grama sabha
-
బతికుండగానే చంపేశారు
సాక్షి, శంషాబాద్ రూరల్: ఓ మహిళను బతికుండగానే అధికారులు చంపేశారు.. రికార్డుల్లో చనిపోయినట్లు నమోదు కావడంతో ఆమెకు వితంతు పింఛన్ మంజూరు కావడంలేదు.. పింఛన్ కోసం ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగిన ఆమె చివరకు గ్రామసభలో తన గోడు వెళ్లపోసుకుంది.. తనకు న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కిరోసిన్ డబ్బాను చూపిస్తూ గ్రామసభలో ఆందోళనకు దిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని ముచ్చింతల్‌కు చెందిన బీర్ల మణెమ్మ(48) భర్త సత్తయ్య 2018లో మృతి చెందాడు. దీంతో ఆమె వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకుంది. ఎన్నిసార్లు పంచాయతీ అధికారుల చుట్టూ తిరిగినా పలు రకాల కారణాలు చెబుతూ వచ్చారు. చివరకు ఆమె కూడా చనిపోయినట్లు రికార్డులో నమోదు అయినందున పింఛను రావడంలేదని చెప్పారు. దీంతో సోమవారం జరిగిన గ్రామ సభకు కిరోసిన్ బాటిల్‌తో వచ్చి ఆందోళన చేపట్టింది. తనకు ఎలాంటి ఆధారం లేదని పింఛను మంజూరు చేయాలని వేడుకుంది. తనకు ప్రతి నెలా రేషన్ కూడా వస్తుందని, పింఛను మంజూరు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారుల దృష్టికి తీసుకెళ్లాం మణెమ్మ పేరుతో 2018 డిసెంబర్ వితంతు పింఛను మంజూరైంది. అప్పటి నుంచి వరుసగా మూడు నెలల పాటు ఆమె పింఛన్ డబ్బులు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో పింఛన్ నిలిచిపోయింది. నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె పింఛన్ కోసం మళ్లీ దరఖాస్తు చేస్తే విషయం తెలిసింది. మణెమ్మ బతికి ఉన్నట్లు ఆమె పేరుతో పింఛను మంజూరు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆన్లైన్ ప్రక్రియ కూడా పూర్తి చేశాం. – రాజుకుమారి, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, ముచ్చింతల్. (చదవండి: నీ జీవితం నువ్వు చూసుకో.. భార్యకు మెసేజ్ చేసి హోంగార్డు ఆత్మహత్య) -
నేడు వాసాలమర్రికి కేసీఆర్
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామస్తులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. 2020 అక్టోబర్ 31న ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక భవనాన్ని ప్రారంభించి తిరుగుప్రయాణంలో ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌కు వెళ్తూ వాసాలమర్రిలో ఆగి గ్రామస్తులతో మాట్లాడిన విషయం విదితమే. అప్పట్లో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రానున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి తరహాలో వాసాలమర్రిని అభివృద్ధి చేస్తానని గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయం విదితమే. కేసీఆర్ తొలుత గ్రామస్తులతో కలసి సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం గ్రామసభలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గ్రామస్తుల్లో ఆనందం తెలంగాణ ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉన్న ఈ మారుమూల పల్లెకు ఇప్పుడు మహర్దశ పట్టబోతోంది. సీఎం రాకతో ఏళ్లతరబడి అభివృద్ధికి నోచుకోని వాసాలమర్రి రూపురేఖలు పూర్తిగా మారనున్నాయన్న విశ్వాసంతో గ్రామస్తులు ఉన్నారు. గ్రామసభలో సీఎంతో తాము నేరుగా మాట్లాడుతామన్న ఆనందం వారిలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారులు, పాఠశాలలు, సామాజిక పింఛన్లు, మౌలిక సదుపాయాల కల్పన, డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం, యువతకు ఉపాధి అవకాశాలు, వ్యవసాయం, పాడిపరిశ్రమతో పాటు గ్రామ సమగ్రాభివృద్ధి ప్రణాళికను సర్పంచ్ పోగుల ఆంజనేయులు అధ్యక్షతన జరిగే సభలో ఆమోదించనున్నారు. నివేదిక సిద్ధం గ్రామ సమగ్రాభివృద్ధికి అధికారులు ఇప్పటికే ప్రణాళిక రూపొందించి నివేదిక సిద్ధం చేశారు. శిథిలావస్థలో ఉన్న 670 పాత ఇళ్ల స్థానంలో డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మించనున్నారు. అలాగే 5 వేల మీటర్ల మేర సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, గ్రామ పంచాయతీ భవనం, రెండు అంగన్వాడి భవనాలు, 120 మంది యువతకు రుణాలు, స్కిల్, అన్‌స్కిల్డ్ యువతకు స్వయం ఉపాధి పథకాలు, వాహనాలు, హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, డెయిరీ యూనిట్లు, సీడ్ ప్లాంట్, వ్యవసాయ బోరు బావులు, ఫంక్షన్ హాల్, పీహెచ్సీ సెంటర్, విద్యుత్ సబ్‌సెంటర్, పాడిపశువుల పంపిణీ, భూమి లేని రైతు కూలీలకు భూములు, పంటల రక్షణకు అటవీ భూముల చుట్టూ కంచె ఏర్పాటుతో పాటు మరికొన్ని అంశాలపై గ్రామసభలో తీర్మానం చేయనున్నారు. మా ఊరు అన్ని రంగాల్లో బాగుపడాలి సీఎం దత్తత తీసుకున్న తర్వాత మా వాసాలమర్రి అన్ని రంగాల్లో బాగుపడుతుందని ఆ శిస్తున్నాం. గ్రామాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రతి అంశాన్ని సీఎంకు విన్నవిస్తాం. విద్యార్థులు, వ్యవసాయదారులు, మహిళలు, నిరుద్యోగుల భవిష్యత్ మారుతుందని గ్రామస్తులు ఆశతో ఉన్నారు. – పోగుల ఆంజనేయులు, సర్పంచ్ సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ మా ఊరి అభివృద్ధికి పూనుకోవడం, ప్రత్యేకంగా నేడు గ్రామానికి వ స్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. గ్రామస్తు లందరూ ఆనం దం వ్యక్తం చేస్తున్నారు. మా ఊరి సమస్యలు, అభివృద్ధి గురించి సీఎం దృష్టికి తీసుకుపోతాం. గ్రామంలో పండుగ వాతావరణంలా ఉంది. – జహంగీర్, గ్రామస్తుడు వానకు ఇల్లు కురుస్తుంది మాది ఎనకటి నుంచి పెంకుటిల్లు. కోతులు పెంకలు పగుల గొట్టడంతో వర్షానికి ఇల్లు మొత్తం కురుస్తుంది. ముఖ్యమంత్రి సార్ మా ఊరును దత్తత తీసుకున్నడని సంతోషంగుంది. మాకు గూడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తదని ఆశతో ఉన్నాం. – తడక కనకలక్ష్మి, వాసాలమర్రి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి సీఎం కేసీఆర్ మా ఊరిని అభివృద్ధి చేసేందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. గ్రామంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే బాగుంటది. గ్రామసభలో మాట్లాడే అవకాశం వస్తే ఈ విషయం గురించి సీఎం సార్ దృష్టికి తీసుకుపోతా. సీఎం వస్తుండటంతో గ్రామానికి కళ వచ్చింది. – కె.కిష్టమ్మ, గ్రామస్తురాలు -
'గ్రామ సభలు నిర్వహించకుంటే కఠిన చర్యలు తీసుకుంటా'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పల్లె ప్రగతి, పట్టణ పురోగతిపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. '' ఈనెల 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతా. ఈనెల 21న వరంగల్ జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి పనులపై తనిఖీలు చేస్తా. 10 రోజులు సమయం ఇచ్చి తనిఖీలకు వస్తా. గ్రామ సభలు నిర్వహించకుంటే సర్పంచ్‌లు, కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటాం'' అని తెలిపారు. -
గ్రామసభల్లో ఇళ్లపట్టాల అర్హుల జాబితా
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో గ్రామసభలు నిర్వహించి ఇళ్లపట్టాలకు అర్హులైన వారి జాబితాలను ప్రచురించనున్నట్లు జాయింట్ కలెక్టర్ మార్కండేయులు తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి జిల్లావ్యాప్తంగా ఈనెల 15 వరకు గ్రామసభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇళ్లు లేని వారికి ఇళ్ల పట్టాలను అందజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు గుర్తించిన అర్హుల జాబితాను గ్రామసభల్లో ప్రచురించనున్నట్లు తెలిపారు. ప్రచురించిన అర్హుల జాబితాలో ఏవైనా పొరపాట్లు, అభ్యంతరాలు, అర్హుల పేర్లు నమోదు కాకపోయినా తెలియజేసేందుకు అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. జిల్లాలోని 1,542 రెవెన్యూ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తహసీల్దార్, ఎంపీడీవో, ఇతర శాఖల అధికారులతో సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇళ్లు లేనివారు లక్ష మంది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 60 వేలు, పట్టణ ప్రాంతాల్లో 40 వేలు ఇళ్లు లేని వారు ఉంటారని జేసీ తెలిపారు. వారందరికీ ఉగాది నాటికి ఇళ్లపట్టాలు అందజేయనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని 60 వేల మందిలో 47 వేల మందికి, అర్బన్‌లోని 40 వేల మందిలో 15 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భూమిని గుర్తించినట్లు తెలివారు. పట్టణ ప్రాంతాల్లో స్థలం కొరత ఉందన్నారు. 570 ఎకరాలు కొనాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఏప్రిల్ నుంచి సన్న బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. -
పరిష్కారమే ధ్యేయం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూసంబంధిత సమస్యల పరిష్కారానికి పల్లెల్లో మరోసారి గ్రామసభలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. తొలివిడతలో నిర్వహిస్తున్న సభల్లో బాధితుల నుంచి అధిక సంఖ్యలలో దరఖాస్తులు అందుతున్న విషయం తెలిసిందే. ఇందులో నిర్దిష్ట గడువులోపు ఎన్ని పరిష్కరించారో తెలుసుకునేందుకు రెండోసారి సభలు తలపెట్టాలని యంత్రాంగం యోచిస్తోంది. గ్రామసభల్లో అప్పటికప్పుడు కొన్ని సరళమైన సమస్యలు పరిష్కరిస్తున్నప్పటికీ.. మరికొన్నింటికి కొన్ని రోజుల సమయం పడుతోంది. ఈ నిర్దిష్ట గడువులోపు అధికారులు పరిష్కరించారా? లేదా? లేకుంటే ఎందువల్ల జాప్యం జరిగింది.. ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారా? ఇంకేమైనా జఠిల సమస్యలు ఉన్నాయా.. తదితర వివరాలు రాబట్టేందుకు తొలిసారి గ్రామసభలు నిర్వహించిన పల్లెల్లో... రెండోసారి సభలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. వీలైతే వచ్చే సోమవారమే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇదీ పరిస్థితి.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. వారంలో మూడు రోజలుపాటు గ్రామసభలు నిర్వహించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తున్నారు. గత నెలలో ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. రాజేంద్రనగర్ మినహా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, కందుకూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో సోమ, మంగళ, బుధవారాల్లో గ్రామసభలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని పదుల సంఖ్యల గ్రామాల్లో ఈ సభలు ముగిశాయి. ఒక్కో డివిజన్లో సగటున 250 నుంచి 350 వరకు బాధితుల నుంచి అధికారులకు దరఖాస్తులు అందాయి. కొన్ని గ్రామాల్లో సభలు జరిగి దాదాపు నెల రోజులు కావొస్తున్నాయి. ఈ గ్రామాల్లో ఎన్ని దరఖాస్తులకు మోక్షం కలిగిందో రెండోసారి గ్రామసభ నిర్వహించి ఆరా తీయనున్నారు. తప్పులు పునరావృతం కాకుండా.. సమస్యల పరిష్కారంలో కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేయడానికి కూడా యంత్రాంగం చర్యలు చేపట్టనుంది. గ్రామ సభల నిర్వహణ, అధికారులు తీసుకుంటున్న దరఖాస్తులు, పరిష్కారం తదితర వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పనిచేస్తున్న లేదా ఇతర జిల్లాల అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించే వీలుందని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవంగా రికార్డుల ప్రక్షాళన సమయంలో చాలావరకు కిందిస్థాయి అధికారులు ఉద్దేశపూర్వకంగానే తప్పులు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని సాకుగా చూపి డబ్బులు దండుకోవడం పరిపాటిగా మారింది. మళ్లీ ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తగా ఆర్డీఓ స్థాయి వ్యక్తులను ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. డిజిటల్ సంతకం 88 శాతం పూర్తి జిల్లా వ్యాప్తంగా 10.98 లక్షల సర్వే నంబర్లలో భూములు ఉన్నాయి. ఇప్పటికే 9.60 లక్షల సర్వేనంబర్లపై ఎటువంటి కిరికిరి లేదు. దీంతో వీటికి సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసేందుకు డిజిటల్ సంతకం పూర్తయింది. ఇవిపోను మరో 1.38 లక్షల సర్వే నంబర్లు మిగిలాయి. ఇందులో ప్రభుత్వ భూములకు సంబంధించి 45 వేల సర్వే నంబర్లు ఉన్నాయి. ఈ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీ ఉండదు. దీంతో డిజిటల్ సంతకం చేయాల్సిన పనిలేదు. ఇక 36 వేలకు సర్వే నంబర్లు.. భూ వినియోగ మార్పిడి కింద ఉన్నాయి. వీటికీ డిజిటల్ సంతకంతో పనిలేదు. ఇవన్నీ మినహాయించగా మరో 7,514 సర్వే నంబర్లకు సంబంధించి సంతకం పెండింగ్‌లో ఉంది. 2,200 సర్వే నంబర్లల్లో భూమి కలిగి ఉన్న వ్యక్తులు తమ ఆధార్ నంబర్ అందజేసేందుకు ఇష్టపడడం లేదు. దీంతో సంతకం చేయడం కుదరదు. మరో 5,300 సర్వే నంబర్లకు సంబంధించి ఆధార్ నంబర్లు అందజేసినా.. భూ విస్తీర్ణంలో తేడాలు కనిపించడంతో అధికారులు పెండింగ్‌లో ఉంచారు. ఆర్ఎస్ఆర్ (రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్) ఆధారంగా వీటిని పరిష్కరించనున్నారు. (1)బి సర్వే నంబర్ల ప్రదర్శన వివాదాస్పదంగా ఉన్న ఆయా సర్వే నంబర్లను (1)బి జాబితాలో అధికారులు చేర్చారు. ఇలా జిల్లావ్యాప్తంగా 40 వేలకుపైగా సర్వే నంబర్లు ఉన్నాయి. అయితే, ఏయే సర్వే నంబర్లను ఈ జాబితాలోకి ఎక్కించారు.. ఎందుకు నమోదు చేశారు.. అనే విషయాలు సంబంధిత రైతులకు తెలియడం లేదు. ఫలితంగా పట్టాదారు పాసు పుస్తకాల కోసం నెలల తరబడి కర్షకులు ఎదురుచూస్తున్నారు. (1)బి జాబితాలో ఉన్న సర్వే నంబర్లను ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. రెండు గ్రామసభల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని దాదాపుగా నిర్ణయించింది. -
పంచాయతీ ని‘బంధనాలు’
సాక్షి, అల్గునూర్: పంచాయతీ పాలకవర్గాలు ఇకపై లేఅవుట్ల అనుమతి విషయంలో ఆచితూచి వ్యవహించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం లేని లేఅవుట్లను సరిచూసుకోకుండా మామూళ్లు తీ సుకుని ఎవరికైనా అనుమతి ఇస్తే ఆ గ్రాపంచాయ తీ పాలకవర్గం రద్దయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో కఠినమైన నిబంధనలు చేర్చి పకడ్బందీగా అమలు చేస్తోంది. నగరాలు, పట్టణాల శివారు గ్రామాల్లోని అక్ర మ లేఅవుట్లు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం నిబంధనలు కఠినం చేసింది. ఇవీ నిబంధనలు అమల్లోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం 2018 మా ర్చి 18 వరకు ఉన్న లేఅవుట్ల జాబితాలను కొత్త పాలకవర్గాలు ప్రకటించిన అనంతరం వాటిపై చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లోని వ్యవసాయ భూమిని ఇళ్లస్థలాలుగా మార్చేందుకు ముందుగా వ్య వసాయ భూమి చట్టం కింద రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా భూ మార్పిడి ప్రక్రియ తర్వాతే లేఅవుట్ ప్రతిపాదన దరఖాస్తును గ్రామపంచాయతీలకు ఇవ్వాలి. వాటిని ఏడురోజుల్లో జిల్లా టౌన్, కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) అనుమతి జారీచేసే సంస్థలకు పంపాలి. ఈ గడువులోపు గ్రామపంచాయతీ నిర్ణయం తీసుకోకున్నా అనుమతి ఇచ్చినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని చట్టంలో ఉంది. లే అవుట్లలో డ్రెయినేజీ, రోడ్డు, వీధిదీపాలు, తాగునీటి వ్యవస్థ ఏర్పాటుచేయాలని సాంకేతిక కమిటీ లేఅవుట్ నిర్వాహకులకు సూచిస్తోంది. లేఅవుట్ పరిధిలోని సామూహిక స్థలాలు, రోడ్లను పంచాయతీపేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలి. అన్నింటినీ పరిశీలించిన డీటీసీపీ నెలలోపు ఆమోదించాల్సి ఉంటుంది. లేఅవుట్ నిర్వాహకులు విక్రయానికి ప్రతిపాదించే మొత్తం స్థలంలో 15 శాతాన్ని గ్రామపంచాయతీకి తనఖా పెట్టాలి. అయితే గ్రామకంఠం స్థలానికి ఈ నిబంధనలు వర్తించవు. లేవుట్‌లో ప్రజావసరాలకు కేటాయించిన స్థలాన్ని ఎవరికైనా విక్రయిస్తే మూడేళ్లవరకు జైలుశిక్ష ఉంటుంది. డీటీసీపీ కమిటీ ఆదేశాలు లేకుండా లేఅవుట్‌కు అనుమతి ఇస్తే గ్రామపంచాయతీ పాలకవవర్గం రద్దవుతుంది. చట్టం క్రమబద్దీకరణ అంశం అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ అంశాన్ని చట్టం లో పొందుపరిచారు. లేఅవుట్లలో నిర్దేశిత అవసరాలకు అనుగుణంగా అనుమతులు లేనప్పుడే అది అక్రమం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వసతుల కల్పనకు అవకాశం కల్పిస్తారు. నిబంధనలకు అనుగుణంగా వసతులు కల్పించిన తర్వాతే లే అవుట్‌ను క్రమబద్దీరిస్తారు. అయితే లేఅవుట్‌కు వినియోగించే స్థలానికి అప్పటి మార్కెట్ విలువ తో పోలిస్తే పదిశాతం మొత్తాన్ని గ్రామపంచాయతీకి చెల్లిస్తే క్రమబద్దీకరించేందుకు అవకాశం ఉంటుంది. అక్రమ లే అవుట్లో వసతులు కల్పించే విషయంలో విఫలమైతే దాన్ని అక్రమంగానే నిర్ధారిస్తారు. ఎంతమొత్తం చెలిచినా దీని క్రమబద్దీకరించే అవకాశం ఉండదు. ఇవి పాటించాల్సిందే కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇప్పటి నుంచి అనుమతులు ఉన్నవాటినే కొనసాగిస్తారు. వ్యవసాయ భూమిని కమర్షియల్ భూమిగా మా ర్చేందుకు మొదటగా ఆర్డీఓకు దరఖాస్తు చేసుకోవాలి. అనతరం. రికార్డులను గ్రామపంచాయతీలకు అప్పగించాలి. వాటిని గ్రామపంచాయతీ అధికారులు సాంకేతిక నిర్ణయం కోసం టౌన్‌ప్లానింగ్ అధికారులకు పంపుతారు. రెండున్నర ఎకరాలకు జిల్లాస్థాయి, ఐదు ఎకరాలలోపు రీజియన్ స్థాయి, ఆపై దాటితే రాష్ట్రస్థాయి టౌన్ ప్లానింగ్ అధికారుల సర్వేచేసి అనుమతులు ఇస్తారు. నివేదికను రెవెన్యూ, గ్రామపంచాయతీ అధికారులకు పంపుతారు. దీనిపై పంచాయతీ వారు గ్రామసభలో తీ ర్మాణిస్తారు. దరఖాస్తుదారులు 15శాతం భూమిని ప్రజాప్రయోజనాల కోసం ఖాళీగా వదిలేయాలి. వ్యవసాయ భూమిని కమర్షియల్ భూమిగా మా ర్చేందుకు మార్కెట్ విలువ ప్రకారం(రిజిస్ట్రేషన్ లెక్క ప్రకారం) ఎకరా లక్ష ఉంటే అందులో రూ. 10వేల ఫీజు రెవెన్యూ అధికారులు వసూలు చేసి అనంతరం లేఅవుట్ మంజూరుచేస్తారు. లేఅవుట్ ఉంటే సబ్ రిజిస్ట్రార్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలి. -
గ్రామ సభ నిర్వహిస్తాం..
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ పరిధిలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూమిని సేకరించేందుకు చట్ట ప్రకారం గ్రామసభ నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నాకే భూ సేకరణను కొనసాగిస్తామని తెలిపింది. ప్రభుత్వ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్లన్నసాగర్ కోసం చేస్తున్న భూ సేకరణకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేయడం లేదని, అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ప్రభుత్వం సమయం ఇవ్వడం లేదంటూ రైతు తిరుపతి, మరో 29 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ప్రాజెక్టుకు అనుమతులు రాక ముందే ప్రభుత్వం పనులు ప్రారంభించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. జీవో 123 కొట్టేసిన తరువాత పలు గ్రామాల్లో 1,600 ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఈ విషయంలో పూర్తి వివరాలను తెలుగులో ఇవ్వాలని కోరినా పట్టించుకోవడం లేదని వివరించారు. ముందస్తు సమాచారం లేకుండా నోటీసులు జారీ చేశారన్నారు. అభ్యంతరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదన్నారు. గ్రామ సభ నిర్వహించకుండానే భూ సేకరణను ప్రభుత్వం కొనసాగిస్తోందని వివరించారు. అందువల్ల భూ సేకరణపై స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) డి.ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ గ్రామ సభ నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
గ్రామ సభను బహిష్కరించిన రైతులు
పంట నష్టపరిహారం ఇవ్వలేదని అధికారులపై ఆగ్రహం ఆస్పరి: పంట నష్టపరిహారం మంజూరై నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు తమ బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని మండలంలోని కైరుప్పల రైతులు వ్యవసాయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని కైరుప్పల గ్రామంలో సర్పంచ్ శరవన్న అధ్యక్షతన గ్రామ సభ ఏర్పాటు చేశారు. సీపీఐ నాయకులు నాగేంద్రయ్య, విరుపాక్షి ఆధ్వర్యంలో ఆ సభను రైతులు బహిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ 2015 సంవత్సరానికి సంబంధించి 1150 మంది రైతులకు పంట నష్టపరిహారం మంజూరైందన్నారు. నేటికి వారి ఖాతాలో పంట నష్టపరిహారం జమకాలేదన్నారు. అకౌంట్లలో జమ చేసే వరకు గ్రామంలో ఏ సమవేశాలు, సభలు నిర్వహించరాదని రైతులు వ్యవసాయాధికారులను అడ్డుకున్నారు. దీనిపై ఏఓ పవన్ కుమార్ మాట్లాడుతూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని త్వరలోనే పరిహారం అకౌంట్లలో జమ అవుతుందన్నారు. అనంతరం మండలంలోని కారుమంచి, డీకోటకొండ గ్రామాలో్ల వ్యవసాయాధికారులు గ్రామ సభలు నిర్వహించి ఖరీఫ్ ప్రణాళికపై రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో ఏఈఓలు జయరాం, షేక్షావలి, ఎంపీఈఓలు హరిత, ఇందిర, మౌనిక, చంద్రశేఖర్, వెంకటేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
రేపు ప్రత్యేక గ్రామ సభలు
కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు, పౌరుల అవసరాలపై చర్చించి నిర్దిష్టమైన అభిప్రాయాల సేకరణలో భాగంగా ఈ నెల 26న జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయితీల్లో ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి కే ఆనంద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు గ్రామ సభలను నిర్వహించి పౌరుల అవసరాలను గుర్తించాలని, తీర్మానాలు, ఫొటోలను తీయించి నివేదికలను అందించాలని సూచించారు. జిల్లాలోని డివిజనల్ పంచాయతీ అధికారులు అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. -
నీళ్లు నమిలారు.. నోళ్లు నొక్కారు
చాలాచోట్ల ముగిసిన జన్మభూమి గ్రామసభలు ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో ఈ నెల 2న ప్రారంభమైన జన్మభూమి గ్రామసభలు చాలాచోట్ల మంగళవారంతో ముగిశాయి. ఇటు ప్రజాప్రతినిధులు.. అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సభలు ప్రారంభమైన నాటినుంచి ప్రజలు ప్రతిచోట అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీయడంతో సమాధానం చెప్పలేక కొన్ని ప్రాంతాల్లో వారి నోళ్లు మూయించేందుకు ప్రయత్నించగా.. మరికొన్ని చోట్ల ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు రెండుమూడు సభలకు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన సభలను స్థానిక ప్రజాప్రతినిధులతో కానిచ్చేశారు. ఉన్నతాధికారులు సైతం జన్మభూమి సభల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సభలకు హాజరైనవవారు మాత్రం ప్రజలకు సమాధానం చెప్పలేక గుండెలు బిగబట్టుకుని దిక్కులు చూశారు. పింఛన్లు.. ఇళ్ల స్థలాల కోసం నిలదీత జన్మభూమి సభలకు ప్రతిచోట జనం పలుచగా హాజరయ్యారు. పింఛన్లు రద్దయిన వారు కన్నీటి పర్యంతం కాగా.. గత గ్రామసభల్లో పింఛన్లు, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ సభలకు వచ్చి.. తాము పెట్టుకున్న అర్జీలు ఏమయ్యాయంటూ ప్రజాప్రతినిధులు, అధికారులను దులిపేశారు. -
నీళ్లు నమిలారు.. నోళ్లు నొక్కారు
చాలాచోట్ల ముగిసిన జన్మభూమి గ్రామసభలు ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో ఈ నెల 2న ప్రారంభమైన జన్మభూమి గ్రామసభలు చాలాచోట్ల మంగళవారంతో ముగిశాయి. ఇటు ప్రజాప్రతినిధులు.. అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సభలు ప్రారంభమైన నాటినుంచి ప్రజలు ప్రతిచోట అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీయడంతో సమాధానం చెప్పలేక కొన్ని ప్రాంతాల్లో వారి నోళ్లు మూయించేందుకు ప్రయత్నించగా.. మరికొన్ని చోట్ల ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు రెండుమూడు సభలకు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన సభలను స్థానిక ప్రజాప్రతినిధులతో కానిచ్చేశారు. ఉన్నతాధికారులు సైతం జన్మభూమి సభల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సభలకు హాజరైనవవారు మాత్రం ప్రజలకు సమాధానం చెప్పలేక గుండెలు బిగబట్టుకుని దిక్కులు చూశారు. పింఛన్లు.. ఇళ్ల స్థలాల కోసం నిలదీత జన్మభూమి సభలకు ప్రతిచోట జనం పలుచగా హాజరయ్యారు. పింఛన్లు రద్దయిన వారు కన్నీటి పర్యంతం కాగా.. గత గ్రామసభల్లో పింఛన్లు, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ సభలకు వచ్చి.. తాము పెట్టుకున్న అర్జీలు ఏమయ్యాయంటూ ప్రజాప్రతినిధులు, అధికారులను దులిపేశారు. -
'నామమాత్ర సభల వల్ల నిష్ప్రయోజనమే'
కొత్తూరు: గ్రామసభల్లో ప్రజలు భాగస్వాములయ్యేలా సర్పంచ్, వార్డు సభ్యులు కృషిచేయాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం మంత్రితో పాటు పంచాయతీరాజ్ కమిషనర్ నీతూప్రసాద్, డీపీవో పద్మజారాణి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి పంచాయతీకి ఇంటి పన్నులు, పరిశ్రమల అనుమతులు... వెంచర్ల నుంచి వస్తున్న ఆదాయ వివరాలను తెలుసుకుని, రికార్డులను పరిశీలించారు. గ్రామ సభల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని, తద్వారా వారికి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై అవగాహన పెరిగి సద్వినియోగం చేసుకుంటారని చెప్పారు. నామమాత్రంగా సభలు నిర్వహించడం వల్ల ప్రయోజనం లేదని జూపల్లి పేర్కొన్నారు. -
మా భూములతో మీ వ్యాపారం ఏంటీ ?
పెనమలూరు : ‘మా భూములతో ప్రభుత్వం వ్యాపారం చేయడం ఏంటీ... మెట్రో రైల్ ప్రాజెక్టుకు మా భూములు ఇవ్వలేం..’ అని కానూరు, పోరంకి గ్రామాల రైతులు స్పష్టంచేశారు. మెట్రోరైలు ప్రాజెక్టుకు భూసేకరణపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కానూరు, పోరంకి గ్రామాల్లో బుధవారం గ్రామసభలు నిర్వహించారు. సబ్ కలెక్టర్ డాక్టర్ సృజన, మెట్రోరైల్ ప్రాజెక్టు డెప్యూటీ డైరెక్టర్ రంగారావు, భూసేకరణ అధికారి, డీఆర్డీఏ పీడీ డి.చంద్రశేఖరరాజు పాల్గొన్నారు. మండలంలో ఆరు మెట్రో రైల్వేస్టేçÙన్ల ఏర్పాటుకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరించాలని భావిస్తున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. దీనిపై రైతులు, ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. రంగారావు మాట్లాడుతూ బందరు రోడ్డు మధ్యలో మెట్రోరైలు ప్రాజెక్టు వస్తుందని, స్టేషన్లకు భూసేకరణ చేయాల్సి ఉందని చెప్పారు. అభ్యంతరం తెలిపిన రైతులు రెండు గ్రామ సభల్లోనూ భూసేకరణకు రైతులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. భూసేకరణ ఏయే సర్వే నంబర్లలో చేస్తారనే విషయం ప్రకటించకుండానే గ్రామసభలు ఎందుకని అధికారులను ప్రశ్నించారు. భూముల మార్కెట్ ధరకు, ప్రభుత్వం చెల్లించే పరిహారానికి చాలా తేడా ఉంటుందని, కాబట్టి తమ భూములను ఇవ్వలేమని స్పష్టం చేశారు. అయినా రైతుల భూములు తీసుకుని ప్రభుత్వం వ్యాపారం చేయటమేమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు వేసిన మార్కింగ్ ప్రకారం భూములు ఇస్తే భవిష్యత్‌లో తమ పొలాల్లోకి వెళ్లటానికి దారి కూడా ఉండదన్నారు. ఈ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రాజెక్టు డిజైన్ సరిగాలేదని కొందరు రైతులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో భూసేకరణ లేకుండానే మెట్రో స్టేషన్లు నిర్మించారని తెలిపారు. అవసరం మేరకు భూములు తీసుకుంటే సహకరిస్తామన్నారు. అధికారులు వేసిన మార్కింగ్ ప్రకారం బందరు రోడ్డు విస్తరణకు, మెట్రో ప్రాజెక్టుకు భూములు ఇచ్చి తాము అనాథలుగా మారాలా.. అని స్థానికులు నిలదీశారు. రైతుల అభ్యంతరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడు తూ ప్రజల అభ్యంతరాలను అధికారులు గుర్తించాలని, ఇతర ప్రాంతాల్లోని డిజైన్లు, స్టేషన్లు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. సర్పంచ్‌లు సోమయ్య, స్వరూపారాణి, తహసీల్దార్ మురళీకృష్ణ పాల్గొన్నారు. మెట్రోపై వారంలో తుది నివేదిక విజయవాడ : వారం రోజుల్లో మెట్రోరైల్ ప్రాజెక్టుపై తుది నివేదిక ఇస్తామని సబ్–కలెక్టర్ డాక్టర్ జి.సృజన చెప్పారు. భూసేకరణ నిర్వాసితులతో ఆమె బుధవారం సబ్–కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. భూసేకరణపై ప్రయివేటు ఏజెన్సీతోపాటు ప్రభుత్వం కూడా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు సృజన తెలిపారు. ప్రజలు చెప్పే విషయాలను నివేదికగా రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. విజయవాడలో కీలకమైన బందరు రోడ్డులో మెట్రో ప్రాజెక్టు వల్ల తీవ్రంగా నష్టపోతామని పలువురు వ్యాపారులు తెలిపారు. నగరం మీదుగా వెళ్తున్న కాలువలపై మెట్రో రైల్ లైను నిర్మించాలని ఆటోనగర్‌కు చెందిన శ్రీనివాసరావు కోరారు.ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఈ ప్రాజెక్టును చేపట్టవద్దని నగరానికి చెందిన వెంకట్రావు, పూర్ణచంద్రరావు విన్నవించారు. ఈ సమావేశంలో అర్బన్ తహసీల్దార్ ఆర్.శివరావు, కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, తదితరులు పాల్గొన్నారు. Sమెట్రో కోచ్ డిపోకు వ్యతిరేకంగా తీర్మానం రామవరప్పాడు : నిడమానూరులో మెట్రో రైల్ కోచ్ డిపో నిర్మాణానికి వ్యతిరేకంగా పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. నిడమానూరు పంచాయతీ కార్యాలయంలో బుధవారం సాధారణ సమావేశం సర్పంచ్ దామెర్ల కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అజెండాలోని అంశాలను పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ వివరించారు. మెట్రో రైల్ మార్గానికి తాము వ్యతిరేకం కాదని, గ్రామంలో నిర్మించతలపెట్టిన మెట్రో కోచ్ డిపోకు మాత్రమే తామంతా వ్యతిరేకమని గ్రామస్తులు, రైతులు ఈ సమావేశంలో తెలిపారు. పంచాయతీ పాలకవర్గ సభ్యులు కూడా గ్రామంలో కోచ్ డిపో నిర్మించవద్దని తీర్మానం చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు అనుకూలంగా తీర్మానాలు చేశారు. -
'హెచ్‌సీయూ లాంటి ఘటనలు పునరావృతం కాకూడదు'
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు లేకుండా చేస్తామని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ నగరంలోని కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన గ్రామసభలో వెంకయ్యనాయుడు పాల్లొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... కులవివక్ష, మత వివక్ష సరికాదని.. సామాజిక సామరస్యం కావాలని అన్నారు. హెచ్‌సీయూ లాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు. మైనార్టీల బుజ్జగింపు రాజకీయాలకు స్వస్తి పలకాలని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. రైతు కష్టాలను దీర్ఘకాలిక పరిష్కారాలు కావాలని చెప్పారు. దేవాలయాల్లో అందరికి ప్రవేశం ఉండాలని వెంకయ్య ఆకాంక్షించారు. -
ప్రకాశం జిల్లాలో నకిలీ పాస్‌పుస్తకాలు
ఎర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాళెం మండలం పెద్దబోయనపల్లెలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో నకిలీ పాస్‌పుస్తకాలు వెలుగు చూశాయి. ఈ గ్రామంలో ఐదు నకిలీ పట్టాదార్ పాస్‌పుస్తకాలు బయటపడ్డాయని, ఇంకా 200 దాకా నకిలీ పుస్తకాలు ఉండవచ్చని తహశీల్దార్ జి. విజయలక్ష్మి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తే చాలా నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు బయటపడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. -
ఇసుకక్వారీల ఏర్పాటుకు గ్రామసభ
వరంగల్ : ఇసుక క్వారీల ఏర్పాటుకు గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఏటూరు గ్రామంలో సోమవారం జరిగింది. మండలంలోని ఏటూరు, సింగారం, కంతలపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు సోమవారం ఏటూరులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇసుకు క్వారీ ఏర్పాటుకోసం గ్రామసభను ఏర్పాటు చేశారు. కాగా, ఈ సోసైటీని రహస్యంగా ఏర్పాటు చేశారని ఆయా గ్రామాల ప్రజలు గొడవకు దిగారు. దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు, గిరిజనులకు మధ్య వాగ్వాదం చెలరేగింది. (ఏటూరునాగారం) -
తూతూ మంత్రమే !
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన గ్రామసభలు తూతూ మంత్రంగానే ముగిశాయి. ఈ నెల 2 నుంచి 8 వరకు జిల్లాలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల నిర్వహణలో అధికారులకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించకపోగా, గతంలో ఇచ్చిన దరఖాస్తులకు సైతం మోక్షం లే ని ఈ సభలు ఎందుకని నిలదీశారు. దీంతో అధికారులు గ్రామ సభలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కొన్నిచోట్ల ప్రజలు వారిని ఘెరావ్ చేయగా, మరికొన్ని గ్రామాలలో నిర్వహించిన సభలకు అధికారులు కావాలనే వెళ్లలేదు. ఈ సభలకు సంబంధిత అధికారులంతా విధిగా హాజరు కావాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశించినా.. అధికారులు వెళ్లకపోవడం గమనార్హం.జిల్లాలో 758 పంచాయతీలకు గాను 25 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జరుగుతోంది. దీంతో మిగిలిన 733 పంచాయతీల్లో సభలు నిర్వహించినట్లు అధికారులు చెప్పారు. మిగితా గ్రామాల్లో ఈ నెల 18న ఎన్నికల తర్వాత నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ సభలకు టెంట్లు, మైక్.. ఇలా భారీగా హంగామా చేసినా స్థానికులు పెద్దగా హాజరు కాకపోవడంతో ప్రజాధనం వృథా అయింది. సభల నిర్వహణ అస్తవ్యస్తం... ఏడాదికి నాలుగు సార్లు గ్రామసభలు నిర్వహించాలని పంచాయతీరాజ్ కమిషనర్ అదేశాలు జారీ చేశారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, పంచాయతీ విస్తరణ అధికారి ఈ సభలకు హాజరవ్వాలి. అయితే అనేక గ్రామాల్లో సర్పంచ్, ఒకరిద్దరు అధికారులు మినహా ఎవరూ పాల్గొనలేదు. దీంతో సభల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మరి గ్రామ సభలకు హాజరు కాని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకో వాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలను జిల్లా అధికారులు ఏ మేరకు అమలు చేస్తారో చూడాలి. 29 అంశాలపై చర్చ... పంచాయతీలకు సంబంధించిన 29 అంశాలపై చర్చించడంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి అధికారులను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం ఈ సభలను నిర్వహిస్తోంది. అయితే ఈ సభల్లో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అధికారుల దృష్టికి అనేక మార్లు తీసుకెళ్లిన సమస్యలను సైతం పరిష్కరించలేని సభలు ఎందుకని ప్రజల్లో నిరుత్సాహం వ్యక్త మవుతోంది. గత ఏడాది పాలన నివేదిక, పంచాయతీ వార్షిక లెక్కలు, బడ్జెట్, పన్నులు,ప్రభుత్వ కార్యాక్రమాలు, లబ్ధిదారుల ఎంపిక, తాగునీటి సమస్య, పారిశుధ్యం, ప్రజాపంపిణీ వ్యవస్థ, వ్యవసాయం, విద్యుత్ సరఫరాతదితర అంశాలపై సభల్లో చర్చించాల్సి ఉంది. కానీ వీటిపై ప్రజలకు అవగాహన లేకపోవడం, అధికారులు హాజరుకాకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. ప్రణాళిక లోపం... గ్రామ సభలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులను ఆదేశించారు. ఈ సభల నిర్వహణ బాధ్యత జిల్లా పంచాయతీ అధికారిది. ఆయా మండల పరిషత్ అధికారులు గ్రామాల వారీగా ప్రణాళిక రూపొందించుకొని సభ నిర్వహించాల్సి ఉంది. కానీ అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సభలు పూర్తిస్థాయిలో జరగలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంపీడీవోలు ఒకటి, రెండు గ్రామాలకు మాత్రమే వెళ్లడంతో మిగితా సభలకు కిందిస్థాయి అధికారులు సైతం కొద్దిమందే హాజరవుతున్నారు. అధికారులు లేని సభలకు వెళ్తే ఒరిగేదేమీ ఉండదనే ఉద్దేశంతో ప్రజలు కూడా హాజరుకాలేదు. ఇలా అధికారుల పర్యవేక్షణ లోపంతో సభలు ఆభాసుపాలయ్యాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోసారి నిర్వహించే సభలకైనా అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. -
మొక్కుబడి సభలు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల కు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన గ్రామసభలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. గతంలో ఇచ్చి న దరఖాస్తులకు మోక్షం లభించలేదని, సమస్యలకు పరి ష్కారం చూపని సభలు ఎందుకని ప్రజలు బహిష్కరిస్తున్నారు. అధికారులను నిలదీస్తున్నారు. ఘెరావ్ చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల అధికారులు రాక, మరికొన్ని చోట్ల ప్రజలు రాక వెలవెలబోతున్నాయి. పంచాయతీ ఎన్నికలు ఉన్నచోట సభలను వాయిదా వేశారు. వీటిని ఈనెల 18 తర్వాత నిర్వహించనున్నారు. ఏడాదికి నాలుగుసార్లు.. గతంలో గ్రామసభలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించేవారు. సర్పంచ్ల పదవీకాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలన ఆరంభమైనప్పటి నుంచి పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కల్పన శాఖ కమిషనర్ ఏడాదికి నాలుగుసార్లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవి జనవరి 2, ఏప్రిల్ 14, జూలై 1, అక్టోబర్ 3వ తేదీల్లో గ్రామసభలు నిర్వహించాలని పేర్కొన్నారు. కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన తర్వాత కూడా ఇదే పద్ధతి కొనసాగుతోంది. అక్టోబర్‌లో ఒకసారి గ్రామసభలు నిర్వహించారు. జనవరి 2 నుంచి 10వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించాలని కమిషనర్ నుంచి ఆదేశాలు జారీ కాగా, గ్రామసభలు జరుగుతున్నాయి. గతంలో అధికారులు సభల్లో తప్పనిసరి పాల్గొనాలని నిబంధన ఉండేదికాదు. అయితే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, మండల అభివృద్ధి అధికారులు, పంచాయతీ విస్తరణ అధికారి, విభాగ పంచాయతీ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయి అధికారులతో గ్రామసభ నిర్వహించాలని కమిషనర్ సూచించడం, ఈ మేరకు కలెక్టర్, డీపీవోలు కూడా క్షేత్రస్థాయి అధికారులు కచ్చితంగా పాల్గొనాలని ఆదేశించారు. చర్చించే అంశాలు ఇవే.. గ్రామపంచాయతీలకు సంబంధించిన 29 అంశాలను గ్రామసభలో చర్చించేందుకు క్షేత్రస్థాయి అధికారులను భాగస్వాములను చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. 17 శాఖల క్షేత్రస్థాయి అధికారులు తప్పనిసరిగా పాల్గొనే విధంగా జిల్లా అధికారులు చూడాలని పేర్కొన్నారు. అయితే గతంలో సభల్లో చెప్పిన సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో గ్రామీణుల్లో నిరుత్సాహం వ్యక్తమవుతుంది. దీంతో కొన్నిచోట్ల నిధులు లేని సభలెందుకంటూ బహిష్కరిస్తున్నారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఒకరిద్దరు క్షేత్రస్థాయి అధికారులు మినహాయిస్తే అన్ని శాఖల నుంచి సిబ్బంది పాల్గొనడం లేదు. సభలో పంచాయతీ వార్షిక లెక్కలు, ఆడిట్ రిపోర్ట్, గతేడాది పాలన నివేదిక, బడ్జెట్, వార్షిక నివేదికలు లేని కొత్త పన్నుల కార్యక్రమాలు, కొత్త పన్నులు విధించుట, పన్నుల పెంపుకు కార్యక్రమాలు, పథకాలు, లబ్ధిదారులను, ప్రాంతాలను గుర్తించుట వంటివి ముఖ్య ఉద్దేశం. వీటితోపాటు తాగునీటి సమస్య, పారిశుధ్యం, ప్రజాపంపిణీ వ్యవస్థ, వ్యవసాయ సమస్యలు, విద్యుత్ సరఫరా, చిన్ననీటి పారుదల, రోడ్లు, కల్వర్టులు, నీటి మార్గాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనితీరు తదితర అంశాలను ఇందులో చర్చించవచ్చు. డీపీఓ పోచయ్య వివరణ.. ఒకే పంచాయతీలో రెండు మూడు చోట్ల గ్రామసభలు ఉండడంతో అన్నిచోట్ల అధికారులు పాల్గొనలేకపోతున్నారు. నిర్లక్ష్యం ప్రదర్శించి అధికారులు గైర్హాజరైన పక్షంలో మండల అధికారులు ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాం. తద్వారా అధికారులపై చర్యలు తీసుకుంటాం. అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని కమిషనర్‌తోపాటు కలెక్టర్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. గ్రామీణులు గ్రామసభలను ఉపయోగించుకోవాలి. ముందుగా నిధులు విడుదల అనేది ఉండదు. సభలో ప్రస్తావించి తీర్మానం చేసి ప్రతిపాదనలు పంపిన పక్షంలో దానికి ఉన్నతాధికారులు పరిశీలించి నిధులు విడుదల చేస్తారు. -
ఇక పకడ్బందీగా గ్రామసభలు
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఇకపై గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇన్నాళ్లూ మొక్కుబడిగా సభలు నిర్వహిస్తూ ప్రధాన శాఖల మండలాధికారులు గైర్హాజరు కావడంతో ఆయూ గ్రామాల ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదనే విమర్శలున్నాయి. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం ఇకపై గ్రామసభలకు మండలాధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, గైర్హాజరయ్యేవారి వివరాలు జిల్లా ఉన్నతాధికారులకు సమర్పించాలని ఇటీవల జీవో 791 జారీ చేసింది. హాజరైన, గైర్హాజరైన అధికారులు, చర్చించిన అంశాలపై నివేదిక సమర్పించే బాధ్యతలు పంచాయతీ కార్యదర్శులకు అప్పగించనుంది. తద్వారా మండలస్థారుు అధికారుల పనితీరును అంచనా వేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 866 గ్రామ పంచాయతీలున్నాయి. ఇటీవల పాలకవర్గాలు ఏర్పడడంతో పంచాయతీల వారీగా అభివృద్ధి పనులు, ఆదాయ, వ్యయాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. గతంలో గ్రామసభల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం, వాటి ద్వారా ఆశించిన మేర ప్రయోజనం చేకూరకపోవడంతో ఈ సారి సభలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నవంబర్‌లో జీవో నంబర్ 791 జారీ చేసింది. గతంలో గ్రామ సభలకు మండలస్థాయి అధికారులు రాకున్నా కొనసాగించేవారు. దీంతో గ్రామ ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఏయే అధికారులు సభలకు హాజరయ్యారనే సమాచారం ఉన్నతాధికారుల వద్ద లేకుండా పోయింది. తాజాగా జారీ చేసిన జీవో ప్రకారం ప్రధాన శాఖల మండల స్థాయి అధికారులు ఏడాదిలో నాలుగు సార్లు నిర్వహించే గ్రామ సభలకు విధిగా హాజరు కావాలి. గ్రామాల్లో తాగునీటి సమస్య, డ్రెరుునేజీ, రోడ్లు తదితర అంశాలపై చర్చించాలి. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలి. సభలకు హాజరైన, గైర్హాజరైన అధికారుల వివరాలు, చర్చించిన అంశాలతో పంచాయతీ కార్యదర్శులు జిల్లా పంచాయతీ అధికారికి ప్రతీ గ్రామసభకు సంబంధించి నివేదిక అందించాల్సి ఉంటుంది. కార్యదర్శులకు చిక్కులు తప్పవా..? తాజా జీవోతో పంచాయతీ కార్యదర్శులకు అదనపు పనిభారం, ఇబ్బందులు తప్పవనే వాదనలు వినిపిస్తున్నారుు. జిల్లా వ్యాప్తంగా 866 గ్రామ పంచాయతీలకు సుమారు 190 మంది కార్యదర్శులు ఉన్నారు. వీరు నాలుగు నుంచి ఐదు గ్రామ పంచాయతీల వ్యవహారాలను చూస్తున్నారు. ఇప్పటికే ఇది తమ తలకు మించిన భారంగా భావిస్తున్నారు. 791 జీవోతో గ్రామ సభలకు హాజరుకాని మండల అధికారులపై రిపోర్టు ఇవ్వడం అదనపు పనిభారంగా మారనుంది. దీనికితోడు నివేదిక ఇవ్వడం ద్వారా మండల అధికారుల ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలపై సీరియస్‌గా స్పందిస్తే క్షేత్రస్థాయిలో తమకు ఇబ్బందులు తప్పవని, ఈ జీవో తమకు పరోక్షంగా కష్టాలు తప్పవని భావిస్తున్నారు.