వైఎస్సార్‌కు మంచి పేరొస్తుందనే... పోలవరానికి అడ్డుపడుతున్నారు | ysrcp MLAs fires on ap cm chandrababu | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌కు మంచి పేరొస్తుందనే... పోలవరానికి అడ్డుపడుతున్నారు

Published Thu, Sep 3 2015 4:01 AM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM

వైఎస్సార్‌కు మంచి పేరొస్తుందనే... పోలవరానికి అడ్డుపడుతున్నారు - Sakshi

వైఎస్సార్‌కు మంచి పేరొస్తుందనే... పోలవరానికి అడ్డుపడుతున్నారు

ఏపీ సీఎం బాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల ప్రాజెక్టులపైన ఏమాత్రం అవగాహన లేనివాళ్లు... సాగునీటి రంగానికి ఏ ఒక్క చిన్న పని చేయనివాళ్లు రైతుల ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నామంటూ ఈరోజు శాసనసభలో సత్యదూరమైన మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. అసెంబ్లీలో ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించినప్పుడల్లా మీ వైఖరేంటి... మీ వైఖరేంటి... అని మాట్లాడుతున్న చంద్రబాబు... సమాధానం చెప్పేందుకు తమకు మైక్ ఇవ్వకుండా ఎందుకు గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు.

బుధవారం శాసనసభ వాయిదా పడిన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఉప్పులేటి కల్పన, వి.కళావతిలు విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో ప్రజలను ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారో చెప్పడానికి మైక్ ఇవ్వకుండా సమయం అయిపోయిందంటూ తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. తమను చూస్తే చంద్రబాబుకు ఎందుకు భయమో... ఎందువల్ల మైక్ ఇవ్వడం లేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలన్నారు.

పట్టిసీమ పూర్తి కావడానికి సంవత్సరం పడుతుందని, దానికి ఖర్చు పెట్టే రూ.1600 కోట్లు పోలవరానికి ఖర్చు చేస్తే శాశ్వతపరిష్కారం దొరుకుతుందని తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి బడ్జెట్ సమావేశాలలోనే చెప్పారని గుర్తుచేశారు. కమీషన్ల కోసం పట్టిసీమ ప్రాజెక్ట్‌ని 22శాతం ఎక్సెస్‌కు ఇచ్చి అడ్డంగా రూ.వెయ్యి కోట్లు దోచుకుని ఏదో సాధించామని చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరప్రదాయని పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు సాధించిన మహనీయుడు వైఎస్‌కి ఎక్కడ మంచిపేరు వస్తుందోనని చంద్రబాబు మధ్యలో డబ్బు దండుకోవడానికి పట్టిసీమ తెచ్చారని నిప్పులు చెరిగారు. వైఎస్సార్ పోలవరం ప్రాజెక్టు రూ.3,900 కోట్లు ఖర్చు చేసిన విషయం మరవొద్దని చెప్పారు. పోలవరంపై కోర్టుకు వెళ్లి అడ్డుపడింది కూడా బాబుకు సంబంధించిన వాళ్లేనని, ఈ రోజు వారంతా లాలూచీ పడ్డారని వారు ఆరోపించారు.  
 
ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా?
చంద్రబాబు హయాంలో ఏ ప్రాజెక్ట్‌కి ఎంతెంత ఎవరు ఖర్చు పెట్టారో చర్చకు రావాల్సిందిగా గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు. మీరు వచ్చినా.. మీ మంత్రి వచ్చినా.. ఎమ్మెల్యే వచ్చినా.. తాము మాత్రం ఇద్దరు వస్తామని.. ఏ ప్రాజెక్ట్ అయినా సరే తీసుకోండి.. చర్చకు ఎప్పడూ సిద్ధంగా ఉన్నాం.. ఎవరి హయాంలో ఎంతెంత ఖర్చు పెట్టింది వివరిస్తామని స్పష్టం చేశారు. అనంతపురంజిల్లాలో 46 చెరువులకు నీళ్లు ఇచ్చామని చెప్పుకుంటున్న చంద్రబాబు హంద్రీ-నీవాని ఎవరు పూర్తి చేశారో చెప్పాలని నిలదీశారు.

పులివెందులకు నీళ్లు ఇచ్చిన చరిత్ర తనదంటున్న చంద్రబాబు తోటపల్లికి శంకుస్థాపన చేసి రూ.3 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. తర్వాత వైఎస్, తర్వాతి ప్రభుత్వాలు కలిపి రూ.450 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. గతంలో చంద్రబాబు సహకరించడంవల్లే కర్ణాటకలో ప్రాజెక్టులు పూర్తయ్యాయని, దానివల్లే ప్రస్తుతం చుక్క నీరు కిందకి రావడం లేదని చెప్పారు. అందుకే ఆల్మట్టి డ్యామ్ వద్ద చంద్రబాబు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

పట్టిసీమ జీవోలో ఇండస్ట్రియల్ పర్పస్ కోసమే అని పేర్కొన్నారని, రాయలసీమకు నీళ్లు ఇస్తామని అందులో లేదని తెలిపారు. పట్టిసీమతో రాయలసీమకు ఏ విధంగా నీళ్లు వస్తాయో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి మళ్లించి అక్కడినుంచి నాగార్జునసాగర్‌కు, శ్రీశైలం డ్యామ్, జూరాల ప్రాజెక్ట్, నారాయణపూర్‌ల ద్వారా రాయలసీమకు నీళ్లిస్తామంటూ ఎంతకాలం మోసం చేస్తారని దుయ్యబట్టారు.

చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో రూ.413 కోట్ల కాల్వ పనులకు ఎవర్నీ టెండర్ వేయనీయకుండా టీడీపీ నేతలు ఇద్దరు అడ్డుపడ్డారని చెప్పారు. ఈ విషయంలో విచారణ జరిపి చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.  సీమ ఎదుర్కొంటున్న దుస్ధితికి, వరుస కరువులు రావడానికి గతంలో టీడీపీ పరిపాలనే కారణమని చెప్పారు.  
 
సీమ కరువుకు బాబే కారణం
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క గంప మట్టి తీయకపోవడమే రాయలసీమ కరువుకు కారణమని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఆరున్నర లక్షల ఎరకాలకు నీళ్లందించే కెనాల్స్‌కు నీళ్లు కేటాయించకపోవడంపై బ్రిజేష్ కుమార్ ట్రిబునల్ వ్యాఖ్యానించిన అంశాన్ని గుర్తు చేశారు.  వైఎస్సార్ హయాంలో కాల్వలు ఎంత మేర తవ్వారు.. ఎంత ఖర్చు చేశారు.. మీ హయాంలో ఎంత తవ్వారు, ఖర్చు ఎంత చేశారో చెప్పాలని నిలదీశారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు ఎలా.. ఎప్పడు ఇవ్వగలరో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.   

తనకు తాను శభాష్ అనుకునే వ్యక్తి చంద్రబాబు తప్ప దేశంలో ఎవరూ ఉండడని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.   పట్టిసీమ ఎత్తిపోతల సాకు చూపించి పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్ధకం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఎమ్మెల్యే రోజా  మండిపడ్డారు. పోలవరాన్ని టీడీపీ ప్రభుత్వం పూర్తిగా కోల్డ్ స్టోరేజిలో పడేసిందని, అసలు పోలవరం ప్రాజెక్టుకు బాబు అనుకూలమా.. వ్యతిరేకమా చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ పేరుతో జరుగుతున్న అనినీతికి వైఎస్సార్‌సీపీ పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement