ఇకపై గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఇకపై గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇన్నాళ్లూ మొక్కుబడిగా సభలు నిర్వహిస్తూ ప్రధాన శాఖల మండలాధికారులు గైర్హాజరు కావడంతో ఆయూ గ్రామాల ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదనే విమర్శలున్నాయి. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం ఇకపై గ్రామసభలకు మండలాధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, గైర్హాజరయ్యేవారి వివరాలు జిల్లా ఉన్నతాధికారులకు సమర్పించాలని ఇటీవల జీవో 791 జారీ చేసింది. హాజరైన, గైర్హాజరైన అధికారులు, చర్చించిన అంశాలపై నివేదిక సమర్పించే బాధ్యతలు పంచాయతీ కార్యదర్శులకు అప్పగించనుంది. తద్వారా మండలస్థారుు అధికారుల పనితీరును అంచనా వేయనున్నారు.
జిల్లావ్యాప్తంగా 866 గ్రామ పంచాయతీలున్నాయి. ఇటీవల పాలకవర్గాలు ఏర్పడడంతో పంచాయతీల వారీగా అభివృద్ధి పనులు, ఆదాయ, వ్యయాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. గతంలో గ్రామసభల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం, వాటి ద్వారా ఆశించిన మేర ప్రయోజనం చేకూరకపోవడంతో ఈ సారి సభలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నవంబర్‌లో జీవో నంబర్ 791 జారీ చేసింది. గతంలో గ్రామ సభలకు మండలస్థాయి అధికారులు రాకున్నా కొనసాగించేవారు. దీంతో గ్రామ ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఏయే అధికారులు సభలకు హాజరయ్యారనే సమాచారం ఉన్నతాధికారుల వద్ద లేకుండా పోయింది. తాజాగా జారీ చేసిన జీవో ప్రకారం ప్రధాన శాఖల మండల స్థాయి అధికారులు ఏడాదిలో నాలుగు సార్లు నిర్వహించే గ్రామ సభలకు విధిగా హాజరు కావాలి. గ్రామాల్లో తాగునీటి సమస్య, డ్రెరుునేజీ, రోడ్లు తదితర అంశాలపై చర్చించాలి. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలి. సభలకు హాజరైన, గైర్హాజరైన అధికారుల వివరాలు, చర్చించిన అంశాలతో పంచాయతీ కార్యదర్శులు జిల్లా పంచాయతీ అధికారికి ప్రతీ గ్రామసభకు సంబంధించి నివేదిక అందించాల్సి ఉంటుంది.
కార్యదర్శులకు చిక్కులు తప్పవా..?
తాజా జీవోతో పంచాయతీ కార్యదర్శులకు అదనపు పనిభారం, ఇబ్బందులు తప్పవనే వాదనలు వినిపిస్తున్నారుు. జిల్లా వ్యాప్తంగా 866 గ్రామ పంచాయతీలకు సుమారు 190 మంది కార్యదర్శులు ఉన్నారు. వీరు నాలుగు నుంచి ఐదు గ్రామ పంచాయతీల వ్యవహారాలను చూస్తున్నారు. ఇప్పటికే ఇది తమ తలకు మించిన భారంగా భావిస్తున్నారు. 791 జీవోతో గ్రామ సభలకు హాజరుకాని మండల అధికారులపై రిపోర్టు ఇవ్వడం అదనపు పనిభారంగా మారనుంది. దీనికితోడు నివేదిక ఇవ్వడం ద్వారా మండల అధికారుల ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలపై సీరియస్‌గా స్పందిస్తే క్షేత్రస్థాయిలో తమకు ఇబ్బందులు తప్పవని, ఈ జీవో తమకు పరోక్షంగా కష్టాలు తప్పవని భావిస్తున్నారు.