
'నామమాత్ర సభల వల్ల నిష్ప్రయోజనమే'
కొత్తూరు: గ్రామసభల్లో ప్రజలు భాగస్వాములయ్యేలా సర్పంచ్, వార్డు సభ్యులు కృషిచేయాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని గురువారం మంత్రితో పాటు పంచాయతీరాజ్ కమిషనర్ నీతూప్రసాద్, డీపీవో పద్మజారాణి సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి పంచాయతీకి ఇంటి పన్నులు, పరిశ్రమల అనుమతులు... వెంచర్ల నుంచి వస్తున్న ఆదాయ వివరాలను తెలుసుకుని, రికార్డులను పరిశీలించారు. గ్రామ సభల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని, తద్వారా వారికి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై అవగాహన పెరిగి సద్వినియోగం చేసుకుంటారని చెప్పారు. నామమాత్రంగా సభలు నిర్వహించడం వల్ల ప్రయోజనం లేదని జూపల్లి పేర్కొన్నారు.