సాక్షి, అనంతపురం : ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని ముక్కలు చేయరాదంటూ కేంద్ర ప్రభుత్వానికి జిల్లాలోని గ్రామ పంచాయతీ సర్పంచులు విజ్ఞప్తి చేశారు. తామంతా ‘సమైక్య’ రాష్ట్రానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానాలు చేసి.. ఆ ప్రతులను ఢిల్లీకి ఫ్యాక్స్ ద్వారా పంపారు. రాష్ట్ర విభజన ను వ్యతిరేకిస్తూ సర్పంచులు తీర్మానాలు చేయాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చిన విష యం విదితమే. ఇందుకు వారు స్పందిం చారు.
శుక్రవారం పలు పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి...తీర్మానాలను ఆమోదించారు. జిల్లా వ్యాప్తంగా 314 మంది సర్పంచులు తీర్మానం చేశారు. గుంతకల్లు నియోజకవర్గ పరిధిలోని గుంతకల్లు మండలంలో ఏడుగురు, గుత్తిలో 23 మంది, ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ధర్మవరం ఎనిమిది, బత్తలపల్లి ఆరు, ముదిగుబ్బ 11, తాడిమర్రి తొమ్మిది, తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని పెద్దవడుగూరు మండలంలో పది మంది సర్పంచులు తీర్మానం చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని రాయదుర్గం మండలంలో 19మంది, కణేకల్లు 17, గుమ్మఘట్ట 13, డి.హీరేహాళ్ 16, బొమ్మనహాళ్ 19 మంది, రాప్తాడు మండలంలో ఇద్దరు సర్పంచులు తీర్మానాన్ని ఆమోదించారు. శింగనమల నియోజకవర్గంలో 118 పంచాయతీలకు గాను 96 పంచాయతీల్లో ‘సమైక్య’ తీర్మాన పత్రాలపై సంతకాలు చేసిన సర్పంచులు... వాటిని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నేత ఆలూరు సాంబశివారెడ్డికి అందజేశారు.
కళ్యాణదుర్గం మండలంలోని బోరంపల్లి, మండలకేంద్రమైన శెట్టూరు పంచాయతీ సర్పంచులు చేసిన ‘సమైక్య’ తీర్మాన ప్రతులను వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త బి.తిప్పేస్వామికి అందజేశారు. జిల్లాలోని మరో 56 పంచాయతీల్లో కూడా సమైక్య తీర్మానం చేసి ఢిల్లీ పెద్దలకు ఫ్యాక్స్, ఈమెయిల్ చేశారు.
సమైక్యంగా ఉంచాల్సిందే
Published Sat, Nov 2 2013 5:47 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement