
‘లూసిఫర్’.. 2019లో రిలీజైన ఈ మలయాళ మూవీ ఎంత ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. రూ.30 కోట్లతో తీస్తే, రూ.125 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. మలయాళంలో అత్యధిక వసూళ్లను సాధించిన ఎనిమిదో చిత్రంగా నిలిచింది. హీరో మోహన్‌లాల్‌కి, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్‌కి కెరీర్‌లోనే బెస్ట్ చిత్రంగా ‘లూసిఫర్’ నిలిచిపోయింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘L2: ఎంపురాన్’ (L2: Empuraan Movie) వస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు(మార్చి 27)న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో లూసిఫర్ కథేంటి? ఎంపురాన్ లో ఏం చెప్పబోతున్నారు? అసలు ఎంపురాన్ అంటే ఏంటి? తదితర ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

లూసిఫర్ కథేంటి?
ముఖ్యమంత్రి పి.కె రామదాసు అలియాస్ పీకేఆర్(సచిన్ ఖేడ్కర్) అకాల మరణంతో ఐయూఎఫ్ (ఇండియన్ యూనియన్ ఫ్రంట్) పెద్దల కన్ను సీఎం సీటుపై పడుతుంది. తదుపరి సీఎం కావాలని అతని అల్లుడు బిమల్ నాయుడు అలియాస్ బాబీ(వివేక్ ఒబెరాయ్) భావిస్తాడు. అందుకోసం పార్టీలోని కొంతమంది అవినీతిపరులతో చేతులు కలుపుతాడు. అయితే పీకేఆర్ సన్నిహితుడు, పార్టీ కీలక నేత స్టీఫెన్ గట్టుపల్లి (మోహన్‌లాల్) మాత్రం బాబీ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ సీఎం కాకుండా చేస్తాడు. దీంతో స్టీఫెన్‌ని హత్య చేయించేందుకు బాబీ కుట్ర చేస్తాడు. ఆ కుట్రను బాబీ ఎలా తిప్పి కొట్టాడు? బాబీ తీసుకురావాలనుకున్న డ్రగ్స్‌ను రాష్ట్రానికి రాకుండా ఎలా అడ్డుకున్నాడు? పీకేఆర్ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించింది? అసలు స్టీఫెన్ గతం ఏంటి? అన్నదే లూసీఫర్ కథ.
స్టోరీ పరంగా చూస్తే ఇది రొటీన్ పొలిటికల్ డ్రామా. కానీ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్ ఒక్కో సీన్‌ని తీర్చి దిద్దిన విధానం, మోహన్‌లాల్ సెటిల్డ్ యాక్టింగ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. వివేక్ ఒబెరాయ్, మోహన్ లాల్ పాత్రల మధ్య నువ్వా నేనా అన్నట్లు సన్నివేశాలు సాగుతాయి. మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో స్టీఫెన్ నేపథ్యం చెబుతూ సినిమాను ముగించారు. ఇప్పుడదే ‘ఎల్2: ఎంపురాన్’పై ఆసక్తిని పెంచేసింది.
అసలు ఎంపురాన్ అంటే ఏంటి?
లూసిఫర్ అనే టైటిల్ వినగానే అసలు ఈ పేరు ఎందుకు పెట్టారని అంతా అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ టైటిల్ ఎందుకు పెట్టారో తెలిసింది. క్రైస్తవంలో లూసిఫర్ అంటే దైవదూత అని అర్థం. భగవంతుని ఆజ్ఞను వ్యతిరేకించి కిందకు వచ్చి దుష్టుడిగా మారి, మానవాళి పాపాలు చేసేందుకు ప్రేరేపించేవాడినే లూసీఫర్ అంటారు. అందుకే ఈ సినిమాలో ‘దుర్మార్గులకు, మహాదుర్మార్గులకు జరిగే యుద్ధం’ అని హీరో పాత్రలో చెప్పించారు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన మూవీకి ‘ఎంపురాన్’ అని టైటిల్ పెట్టారు. దీని అర్థం ఏంటంటే.. ‘రాజు కంటే ఎక్కువ.. దేవుడి కంటే తక్కువ’ అని అర్థం. హీరో పాత్రను దృష్టిలో పెట్టుకొని ఈ టైటిల్‌ని పెట్టారు. దాదాపు రూ. 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment