ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్ : కార్పొరేషన్‌లో విలీనమైతే తమ గ్రామాల దశ తిరిగినట్టేనని సంతోషించిన వారి కలలు కల్లలే అయ్యాయి. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు సమస్యలేమైనా చెప్పుకుంటే ఒకటి, రెండు రోజుల్లోనే పరిష్కారం అయ్యేవని, ఇప్పుడు అసలు ఎవరికి చెప్పాలో కూడా తెలియడం లేదని అంటున్నారు. ఖమ్మం మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసినప్పుడు పట్టణంతో పాటు పరిసర పది గ్రామపంచాయతీలను ఇందులో విలీనం చేశారు. ఖమ్మం అర్బన్ మండలంలోని ఖానాపురం హవేలీ, బల్లేపల్లి, కొత్తగూడెం, పుట్టకోట, అల్లీపురం, ధంసలాపురం, గొల్లగూడెం, రూరల్ మండలంలోని కైకొండాయిగూడెం, దానవాయిగూడెం, మల్లెమడుగు గ్రామాలను కార్పొరేషన్‌లో కలిపారు. దీంతో ఇత తమ గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని ఆయా గ్రామాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కానీ ఈ ప్రక్రియను ఆగమేఘాల మీద చేపట్టిన అధికారులు ఆ తర్వాత వాటి అభివృద్ధిని విస్మరించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు అశలు అది అడి యాశలే అయ్యాయి.
కళతప్పిన గ్రామాలు...
పంచాయతీలుగా ఉన్నప్పుడు గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు సమస్యలపై దృష్టి సారించేవారు. ఇప్పుడు వీధిలైట్లు వెలగ కపోవడం, చెత్తాచెదారం ఎక్కడివక్కడే ఉండడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాల్వలను శుభ్రం చేసేవారు లేరు. దీంతో దోమలు ప్రబలి జ్వరాల బారిన పడుతున్నామని ఆయా గ్రామాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్ వచ్చి.. హామీ ఇచ్చినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపిస్తున్నారు. జిల్లాలోనే మేజర్ పంచాయతీగా ఉన్న ఖానాపురం హవేలిలో గతంలో పాలకవర్గం ఉన్నప్పుడు ప్రధాన అవసరాలను గుర్తించి పంచాయతీ కార్యదర్శి స్థాయిలోనే సమస్యలు పరిష్కరించేవారు.
అప్పుడు వార్డు సభ్యుడి దృష్టికి సమస్య తీసుకెళ్తే కనీసం వారం రోజులకు పరిష్కారం అయ్యేదని, ఇప్పుడు అధికారులను కలిసేందుకే అవకాశం దొరకడం లేదని హవేలీ వాసులు అంటున్నారు. కార్పొరేషన్‌కు వెళ్తే తమ బాధలు ఎవరికి చెప్పాలో తెలియడం లేదని వాపోతున్నారు. మిగితా గ్రామాల వారిదీ ఇదే పరిస్థితి. సర్పంచ్, వార్డు సభ్యులు ఉన్నప్పుడు వచ్చిన నిధులలో కొన్ని దుర్వినియోగం అయినా, ఎంతోకొంత అభివృద్ధి జరిగేదని, ఇప్పుడు కార్పొరేషన్‌లో విలీనమై ఏడాది గడిచినా.. ఒరిగిందేమీ లేదని ఆయా గ్రామాల వారు అంటున్నారు. తాగునీటి సరఫరా, వీధులను శుభ్రపర్చడం, రోడ్ల మరమ్మతు వంటి విషయాలలో సంబంధిత అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలలో నిల్వ ఉన్న నిధులను తమ ఖాతాలో వేసుకున్న కార్పొరేషన్ అధికారులు.. పనులు చేపట్టడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి తమ గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
మురుగుతో చస్తున్నాం..
మురుగు నీరు నిల్వ చేరి దోమలు, దుర్గంధంతో చస్తున్నాం. పంచాయతీగా ఉన్నప్పుడే నయం. కనీసం నెలలో ఒకసారైనా శుభ్రం చేసేవారు. ఇప్పుడు చెత్తంతా కాల్వల్లో పడి మురుగునీరు పేరుకుపోతోంది. దీంతో దోమలు ప్రబలి జ్వరాలు వస్తాయని భయపడుతున్నాం.
- ఆర్లకుంట్ల అన్నమ్మ, రోటరీనగర్
మా కాలనీకి వస్తే బాధలు తెలుస్తాయి..
బాలాజీ నగర్ వస్తే మా బాధలు తెలుస్తాయి. ఎక్కడ మురుగు అక్కడే చేరడంతోపాటు కాల్వలు పేరకుపోయాయి. వీధుల్లో నడవాలంటేనే కపంరం పుడుతోంది. అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు.
- సారక ధనమ్మ, బాలాజీనగర్
కొంచెం ఖర్చు పెడితే నీటి సమస్య తీర్చవచ్చు
వార్డు సభ్యుడు, బాలాజీనగర్
మా వార్డు పరిధిలో తాగునీటి సమస్య ఉంది. కొద్ది మొత్తం ఖర్చు చేస్తే ఈ సమస్య తీర్చవచ్చు. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో మా కాలనీకి సక్రమంగా నీరు రాక ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిన్నచిన్న సమస్యలు పరిష్కరించాలి.
- బొంకూరి శ్రీనివాస్,
పిల్లలు, వృద్ధులు నడవలేకపోతున్నారు
వీధులు శుభ్రం గా లేకపోవడంతో పిల్లలు, వృద్ధులు నడవలేక జారిపడతున్నారు. పంచాయతీగా ఉన్నప్పుడు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళితే కొన్ని రోజులకయినా పరిష్కరించేవారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోడం లేదు. ఇలా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం.
- వై.సత్యనారాయణ, పాండురంగాపురం
దుర్గంధంతో ఇబ్బంది పడుతున్నాం
రహదారులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయక పోవడంతో చెత్త పేరుకుపోతోం ది. కాల్వల నిండా చెత్త చేరడంతో మురుగునీరు, దుర్గంధంతో నరకం చూస్తున్నాం. అనేక సార్లు అధికారు ల దృష్టికి తీసుకెళ్లినా బాగు చేసేవా రు లేరు. పంచాయతీగా ఉన్నప్పుడే నయం.. కాస్తోకూస్తో అభివృద్ధి జరిగేది.
- రాములు, పాండురంగాపురం
విలీన కష్టాలు..!
Published Thu, Dec 12 2013 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement