సాక్షి, నెల్లూరు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవాలనే ఒకటే లక్ష్యం, దీక్ష, పట్టుదలతో సింహపురి వాసులు అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. 61వ రోజూ ఉద్యమం ఉధృతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. నెల్లూరులోని వీఆర్‌సీ కూడలిలో యూటీఎఫ్, ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ, గాంధీబొమ్మ సెంటర్‌లో ఎస్‌యూపీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. ఎన్జీఓ హోంలో ఆర్‌అండ్‌బీ ఉద్యోగులు రిలే దీక్షలో కూర్చున్నారు.
వేదాయపాళెం సెంటర్‌లో ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. రోడ్డుపై వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. వీరికి వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మద్దతు తెలిపారు. నవాబుపేట సెంటర్‌లో మాజీ కార్పొరేటర్ ఆనం జయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు రిలే దీక్ష చేశారు.
ఏసీ సెంటర్‌లో ఆర్కెస్ట్రా కళాకారులు 12 గంటల పాటు సమైక్యస్వరయజ్ఞం నిర్వహించారు. ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సంక్షేమ భవన్ నుంచి వీఆర్‌సీ సెంటర్ వరకు మాదిగ గర్జన ర్యాలీ సాగింది. శాలివాహన సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపైనే కుండ లు చేస్తూ నిరసన తెలిపారు. ఏపీ అగ్రవర్ణాల పేదల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బోసుబొమ్మ నుంచి వీఆర్‌సీ సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. సూళ్లూరుపేటలో కారు డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 100 కార్లతో భారీ ర్యాలీ జరిగింది. డ్రైవర్ కోయా అహ్మద్ అరగుండు, అర మీసంతో నిరసన తెలిపారు. మరో డ్రైవర్ రాజశేఖర్ గుండు గీయించుకున్నాడు.
తడ, నాయుడుపేట, దొరవారిసత్రంలో రిలేనిరాహారదీక్షలు కొనసాగాయి. ఆత్మకూరులో సమైక్యవాదులు రిలేదీక్ష కొనసాగించారు. ఉదయగిరి బస్టాండ్ సెంటర్‌లో రిలేదీక్షలో ఉన్న ఉద్యోగులకు టీడీపీ నేత బొల్లినేని రామరావు సంఘీభావం ప్రకటించారు. సీతారామపురంలో చిన్నారులు దీక్షలో కూర్చున్నారు. వింజమూరు విజృంభణ విజయవంతమైంది. వరికుంటపాడులో జడదేవి యువకులు రిలేదీక్ష చేయగా, దుత్తలూరు సెంటర్‌లో సమైక్యవాదులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు.
కోవూరులోని ఎన్జీఓ హోంలో ఎన్టీఆర్ అభిమానులు, లేగుంటపాడులో రైతులు దీక్షలో కూర్చున్నారు. ఇందుకూరుపేట మండలంలోని మైపాడు సముద్రతీరంలో ఉపాధ్యాయులు జలదీక్ష నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమ రథం ముత్తుకూరుకు చేరుకోగా, సమైక్యాంధ్ర పతాకాన్ని ఈదూరు రాంమోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. గూడూరులోని టవర్‌క్లాక్ సెంటర్‌లో జేఏసీ నాయకులు రోడ్డుపై గోలీలాట ఆడి నిరసన తెలిపారు. కోట మండలంలోని లక్ష్మమ్మ గిరిజన కాలనీ, నార్త్ గిరిజన కాలనీ, లింగాలస్వామి గుడి కాలనీల గిరిజనులు ర్యాలీ నిర్వహించారు.
ఉద్యమం ఉగ్రరూపం
Published Mon, Sep 30 2013 4:04 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement