ఇలాగైతే ప్రాజెక్టులు పూర్తయ్యేదెన్నడు..?
‘‘బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపును పరిశీలిస్తే.. ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి, ఆయకట్టుకు నీళ్లందించడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంతో అర్థం చేసుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టుకు రూ. వెయ్యి కోట్లు కేటాయించారు. కానీ.. బడ్జెట్‌ను లోతుగా పరిశీలిస్తే.. కేంద్రం నుంచి రూ. 775 కోట్ల ఏఐబీపీ నిధులు పోలవరానికి వస్తాయని పేర్కొన్నారు. కానీ 2015-16 కేంద్ర బడ్జెట్‌లో ఏఐబీపీకి మొత్తంగా కేటాయించిన నిధులు రూ. 850 కోట్లే. మరి ఏ లెక్కన పోలవరం ప్రాజెక్టుకు రూ. 775 కోట్ల నిధులు తెస్తారో అర్థం కావట్లేదు’’ అని జగన్ విమర్శించారు. ఇంకా ఏమన్నారంటే..
పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను రూ. 1,600 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చేశారు. అయితే ఆ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు ఎక్కడా కనిపించలేదు. అంటే.. ఇతర సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను పట్టిసీమ ఎత్తిపోతలకు మళ్లిస్తారన్నది స్పష్టమవుతోంది.
రాయలసీమపై.. హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులపై తమకే ప్రేమ ఉన్నట్లు నటిస్తారు. కానీ.. చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న కాలంలో హంద్రీ-నీవాకు ఖర్చు చేసిన నిధులు రూ. 13 కోట్లే. అంటే.. ఆ తొమ్మిదేళ్లలో అధికారుల జీతభత్యాలకు కూడా ఆ నిధులు సరిపోలేదు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాతి ప్రభుత్వాలు హంద్రీ-నీవాపై రూ. 5,800 కోట్లు ఖర్చు చేసి.. ఆ ప్రాజెక్టును దాదాపు పూర్తిచేశారు. మరో రూ. 1,100 కోట్లు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. కానీ.. ఈ బడ్జెట్‌లో హంద్రీ-నీవాకు రూ. 212 కోట్లే కేటాయించారు. ఇలాగైతే ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది?
గాలేరు-నగరిపై తనకే ప్రేమ ఉన్నట్లు యాక్టింగ్ చేస్తోన్న చంద్రబాబు తాను తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నకాలంలో చేసిన ఖర్చు ఎంతో తెలుసా.. రూ.17 కోట్లే! అవి ఆ తొమ్మిదేళ్లలో అధికారుల జీతాలకు కూడా సరిపోలేదు. కానీ.. దివంగత రాజశేఖరరెడ్డి, ఆ తర్వాతి ప్రభుత్వాలు గాలేరు-నగరి ప్రాజెక్టుకు రూ. 4,600 కోట్లను ఖర్చు చేశాయి. మరో రూ. 2,600 కోట్ల నిధులు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. కానీ.. ఈ బడ్జెట్‌లో ఆ ప్రాజెక్టుకు కేవలం రూ. 169 కోట్లే కేటాయించారు. ఇలాగైతే ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది?
రాయలసీమకు నీళ్లివ్వాలంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే కదా..! అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకెళ్లే మహత్తర ప్రాజెక్టు గాలేరు-నగరి. రాయలసీమపై లేని ప్రేమను ఒలకబోస్తోన్న చంద్రబాబు అత్తెసరు నిధులు కేటాయిస్తూ నీళ్లిస్తానని చెబుతుంటే ఎలా నమ్మాలి?
వెలిగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన కాలంలో రూ. 13 కోట్లను ఖర్చు చేశారు. అవీ ఆ తొమ్మిదేళ్లలో అధికారుల జీతాలకు కూడా సరిపోయి ఉండవు. కానీ.. దివంగత ప్రియతమ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత ప్రభుత్వాలు రూ. 3,000 కోట్లను వెలిగొండ ప్రాజెక్టుపై ఖర్చు చేశాయి. మరో రూ. 1,500 కోట్లు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో వెలిగొండకు కేవలం రూ. 153 కోట్లే కేటాయించింది. ఇలాగైతే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేదెన్నడు?
చంద్రబాబు సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో పులిచింతల ప్రాజెక్టు గురించి ఆలోచించిన పాపాన కూడా పోలేదు. కానీ.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాతి ప్రభుత్వాలు పులిచింతల ప్రాజెక్టుపై రూ. 980 కోట్లు ఖర్చు చేశాయి. దాదాపు ఆ ప్రాజెక్టు పనులను పూర్తిచేశాయి. మరో రూ. 290 కోట్లు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇందులో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి రూ. 137 కోట్లు, భూసేకరణకు రూ. 33 కోట్లు.. అంటే రూ.170 కోట్లు అవసరం. కానీ.. బడ్జెట్‌లో మాత్రం పులిచింతల ప్రాజెక్టుకు కేవలం రూ. 20 కోట్లే ఇచ్చారు. ఇదేనా సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి?