 2కోట్లు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement