సోమవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని పాతతోటలో వేణమ్మతో కరచాలనం చేసి ముచ్చటిస్తున్న మంత్రి కేటీఆర్, చిత్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘గ్రేటర్ హైదరాబాద్‌లో ‘పరిచయం’ కార్యక్రమంతో పారిశుధ్య సిబ్బంది, వార్డుల్లో ఉండే కుటుంబాలతో పరిచయం పెంచుకొనేలా చేశాం. సిబ్బంది తమ తమ వార్డుల్లో పర్యటిస్తూ ఆ ప్రాంత ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా నగరంలో పారిశుధ్యం మెరుగుపడుతోంది. ప్రజలు కూడా శానిటేషన్‌పై శ్రద్ధ వహిస్తున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మనం ఆశిస్తున్న లక్ష్యం నెరవేరాలంటే ఇది రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అమలు కావాలి. అందుకు ఇక్కడి నుంచే మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణను ఆదేశిస్తున్నా’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పరిచయం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు వార్డుల వారీగా నియమించిన పారిశుధ్య సిబ్బంది పేరు, సెల్‌ఫోన్ నంబర్లను విధిగా ఆయా ప్రాంతాల్లో గోడలపై రాయించాలని ఆదేశించారు.
పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా సోమవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలసి ఆయన మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. ముందుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్.. పాత తోట మురికివాడలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా స్ధానిక మహిళలతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారికి పింఛన్లు, తాగునీరు వస్తున్నాయా లేదా ఆరా తీశారు. ఈ సందర్భంగా చాలా మంది మహిళలు మంత్రికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పించాలని వేడుకున్నారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం అప్పన్నపల్లిలోని వైట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణ ప్రగతి–అమలు అంశంపై నూతనంగా నియమితులైన వార్డు అధికారులు, కమిటీ సభ్యులు, కౌన్సిలర్లకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇప్పటికే తడి, పొడి చెత్త కోసం ప్రత్యేక డబ్బాలు పంపిణీ చేస్తే కొందరు వాటిలో బియ్యం, పప్పు నిల్వ ఉంచుకున్నారని మంత్రి చెప్పారు.
తడిచెత్తతో వర్మి కంపోస్టు ఎరువులు, పొడిచెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చనే విషయాన్ని గ్రహించాలన్నారు. తన నియోజకవర్గం సిరిసిల్లలో తడి, పొడి చెత్త వేరు చేయడం వల్ల వాటిని రైతులకు విక్రయిస్తున్న మెప్మా సభ్యులు ప్రతి నెల రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నారని మంత్రి వివరించారు. అన్ని మున్సిపాలిటీలకు కేటాయించిన బడ్జెట్‌లో పచ్చదనం కోసం 10 శాతం పచ్చదనం పరిరక్షణ కోసం కేటాయించామన్నారు. పట్టణప్రగతిలో భాగంగా నియమించిన గ్రీన్ బ్రిగేడ్ సభ్యులు వార్డుల్లో పర్యటిస్తూ.. ప్రతి ఇంటికి ప్రజలు ఏ మొక్కలు అడిగినా ఆ మొక్కల్ని పంపిణీ చేయాలన్నారు. మొక్కలు పెరిగేలా సంబంధిత కౌన్సిలర్లే చొరవ తీసుకోవాలన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం వరకు బతకకపోతే కౌన్సిలర్ తన పదవిని కోల్పోతారని హెచ్చరించారు.
ఏప్రిల్ రెండు నుంచి టీఎస్‌బీపాస్..
పురపాలికల్లో అవినీతి రహిత పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 2 నుంచి టీఎస్‌బీపాస్‌ను అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇళ్లు, భవన నిర్మాణాల కోసం ప్రజలు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం మున్సిపల్ కార్యాలయానికి రానవసరం లేదని చెప్పారు. 75 గజాల వరకు స్థలంలో ఇంటి నిర్మాణానికి మున్సిపల్ అనుమతులు అవసరం ఉండబోవని స్పష్టం చేశారు. 75 గజాల నుంచి 600 గజాల వరకు నిర్మాణానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లోపే అనుమతులు వస్తాయన్నారు. రాలేదంటే మున్సిపల్ కమిషనర్, టౌన్‌ప్లానింగ్ అధికారి అనుమతులను పోస్టు ద్వారా ఇంటికే పంపిస్తారన్నారు. స్వీయ ధ్రువీకరణతో ఇంటి పనులు నిర్ణయించుకుని చెల్లించొచ్చని, ఇచ్చిన సమాచారం తప్పని నిర్ధారణ అయితే అందుకు 25 రేట్లు అధికంగా జరిమానా పడుతుందన్నారు. ఇంటి నిర్మాణ సమాచారం తప్పుగా ఇస్తే అనుమతులు రద్దు అవుతాయన్నారు.
ప్రజలకు దగ్గరయ్యేందుకే..
‘వచ్చే నాలుగేళ్ల వరకు ఎలాంటి ఎన్నికల్లేవు. అయినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం నూతన సంస్కరణలు, పథకాలకు శ్రీకారం చుడుతోంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఇలా ఏ కార్యక్రమమైనా ప్రజలకు మంచి చేయాలన్నదే మా ఉద్దేశం. ఇందులో రాజకీయ ఆపేక్ష ఏ మాత్రం లేదు’అని కేటీఆర్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎసేతర కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులనూ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment