పట్టిసీమలో ఈ మతలబులేంటి? | ap assembly ys jagan mohan reddy questioned | Sakshi
Sakshi News home page

పట్టిసీమలో ఈ మతలబులేంటి?

Published Thu, Mar 19 2015 1:18 AM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM

ap assembly ys jagan mohan reddy questioned

  • పట్టిసీమ కాంట్రాక్ట్‌పై అసెంబ్లీలో నిలదీసిన విపక్ష నేత జగన్
  •  ఏడాదిలో పూర్తి చేయాలన్నప్పుడు అలా చేసేవారే కాంట్రాక్ట్ తీసుకుంటారు
  •  మరి 16.9% బోనస్ చెల్లించడమేంటి?
  •  నిల్వ సామర్థ్యం లేకుండా నీళ్లు ఎక్కడ నిలుపుతారు?
  •  పట్టిసీమ వల్ల పోలవరం ప్రశ్నార్థకంగా మారితే బాధ్యత ఎవరిది?
  •  రాయలసీమకు నీళ్లిస్తామని ఒప్పందంలో ఎక్కడుంది?

  • సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టకు పోకుండా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రద్దుచేసి జాతీయ ప్రాజెక్టయిన పోలవరాన్ని పూర్తి చేయాలని విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల మిగిలే నిధులతో రాయలసీమ దాహార్తిని తీర్చే హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చని వివరించారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, రైతు కళ్లల్లో ఆనందమే రాష్ట్ర సౌభాగ్యమని గట్టిగా విశ్వసించే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై అవాకులు, చెవాకులు మానాలని అధికార పక్షానికి సూచించారు. నదుల అనుసంధానంపై నిబంధన 344 కింద జరిగిన చర్చలో బుధవారం శాసనసభలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఇదే అంశంపై సీఎం చంద్రబాబు సుదీర్ఘ సమాధానం అనంతరం కూడా జగన్ పలు అంశాలపై వివరణ కోరారు. ‘పట్టిసీమ’ ప్రాజెక్టు అంచనా వ్యయం కంటే కాంట్రాక్టర్‌కు 21.9 శాతం అదనంగా ఎందుకు చెల్లించాలి? టెండరు పిలిచిందే ఏడాదిలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్నప్పుడు, అలా పూర్తి చేస్తే 16.9 శాతం బోనస్ ఎందుకు ఇవ్వాలి? పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరిస్తామని జీవోలో ఎక్కడైనా ఒక ముక్క పెట్టారా? అని ప్రశ్నించారు. విపక్ష నేత ప్రసంగిస్తున్న సమయంలో సభాపతి అనేకసార్లు మైక్ కట్ చేయగా మైక్ తీసుకున్న అధికార పక్ష సభ్యు లు వ్యక్తిగత విమర్శలు(విపక్ష సభ్యులపై)  చేయడం ద్వారా కీలకమైన ఈ అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. గంటా పది నిమిషాలు కళ్లార్పకుం డా అబద్ధాలాడగలిగారని, అదో గొప్ప టాలెంట్ అని సీఎంను ఉద్దేశించి జగన్ అన్నారు. ‘‘ఆయన(బాబు) పట్టిసీమ కట్టాలనుకున్నారు. కాబట్టి ఎండాకాలంలో కూడా వరదలొస్తాయని చెప్పగలరు’ అని మా జ్యోతన్న (జ్యోతుల నెహ్రూ) అన్నారు’’ అని జగన్ నొక్కి చెప్పారు.
     
    పావలా వంతు పనులు చేసినా..

    మిగులు జలాలపై హక్కులు కోరబోమని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు వైఎస్ ప్రభుత్వం లేఖ ఇవ్వడం ద్వారా రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టిందన్న సీఎం వ్యాఖ్యలను జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు కేంద్ర మంత్రులుగా ఉన్న సమయంలోనే దేవెగౌడ ప్రధానమంత్రిగా సత్వర సాగునీటి ప్రయోజన కార్యక్రమం(ఏఐబీబీ) కింద రూ.300 కోట్లు ఇచ్చి ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి చేయించారు. వివాదాస్పద ప్రాజెక్టులకు ఏఐబీబీ నిధులు ఇవ్వరు. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు అడ్డుకుని ఉండి ఉంటే ఆల్మట్టి నిర్మాణం జరిగేది కాదు. 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటయ్యే నాటికే ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తయింది. అందుకే ఆల్మట్టికి నికర జలాలు కేటాయించారు. చం ద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న కాలంలో నిధులు కేటాయించి హంద్రీనీవా-సుజల స్రవంతి, గాలేరు-నగరి, వెలి గోడు ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే, కనీసం పావలా వంతు పనులు పూర్తిచేసి ఉన్నా.. వాటికీ నికర జలాల్లో వాటా దక్కేది. తద్వారా రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది’ అంటూ బాబు హయాంలో జరిగిన లోపాలను విపక్ష నేత ఎత్తిచూపారు.
     
    సుప్రీం తీర్పులోని అంశాన్నే వైఎస్ ప్రభుత్వం ఇచ్చింది..

    కృష్ణానది కింద మిగులు జలాలపై రాష్ట్రం హక్కులు కోల్పోడానికి కారణం నాటి చంద్రబాబు ప్రభుత్వమేనంటూ 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని విపక్ష నేత చదివి వినిపించారు. కర్ణాటక ప్రభుత్వం మన ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు చేసిన ఫిర్యాదులో 2000 నాటి సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించినందునే తీర్పులోని అంశాలనే వైఎస్ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు రాతపూర్వకంగా ఇచ్చిందని జగన్ గుర్తు చేశారు. బాబు హయాంలో జరిగిన నష్టానికి దివంగత నేత వైఎస్ బాధ్యులంటూ.. చెప్పిన అబద్దాలనే మళ్లీ మళ్లీ చెప్పడం ద్వారా వాటిని నిజమని ప్రజలను నమ్మింపజేసే ప్రయత్నం బాబు చేస్తున్నారంటూ జగన్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
     
    ఎగువ రాష్ట్రాలు వాటా అడిగే ప్రమాదం

    గోదావరి ట్రిబ్యునల్‌లోని పోలవరం ప్రాజెక్టు పేరిట రెండో చాప్టర్‌లోని 7(ఇ) క్లాజ్‌లో.. ‘పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి వచ్చిన వెంటనే, కుడికాల్వకు వాస్తవంగా నీటిని ఎప్పుడు మళ్లిస్తారనే విషయంలో సంబంధం లేకుండా, కృష్ణా జల్లాల్లో ఏపీకి ఉన్న కేటాయింపుల్లో 35 టీఎంసీల నీటిని వాడుకొనే స్వేచ్ఛ కర్ణాటక, మహారాష్ట్రకు ఉంటుంది’ అని ఉందని పేర్కొన్నారు. 7(ఎఫ్)లో.. ‘80 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని కుడికాల్వకు మళ్లిస్తే.. ఆ నీటిలోనూ ఎగువ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి’ అని ఉందన్నారు. ఈ క్లాజులు పట్టుకొని, కృష్ణా జలాల్లో ఎగువ రాష్ట్రాలు వాటా అడిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. ఎగువ రాష్ట్రాలకు లేనిపోని తెలివితేటలు నేర్పించవద్దని సీఎం చంద్రబాబు, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు విపక్ష నేతకు సూచించారు. దీనికి స్పందించిన జగన్.. గోదావరి జలాలను కృష్ణాకు మళ్లిస్తే ఎగువ రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుందనే విషయాన్ని, వివిధ నిబంధనలు, చట్టాలు, తీర్పుల గురించి మాట్లాడితే ఇతర రాష్ట్రాలకు తెలిసిపోయి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చంద్రబాబు అనడం అవివేకమని, ఇవన్నీ ట్రిబ్యునల్స్‌లోనూ, కోర్టు తీర్పుల్లోనూ ఉన్నవేనని, ఇతర రాష్ట్రాల వారు మనకంటే అమాయకులనుకోవడం సరికాదని జగన్ అన్నారు.
     
    దేవినేని ఉమా జోక్యం, జగన్ అభ్యంతరం

    నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు జోక్యం చేసుకుంటూ.. చంద్రబాబు వల్లే ఆల్మట్టి ఎత్తుపెరగలేదని, వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. వైఎస్ వల్లే బ్రిజేష్ ట్రిబ్యునల్ వచ్చిందని, ఆల్మట్టి ఎత్తు పెరిగిందని చెప్పారు. ఈ వ్యాఖ్యల పట్ల జగన్ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ‘ఎందుకీ వివక్ష అధ్యక్షా, 5 నిమిషాలు కూడా కాకుండానే మైక్ కట్ చేస్తారా? నేను పూర్తిగా సబ్జెక్ట్ మీదనే మాట్లాడుతున్నా.. వివక్ష చూపించొద్దు.. నా వాదన విన్న తర్వాత వాళ్లను చెప్పమనండి’ అని కోరారు. ఈ మాటలంటున్నప్పుడు స్పీకర్ కోడెల అభ్యంతరం తెలిపారు. వివక్ష పదాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఆధారపడి ఉన్న అంశం కనుకనే అందరితో మాట్లాడిస్తున్నామని, విషయానికి ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు. దీనికి జగన్ బదులిస్తూ.. ‘సభలో జరుగుతున్నదే చెబుతున్నా, నా వాదన పూర్తి కాకుండా, వినకుండా మధ్యలో ఎలా జోక్యం చేసుకుంటారు’ అని ప్రశ్నించారు. అసలు విషయాలపై సమాధానం చెప్పకుండా గొప్ప చాణక్య తెలివితేటలు ప్రదర్శిస్తున్నారన్నారు. వైఎస్ హయంలో ప్రాజెక్టులు చేపట్టబట్టే ఈవేళ చంద్రబాబు వాటిల్లో నీరు పారిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఆ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇంగ్లీషు రాకపోతే తాను ట్యూషన్లు చెబుతానన్నప్పుడు పాలకపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు.
     
    నీటి నిల్వ ఎక్కడో చెప్పండి..

    జగన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. కృష్ణా, గోదావరి నదులకు ఎప్పుడెప్పుడు వరదలొస్తాయో, రుతుపవనాల కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో వివరించారు. ఈ సందర్భంగా బాబుకు సూటి ప్రశ్నలు సంధించారు. పట్టిసీమ నుంచి కృష్ణా బ్యారేజీ వరకు మధ్యలో ఎక్కడా స్టోరేజీ లేద ని, అటువంటప్పుడు వంద రోజులు ఎత్తిపోసే నీటిని ఎక్కడ నిల్వ ఉంచుతారో చెప్పాలన్నారు. ఈ స్టోరేజీ లేదు గనుకే 194 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును రూపొందించార ని, కుడికాల్వ నిర్మాణం అందులో భాగమేనని వివరించారు. సాగర్ నుం చి నీళ్లు రావడం వల్లే కృష్ణానదికి వరద రాదని, కట్టలే రు, తమ్మిలేరు వంటి ఉపనదుల నుం చి వచ్చే 30 టీఎంసీల నీరు కూడా కృష్ణాలో చేరుతుందని గుర్తించాలన్నారు.
     
    పోతిరెడ్డిపాడు పనులు పూర్తి చేయకుండా సీమకు నీరెలా ఇస్తారు?

    పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కింద పనులు పూర్తి చేయకుండా రాయలసీమకు నీరెలా ఇస్తారని విపక్ష నేత నిలదీశారు. ఆ పనులు పూర్తి కావాలంటే కనీసం రూ.2,600 కోట్లు కావాలని అన్నారు. దీంతో పాటు గాలేరు-నగరి పూర్తి కావాలని చెప్పారు. హంద్రీ-నీవాకు నీళ్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారంటే అది వైఎస్ పూర్తి చేయడం వల్లేనని ఉద్ఘాటించారు. సీమకు నీళ్లు ఇవ్వాలంటే శ్రీశైలం రిజర్వాయర్ వద్ద 854 అడుగుల నీటి నిల్వ ఉండాలని, కానీ టీడీపీ పాలన రావడంతోనే అది 830 అడుగులకు పడిపోయిందని అన్నారు.
     
    పోలవరానికి విఘాతం కలిగితే చరిత్రహీనులుగా..

     ‘పరిస్థితి ఇలా ఉన్నప్పుడే తెలంగాణ వాళ్లతో గొడవపడాల్సి వచ్చింది. అందుకే పోలవరం కావాలంటున్నాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికీ న్యాయం జరగాలంటున్నాం. కేంద్రం అన్ని అనుమతులూ ఇచ్చింది. డబ్బులు ఇస్తామంటున్నారు. దాన్ని చేపడితే కాస్త అటుఇటుగానైనా పూర్తవుతుంది. ఆ ప్రాజెక్టుకు విఘాతం కలిగితే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. పోలవరం పూర్తి కాకపోతే రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుంది. కనుక పనులు మొదలుపెట్టండి’ అని జగన్ అన్నారు. దీనికి బదులు పట్టిసీమను చేపడితే ఇతర రాష్ట్రాల నుంచి ఎదురయ్యే కష్టనష్టాలను వివరిస్తుండగా స్పీకర్ మైక్ కట్ చేస్తారు. సంబంధిత మంత్రిని సమాధానం ఇమ్మని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంలో విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్పీకర్ తిరిగి జగన్‌కు మైకు ఇచ్చారు.
     
