
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం 'ఎల్2: ఎంపురాన్'. గతంలో వచ్చిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.
అయితే తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న లూసిఫర్-2 మూవీ ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ గుజరాత్ అల్లర్లను ఉద్దేశించి ఉండడంతో పలువురు మేకర్స్‌పై మండిపడుతున్నారు. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపురాన్ మూవీ హీరో మోహన్ లాల్ స్పందించారు. ఈ సందర్భంగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు.
మోహన్ లాల్ తన పోస్ట్‌లో రాస్తూ..'ఎంపురాన్ చిత్రంలో వచ్చిన కొన్ని రాజకీయ, సామాజిక ఇతివృత్తాలు చాలా మందికి తీవ్ర మనోవేదన కలిగించాయని నాకు తెలుసు. ఒక ఆర్టిస్ట్‌గా నా సినిమాలేవీ రాజకీయ ఉద్యమం, భావజాలం, వర్గం పట్ల ద్వేషాన్ని కలిగి ఉండకుండా చూసుకోవడం నా కర్తవ్యం. మా సినిమా మిమ్మల్ని బాధపెట్టినందుకు చింతిస్తున్నాం. అందుకే ఎంపురాన్ టీమ్ తరఫున క్షమాపణలు చెబుతున్నా. మిమ్మల్ని బాధపెట్టేలా ఉన్న సీన్స్ సినిమా నుంచి తప్పనిసరిగా తొలగించాలని నిర్ణయించుకున్నాం. గత నాలుగు దశాబ్దాలుగా మీలో ఒకరిగా నా సినీ జీవితాన్ని గడిపాను. మీ ప్రేమ, విశ్వాసమే నా బలం. అంతకు మించిన మోహన్‌లాల్ మరేది లేదని నా నమ్మకం...ఇట్లు ప్రేమతో మీ మోహన్ లాల్' అంటూ పోస్ట్ చేశారు.
ఈ వివాదం తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 17 మార్పులు చేయాలని చిత్ర బృందాన్ని ఆదేశించింది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకున్న తర్వాత సీబీఎఫ్‌సీ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్, టోవినో థామస్, అభిమన్యు సింగ్, మంజు వారియర్, జెరోమ్ ఫ్లిన్, ఎరిక్ ఎబౌనీ ప్రధాన పాత్రల్లో నటించారు.