మా భూములతో మీ వ్యాపారం ఏంటీ ?
మా భూములతో మీ వ్యాపారం ఏంటీ ?
Published Wed, Sep 14 2016 11:32 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
పెనమలూరు : ‘మా భూములతో ప్రభుత్వం వ్యాపారం చేయడం ఏంటీ... మెట్రో రైల్ ప్రాజెక్టుకు మా భూములు ఇవ్వలేం..’ అని కానూరు, పోరంకి గ్రామాల రైతులు స్పష్టంచేశారు. మెట్రోరైలు ప్రాజెక్టుకు భూసేకరణపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కానూరు, పోరంకి గ్రామాల్లో బుధవారం గ్రామసభలు నిర్వహించారు. సబ్ కలెక్టర్ డాక్టర్ సృజన, మెట్రోరైల్ ప్రాజెక్టు డెప్యూటీ డైరెక్టర్ రంగారావు, భూసేకరణ అధికారి, డీఆర్‌డీఏ పీడీ డి.చంద్రశేఖరరాజు పాల్గొన్నారు. మండలంలో ఆరు మెట్రో రైల్వేస్టేçÙన్ల ఏర్పాటుకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరించాలని భావిస్తున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. దీనిపై రైతులు, ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. రంగారావు మాట్లాడుతూ బందరు రోడ్డు మధ్యలో మెట్రోరైలు ప్రాజెక్టు వస్తుందని, స్టేషన్లకు భూసేకరణ చేయాల్సి ఉందని చెప్పారు.
అభ్యంతరం తెలిపిన రైతులు
రెండు గ్రామ సభల్లోనూ భూసేకరణకు రైతులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. భూసేకరణ ఏయే సర్వే నంబర్లలో చేస్తారనే విషయం ప్రకటించకుండానే గ్రామసభలు ఎందుకని అధికారులను ప్రశ్నించారు. భూముల మార్కెట్ ధరకు, ప్రభుత్వం చెల్లించే పరిహారానికి చాలా తేడా ఉంటుందని, కాబట్టి తమ భూములను ఇవ్వలేమని స్పష్టం చేశారు. అయినా రైతుల భూములు తీసుకుని ప్రభుత్వం వ్యాపారం చేయటమేమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు వేసిన మార్కింగ్ ప్రకారం భూములు ఇస్తే భవిష్యత్‌లో తమ పొలాల్లోకి వెళ్లటానికి దారి కూడా ఉండదన్నారు. ఈ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రాజెక్టు డిజైన్ సరిగాలేదని కొందరు రైతులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో భూసేకరణ లేకుండానే మెట్రో స్టేషన్లు నిర్మించారని తెలిపారు. అవసరం మేరకు భూములు తీసుకుంటే సహకరిస్తామన్నారు. అధికారులు వేసిన మార్కింగ్ ప్రకారం బందరు రోడ్డు విస్తరణకు, మెట్రో ప్రాజెక్టుకు భూములు ఇచ్చి తాము అనాథలుగా మారాలా.. అని స్థానికులు నిలదీశారు. రైతుల అభ్యంతరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడు తూ ప్రజల అభ్యంతరాలను అధికారులు గుర్తించాలని, ఇతర ప్రాంతాల్లోని డిజైన్లు, స్టేషన్లు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. సర్పంచ్‌లు సోమయ్య, స్వరూపారాణి, తహసీల్దార్ మురళీకృష్ణ పాల్గొన్నారు.
మెట్రోపై వారంలో తుది నివేదిక
విజయవాడ : వారం రోజుల్లో మెట్రోరైల్ ప్రాజెక్టుపై తుది నివేదిక ఇస్తామని సబ్–కలెక్టర్ డాక్టర్ జి.సృజన చెప్పారు. భూసేకరణ నిర్వాసితులతో ఆమె బుధవారం సబ్–కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. భూసేకరణపై ప్రయివేటు ఏజెన్సీతోపాటు ప్రభుత్వం కూడా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు సృజన తెలిపారు. ప్రజలు చెప్పే విషయాలను నివేదికగా రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. విజయవాడలో కీలకమైన బందరు రోడ్డులో మెట్రో ప్రాజెక్టు వల్ల తీవ్రంగా నష్టపోతామని పలువురు వ్యాపారులు తెలిపారు. నగరం మీదుగా వెళ్తున్న కాలువలపై మెట్రో రైల్ లైను నిర్మించాలని ఆటోనగర్‌కు చెందిన శ్రీనివాసరావు కోరారు.ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఈ ప్రాజెక్టును చేపట్టవద్దని నగరానికి చెందిన వెంకట్రావు, పూర్ణచంద్రరావు విన్నవించారు. ఈ సమావేశంలో అర్బన్ తహసీల్దార్ ఆర్.శివరావు, కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, తదితరులు పాల్గొన్నారు.
Sమెట్రో కోచ్ డిపోకు వ్యతిరేకంగా తీర్మానం
రామవరప్పాడు : నిడమానూరులో మెట్రో రైల్ కోచ్ డిపో నిర్మాణానికి వ్యతిరేకంగా పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. నిడమానూరు పంచాయతీ కార్యాలయంలో బుధవారం సాధారణ సమావేశం సర్పంచ్ దామెర్ల కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అజెండాలోని అంశాలను పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ వివరించారు. మెట్రో రైల్ మార్గానికి తాము వ్యతిరేకం కాదని, గ్రామంలో నిర్మించతలపెట్టిన మెట్రో కోచ్ డిపోకు మాత్రమే తామంతా వ్యతిరేకమని గ్రామస్తులు, రైతులు ఈ సమావేశంలో తెలిపారు. పంచాయతీ పాలకవర్గ సభ్యులు కూడా గ్రామంలో కోచ్ డిపో నిర్మించవద్దని తీర్మానం చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు అనుకూలంగా తీర్మానాలు చేశారు.
Advertisement