
ఎంత టైమిస్తారో తెలీదు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వద్ద ఉందని, బిల్లుపై అభిప్రాయం చెప్పడానికి ఆయన రాష్ర్ట శాసనసభకు ఎంత సమయం ఇస్తారో తనకు తెలీదని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. ఈ బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించే విషయమై ఇంకా ఏమీ ఆలోచించలేదని చెప్పారు. ప్రస్తుత సమావేశాలపైనే తమ దృష్టి కేంద్రీకృతమై ఉందని, ఈ సమావేశాల్లోనే బిల్లును పెట్టడానికి ప్రయత్నిస్తామని అన్నారు. తెలంగాణ సహా మొత్తం మూడు కీలక బిల్లుల్ని శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిపారు. హోంశాఖ నెలవారీ నివేదిక విడుదలకు ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర విభజనపై పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.
పస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు వస్తుందని మీరు ఆశిస్తున్నారా? అని అడగ్గా.. ‘బిల్లుకు ముందుగా కేంద్ర కేబినెట్ క్లియరెన్స్ ఇస్తుంది. కేబినెట్ నుంచి అది రాష్ట్రపతికి వెళ్తుంది. రాష్ట్రపతి బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపుతారు. అసెంబ్లీ అభిప్రాయం చెప్పడానికి వీలుగా కొంత సమయం ఇస్తారు. ఆయన ఎంత సమయం ఇస్తారనేది నాకైతే తెలియదు. ఆ తర్వాత బిల్లు తిరిగి రాష్ట్రపతికి వస్తుంది. రాష్ర్టపతి దాన్ని మా మంత్రిత్వశాఖకు పంపిస్తారు. సిఫారసుల ప్రకారం అప్పుడు మేం మళ్లీ కేబినెట్‌కు పంపిస్తాం. చివరగా బిల్లు పార్లమెంట్‌కు వెళ్తుంది..’ అంటూ షిండే సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం లేకుండా ఆర్టికల్ 3 కింద రాష్ట్రాన్ని విభజించాలని మీరు నిర్ణయించారు, ఇలా చేయడం తప్పుడు ఉదాహరణ కాబోదా? అన్న ప్రశ్నకు.. ‘కాదు.. అది తప్పుడు నిదర్శనం అవ్వదు..’ అని జవాబిచ్చారు. రాజ్యాంగం ప్రకారమే చేస్తున్నామని, రాష్ట్రం నుంచి తీర్మానం లేకుండానే రాష్ట్రాన్ని విభజించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని చట్టం అనుమతిస్తోందని చెప్పారు.
బిల్లును అసెంబ్లీకి పంపుతున్నామని, పార్లమెంట్ దాన్ని ఆమోదిస్తుందని షిండే వ్యాఖ్యానించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు చర్చకొస్తుందా అని అడగ్గా, ‘చూద్దాం.. ఈ సమావేశాల్లోనే బిల్లును పెట్టడానికి ప్రయత్నిస్తాం’ అని చెప్పారు. తెలంగాణ ఏర్పాటవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందే తెలుసునని, 2004 ఎన్నికల మేనిఫెస్టోలోనే ఈ అంశం ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు, హైదరాబాద్‌పై ప్రత్యేక నిబంధనలు, రాష్ట్రంలో అదనపు బలగాల మోహరింపు అంశాలపై ప్రశ్నలకు షిండే స్పందిస్తూ.. ‘‘పోలవరం ప్రాజెక్టును మేమే కడతామని హామీ ఇచ్చాం. ఆర్‌ఆర్ ప్యాకేజీ కూడా మేమే ఇస్తామన్నాం. కేంద్రమే దాన్ని పూర్తిచేస్తుంది కనుక రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారమేం పడదు. హైదరాబాద్ హోదా విషయంలో ఇప్పటికే స్పష్టంగా చెప్పాం. అందులో ఎలాంటి మార్పు లేదు.’’ అని చెప్పారు.
సభలో అంతా గందరగోళం: కాంగ్రెస్ ఎంపీలే ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటిస్తూ నోటీసు ఇవ్వడంపై మాట్లాడుతూ.. అవిశ్వాసం ప్రకటిస్తూ నోటీసు ఇచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని షిండే చెప్పారు. క్రమశిక్షణా రాహిత్యం లాంటిది ఏమైనా ఉంటే పార్టీ ఆ విషయమై జాగ్రత్త తీసుకుంటుందన్నారు. ‘అవిశ్వాస తీర్మానం నోటీసు అందిందని స్పీకర్ ఈ రోజు సభలో చెప్పారు. కానీ సభలో ఎవరూ వినడానికి సిద్ధంగా లేరు. అక్కడంతా గందరగోళం నెలకొంది. ఏం జరుగుతోందో తెలీని అయోమయ పరిస్థితి ఏర్పడింది. దాంతో సభను వాయిదా వేశారు’ అని అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించడం, అనుమతించక పోవడంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. స్పీకర్‌పై విపక్షం అవిశ్వాసానికి సిద్ధమవుతున్న అంశాన్ని దృష్టికి తేగా.. ‘ఈ విషయమై ఇప్పటివరకూ ఏ నోటీసు అక్కడ అందలేదు. స్పీకర్ తన బాధ్యతలను నిర్వర్తిస్తారు, ప్రభుత్వం తన పని తాను చేస్తుంది. తనకు అందినవాటిపై స్పీకర్ చర్య తీసుకుంటారు కదా’ అంటూ జవాబిచ్చారు.
తెలంగాణ సహా మూడు కీలక బిల్లులు: ఈ శీతాకాల సమావేశాల్లో మూడు కీలక బిల్లులు.. జన లోక్‌పాల్, మతహింస, తెలంగాణ బిల్లుల్ని సభ ముందుంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు షిండే తెలిపారు. ఈ విషయమై తమ ఆలోచన స్పష్టంగా ఉందని, ఈ మూడు బిల్లుల్ని పార్లమెంటు ముందుంచాలని అనుకుంటున్నట్టు చెప్పారు. జన లోక్‌పాల్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిందని, తర్వాత రాజ్యసభకు వెళ్లగా ఎగువ సభ దాన్ని సెలక్ట్ కమిటీకి నివేదించిందని తెలిపారు. సెలెక్ట్ కమిటీ కొన్ని సవ రణలు సిఫారసు చేయగా.. సవరణలతో కూడిన బిల్లు ప్రస్తుతం రాజ్యసభలో పెండింగ్‌లో ఉందని చెప్పారు.
ఈ బిల్లును తక్షణమే చేపట్టాల్సిందిగా కోరుతూ సంబంధిత మంత్రి రాజ్యసభకు నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. మతహింస సంబంధిత బిల్లు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందన్నారు. ఇటీవల దీనిపై విసృ్తత చర్చ జరిగిందన్నారు. బిల్లు విషయంలో అభ్యంతరాలున్న ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా నేరుగా తనను సంప్రదించవచ్చని, తనకు లేదా తన మంత్రిత్వశాఖ అధికారులకు సమాచారం ఇవ్వవచ్చని చెప్పారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై స్పందిస్తూ.. గెలుపోటములు అనేవి కొత్త విషయం కాదని, అవి జరుగుతూనే ఉంటాయని చెప్పారు. ఎన్నికలన్నాక అవి సహజమేనంటూ కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం గుర్తుచేశారు. ఫలితాలను విశ్లేషిస్తామని సోనియూగాంధీ, రాహుల్ చెప్పారన్నారు.
నెలాఖరు వరకూ రాష్ట్రంలోనే బలగాలు: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించామని.. బలగాలను నెలాఖరు వరకు రాష్ట్రంలోనే కొనసాగించాలని నిర్ణయించామని షిండే చెప్పారు. శాంతిభద్రతల నిమిత్తం ఇప్పటికే అదనంగా మోహరించిన 95 కంపెనీల బలగాలు (ఆర్‌ఏఎఫ్-4, సీఆర్‌పీఎఫ్-50, బీఎస్‌ఎఫ్-33, సీఐఎస్‌ఎఫ్-8) డిసెంబర్ 31 వరకు రాష్ట్రంలోనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన హోంశాఖ నెలవారీ నివేదికను విడుదల చేశారు. ‘‘రాష్ట్రానికి బలగాల విషయానికొస్తే, ఎక్కడైతే శాంతిభద్రతల సమస్య ఉంటుందని ముందే ఊహిస్తామో, అక్కడ బలగాలను మోహరించడం, పరిస్థితి అదుపులోకి రాగానే బలగాలను అక్కడినుంచి ఉపసంహరించడమనేది సాధారణ ప్రక్రియ’ అని చెప్పారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో ఆధునిక ఫైరింగ్ రేంజ్ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్టు షిండే తెలిపారు. అకాడమీలో ఫైరింగ్ రేంజ్ నిర్మాణం కోసం నవంబర్ 26న రూ. 3.19 కోట్లను విడుదల చేశామని చెప్పారు. కాగా, హెలెన్, లెహర్ తుపాన్లకు సంబంధించి ముందుగానే రాష్ట్రానికి హెచ్చరికలు పంపామని.. దాంతోపాటు జాతీయ విపత్తు నిర్వహణ దళాలను మోహరించామని తెలిపారు.