ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల కు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన గ్రామసభలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. గతంలో ఇచ్చి న దరఖాస్తులకు మోక్షం లభించలేదని, సమస్యలకు పరి ష్కారం చూపని సభలు ఎందుకని ప్రజలు బహిష్కరిస్తున్నారు. అధికారులను నిలదీస్తున్నారు. ఘెరావ్ చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల అధికారులు రాక, మరికొన్ని చోట్ల ప్రజలు రాక వెలవెలబోతున్నాయి. పంచాయతీ ఎన్నికలు ఉన్నచోట సభలను వాయిదా వేశారు. వీటిని ఈనెల 18 తర్వాత నిర్వహించనున్నారు.
ఏడాదికి నాలుగుసార్లు..
గతంలో గ్రామసభలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించేవారు. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలన ఆరంభమైనప్పటి నుంచి పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కల్పన శాఖ కమిషనర్ ఏడాదికి నాలుగుసార్లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవి జనవరి 2, ఏప్రిల్ 14, జూలై 1, అక్టోబర్ 3వ తేదీల్లో గ్రామసభలు నిర్వహించాలని పేర్కొన్నారు. కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన తర్వాత కూడా ఇదే పద్ధతి కొనసాగుతోంది. అక్టోబర్‌లో ఒకసారి గ్రామసభలు నిర్వహించారు. జనవరి 2 నుంచి 10వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించాలని కమిషనర్ నుంచి ఆదేశాలు జారీ కాగా, గ్రామసభలు జరుగుతున్నాయి.
గతంలో అధికారులు సభల్లో తప్పనిసరి పాల్గొనాలని నిబంధన ఉండేదికాదు. అయితే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, మండల అభివృద్ధి అధికారులు, పంచాయతీ విస్తరణ అధికారి, విభాగ పంచాయతీ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయి అధికారులతో గ్రామసభ నిర్వహించాలని కమిషనర్ సూచించడం, ఈ మేరకు కలెక్టర్, డీపీవోలు కూడా క్షేత్రస్థాయి అధికారులు కచ్చితంగా పాల్గొనాలని ఆదేశించారు.
చర్చించే అంశాలు ఇవే..
గ్రామపంచాయతీలకు సంబంధించిన 29 అంశాలను గ్రామసభలో చర్చించేందుకు క్షేత్రస్థాయి అధికారులను భాగస్వాములను చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. 17 శాఖల క్షేత్రస్థాయి అధికారులు తప్పనిసరిగా పాల్గొనే విధంగా జిల్లా అధికారులు చూడాలని పేర్కొన్నారు. అయితే గతంలో సభల్లో చెప్పిన సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో గ్రామీణుల్లో నిరుత్సాహం వ్యక్తమవుతుంది. దీంతో కొన్నిచోట్ల నిధులు లేని సభలెందుకంటూ బహిష్కరిస్తున్నారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఒకరిద్దరు క్షేత్రస్థాయి అధికారులు మినహాయిస్తే అన్ని శాఖల నుంచి సిబ్బంది పాల్గొనడం లేదు. సభలో పంచాయతీ వార్షిక లెక్కలు, ఆడిట్ రిపోర్ట్, గతేడాది పాలన నివేదిక, బడ్జెట్, వార్షిక నివేదికలు లేని కొత్త పన్నుల కార్యక్రమాలు, కొత్త పన్నులు విధించుట, పన్నుల పెంపుకు కార్యక్రమాలు, పథకాలు, లబ్ధిదారులను, ప్రాంతాలను గుర్తించుట వంటివి ముఖ్య ఉద్దేశం. వీటితోపాటు తాగునీటి సమస్య, పారిశుధ్యం, ప్రజాపంపిణీ వ్యవస్థ, వ్యవసాయ సమస్యలు, విద్యుత్ సరఫరా, చిన్ననీటి పారుదల, రోడ్లు, కల్వర్టులు, నీటి మార్గాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనితీరు తదితర అంశాలను ఇందులో చర్చించవచ్చు.
డీపీఓ పోచయ్య వివరణ..
ఒకే పంచాయతీలో రెండు మూడు చోట్ల గ్రామసభలు ఉండడంతో అన్నిచోట్ల అధికారులు పాల్గొనలేకపోతున్నారు. నిర్లక్ష్యం ప్రదర్శించి అధికారులు గైర్హాజరైన పక్షంలో మండల అధికారులు ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాం. తద్వారా అధికారులపై చర్యలు తీసుకుంటాం. అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని కమిషనర్‌తోపాటు కలెక్టర్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. గ్రామీణులు గ్రామసభలను ఉపయోగించుకోవాలి. ముందుగా నిధులు విడుదల అనేది ఉండదు. సభలో ప్రస్తావించి తీర్మానం చేసి ప్రతిపాదనలు పంపిన పక్షంలో దానికి ఉన్నతాధికారులు పరిశీలించి నిధులు విడుదల చేస్తారు.
మొక్కుబడి సభలు
Published Tue, Jan 7 2014 2:10 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement