జమ్మికుంట, న్యూస్‌లైన్: అది జిల్లాలోనే ప్రముఖ వ్యాపార కేంద్రం.. కానీ గుక్కెడు మంచినీటికి నోచుకోని దైన్యం. గ్రామపంచాయతీ నుంచి మేజర్ పంచాయతీగా.. ఆపై నగర పంచాయతీగా హోదా మారింది కానీ.. అంతకుమించి అభివృద్ధి మాత్రం జరగలేదు. దశాబ్దాలుగా జమ్మికుంట పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నా.. ఎవరికీ పట్టడం లేదు. రూ.65కోట్లతో ప్రణాళిక రూపొం దించిన శాశ్వత మంచినీటి పథకానికి అతీగతీ లేదు. మ రో నాలుగు నెలల్లో ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పదవీకాలం ముగియనుంది. కానీ గత ఎన్నికల సమయంలో వారిచ్చిన హామీకి ఇంతవరకు మోక్షం లభించకపోవడం గమనార్హం. రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంచినీటి పథకం అమలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
మోక్షమెన్నడు..?
జమ్మికుంట పట్టణ ప్రజల కోసం యాభై సంవత్సరాల క్రితం మండలంలోని విలాసాగర్ వాగు నుంచి పైపులైన్ వేసి మానేరు నుంచి నీరందిస్తున్నారు. నాటి జనాభాకు అనుగుణంగా 450 నల్లా కనె క్షన్ల కోసం పైపులైన్ వేశారు. జమ్మికుంట వ్యాపార కేంద్రంగా మారడం, పట్టణ జనాభా పెరగడం వల్ల తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం పట్టణంలో 5,400 నల్లా కనెక్షన్లు ఉండగా.. జనాభా 30 వేలు దాటింది. దీంతో 20 వార్డుల్లో నాలుగురోజుకోసారి నీరందిస్తున్నారు. వేసవిలో నీటికి కటకట తప్పడం లేదు. ప్రజలు వ్యవసాయబావులు, మినరల్‌వాటర్ ప్లాంట్లను ఆశ్రరుుస్తున్నారు.
పట్టణ జనాభా ఆధారంగా ప్రతీ వ్యక్తికి రోజుకు 40 లీటర్ల నీరివ్వాలనే నిబంధనలు ఉన్నా.. కనీసం పది లీటర్లు ఇచ్చే పరిస్థితి లేదు. పట్టణ ప్రజలకు రోజుకు 23 గ్యాలన్ల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 4గ్యాలన్లు మాత్రమే అందిస్తున్నారంటే.. ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నాలుగురోజులకోసారి అందిస్తున్న నీళ్లు సైతం పట్టణంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా కావడం లేదు. పిట్టలవాడ, కేశవాపురం, మోత్కులగూడెం, దుర్గాకాలనీ, ఆబాది జమ్మికుంట ప్రాంతాల్లో సరైన పైపులైన్ల నిర్మించకపోవడం వల్ల నీటి కటకటాలు తప్పడం లేదు.
నీటి లభ్యత లేదట!
గత ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ పొన్నం ప్రభాకర్ పట్టణ ప్రజలకు నీటి సమస్య పరిష్కారిస్తామంటూ హామీ ఇచ్చారు. వారు మానేరు నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా దాహార్తి తీర్చేందుకు రూ.65 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి ని వేదికలు సమర్పించారు. 40 ఏళ్ల వరకు తాగునీటి సమ స్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించారు. దీంతో భూగర్భజలాల శాఖ అధికారులు నీటి సరఫరాపై ఆరునెలల క్రితం సర్వే జరిపారు. 40 ఏళ్ల వరకు నీటి సరఫరా చేసే సామర్థ్యం లేదంటూ నివేదికలను పక్కన పెట్టినట్లు సమాచారం.
పట్టణ జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని మానేరు ద్వారా 25 ఏళ్ల వరకు మాత్రమే శాశ్వత నీటి సమస్య తీరుతుందని, ఆ తర్వాత సమస్య మళ్లీ ఉత్పన్నమవుతుందని భూగర్భజల శాఖ వెల్లడించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రూ.65 కోట్ల నిధుల మంజూరులో జాప్యం జరుగుతోం దని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యే పట్టుబట్టి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మంచినీటి పథకాన్ని సాధించాల్సిన అవసరముందని ప్రజలు అంటున్నారు.
మా‘నీరు’ మహాప్రభో!
Published Mon, Jan 20 2014 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement