కళ్యాణదుర్గం : పోలీసుల చర్యలను నిరసిస్తూ తోపుడుబండ్ల కార్మికులు రోడ్డెక్కారు. ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు అశ్వర్థనారాయణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు బుధవారం నిర్వహించారు. తోపుడు బండ్ల కార్మికులు కిష్ట, మోహన్‌లాల్, రవూఫ్, ఖాజా తదితరులతో కలిసి ఆందోళనకు దిగారు. బళ్ళారి రోడ్డులోని ఏఐటీయూసీ కార్యాలయం నుంచి పట్టణ పురవీధులలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు.
తోపుడు బండ్ల కార్మికులకు అన్యాయం చేయకూడదని, ఉపాధి మార్గం చూపాలని నినాదాలు చేశారు. మునిసిపల్ కార్యాలయాన్ని గంట పాటు ముట్టడించారు. కార్యాలయ ప్రధాన గేట్‌ను మూసివేశారు. అనంతరం అక్కడి నుంచి టీడీపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరిని నిలదీశారు. ఉన్నఫలంగా తోపుడు బండ్లు తొలగించాలంటే తాము ఎలా బతకాలని ఏకరువు పెట్టారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే అక్కడే ఉన్న మునిసిపల్ చెర్మైన్ వై.పి.రమేష్‌తో చర్చించారు. పది రోజులలో రోడ్ల వెడల్పు కార్యక్రమం చేపట్టేందుకు ఆక్రమణ దారులకు నోటీసులు పంపుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే స్పందిస్తూ తోపుడు బండ్ల కార్మికులకు ఇబ్బంది పెడ్డకూడదని టౌన్ ఎస్‌ఐ జయనాయక్‌కు పోన్‌లో సూచించారు. దీంతో కార్మికులు అక్కడి నుంచి ర్యాలీగా టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.
పోలీసుల చర్యకు నిరసనగా ధర్నా
Published Thu, Dec 4 2014 2:52 AM | Last Updated on Sat, Aug 11 2018 4:32 PM
Advertisement
Advertisement