గ్రామ సభను బహిష్కరించిన రైతులు
పంట నష్టపరిహారం ఇవ్వలేదని అధికారులపై ఆగ్రహం
ఆస్పరి: పంట నష్టపరిహారం మంజూరై నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు తమ బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని మండలంలోని కైరుప్పల రైతులు వ్యవసాయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని కైరుప్పల గ్రామంలో సర్పంచ్ శరవన్న అధ్యక్షతన గ్రామ సభ ఏర్పాటు చేశారు. సీపీఐ నాయకులు నాగేంద్రయ్య, విరుపాక్షి ఆధ్వర్యంలో ఆ సభను రైతులు బహిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ 2015 సంవత్సరానికి సంబంధించి 1150 మంది రైతులకు పంట నష్టపరిహారం మంజూరైందన్నారు. నేటికి వారి ఖాతాలో పంట నష్టపరిహారం జమకాలేదన్నారు. అకౌంట్లలో జమ చేసే వరకు గ్రామంలో ఏ సమవేశాలు, సభలు నిర్వహించరాదని రైతులు వ్యవసాయాధికారులను అడ్డుకున్నారు. దీనిపై ఏఓ పవన్ కుమార్ మాట్లాడుతూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని త్వరలోనే పరిహారం అకౌంట్లలో జమ అవుతుందన్నారు. అనంతరం మండలంలోని కారుమంచి, డీకోటకొండ గ్రామాలో్ల వ్యవసాయాధికారులు గ్రామ సభలు నిర్వహించి ఖరీఫ్ ప్రణాళికపై రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో ఏఈఓలు జయరాం, షేక్షావలి, ఎంపీఈఓలు హరిత, ఇందిర, మౌనిక, చంద్రశేఖర్, వెంకటేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.