    ఎక్సెస్ మతలబు ఇలా

    పట్టిసీమ టెండర్‌లో లాలూచీ వ్యవహారం ఉన్నట్టు కనిపిస్తోందని జగన్ అన్నారు. ముందుగా కుదుర్చుకున్న అవగాహన మేరకే టెండర్లు పడ్డాయని, 21.9 శాతం ఎక్సెస్(అదనపు వ్యయం) కోట్ చేసిన సంస్థకు టెండర్ ఇచ్చారని పేర్కొన్నారు. అనేక ప్రముఖ కంపెనీలు ఉండగా కేవలం మెగా కృష్ణారెడ్డి, ఎల్ అండ్ టీ మాత్రమే టెండర్లు వేశాయని తెలిపారు. ‘గతంలో సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు 2003లో ఇచ్చిన జీవో ప్రకారం 10 శాతం ఎక్కువ వేసినా కాంట్రాక్ట్ ఇవ్వొచ్చు. దీన్ని ఆ తర్వాత వచ్చిన వైఎస్ మార్చారు. 5 శాతానికి మించి అనుమతించకూడదని 2004లో జీవో తెచ్చారు. ఇప్పుడు ఆ నిబంధన దాటకుండా చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగి 5 శాతానికి అనుమతి, మిగిలిన 16.9 శాతం బోనస్‌గా ఇస్తూ రాసేశారు. మా అదృష్టం బాగుండి ఆయన(టెండరుదారు) 21.9 శాతం అడగబట్టి సరిపోయింది. అదే ఆయన ఏ 25 శాతమో అడిగి ఉంటే 5 శాతాన్ని అధికారికంగా అనుమతించి మిగతాది బోనస్ అనే వారు’ అని జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంలో విపక్ష సభ్యులు బల్లలు చరిచి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ దశలో అధికార పక్షం సభ్యులు ఏదేదో మాట్లాడడంతో మళ్లీ గందరగోళం నెలకొంది. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని ఎల్లంపల్లి, దేవాదుల ప్రాజెక్టులకు వైఎస్ 45 శాతం అదనపు వ్యయంతో టెండర్లు ఇచ్చారని ఆరోపించారు. దీనికి విపక్ష సభ్యులు అభ్యంతరం తెలపడంతో స్పీకర్‌కు సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
     
    రాయలసీమకు నీళ్ల మాటెక్కడ?

    ‘పట్టిసీమ ప్రాజెక్టుపై విడుదల చేసిన జీవో నంబర్ 1లో రాయలసీమ నీళ్ల విషయమై ఒక్క పదమైనా ఉందా?’ అని జగన్ ప్రశ్నించారు. ‘పోలవరం ప్రాజెక్టుకు ఎవ్వరూ వ్యతిరేకం కాదు. గోదావరి జలాలను కృష్ణానదితో అనుసంధానం చేయాలనే మేధావులు దశాబ్దాలుగా కలలు కన్నారు. వాటిని ముందుకు తీసుకువెళ్లింది మాత్రం వైఎస్ రాజశేఖరరెడ్డే. 3 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఆ ప్రాజెక్టు అలా ఉంటే ఇప్పుడు పట్టిసీమకు జీవో జారీ చేశారు. దీని ప్రకారం 8,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు పంపులు పెడతామంటున్నారు. ఇలా మొత్తం 80 టీఎంసీల నీటిని 109 రోజులపాటు ఎత్తిపోస్తారట. 11 వేల క్యూసెక్కుల చొప్పున 24 గంటలు ఎత్తిపోస్తే ఒక్క టీఎంసీ అవుతుంది. అటువంటిది 80 టీఎంసీలు ఎత్తిపోస్తామంటున్నారు’ అని జగన్ అంటుండగానే మంత్రి దేవినేని మరోసారి జోక్యం చేసుకోడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ‘ఆవేశపడకండి మంత్రిగారూ.. బాబుగారు ఇక్కడే ఉన్నారు. మంత్రి పదవి నిలబడుతుందిలే’ అని జగన్ చురకంటించగా.. అప్రతిష్టాకరమైన వ్యాఖ్యలు చేయవద్దని స్పీకర్ విజ్ఞప్తి చేశారు.
     
    విపక్ష నేతకు పదేపదే మైక్ కట్

    అనంతరం.. జగన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పాలకపక్షానికి వత్తాసు పలికే(గెజిట్ వంటి) ఓ దినపత్రిక రాసిన కథనం ప్రకారం కూడా పట్టిసీమ పూర్తి కావడానికి కనీసం రెండేళ్లు పడుతుందని, రకరకాల సమస్యలున్నాయని వివరించారు. ఆ తర్వాత పాలకపక్షం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య సభ కొంత సమయంపాటు వాయిదా పడింది. తర్వాత సభ ఆరంభం కాగానే మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, సీఎం చంద్రబాబు మాట్లాడారు. తర్వాత జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఎక్కడున్నాయో తెలుసోలేదో కానీ, ప్రాజెక్టుల పేర్లు మాత్రం చెప్పగలిగారని జగన్ వ్యాఖ్యానించారు. ‘కానీ ప్రాజెక్టులకు ఆయన హయాంలో చేసిన ఖర్చు చూస్తే.. అసలు విషయం తెలిసిపోతుంది. ఆయా ప్రాజెక్టు కింద పనిచేసే సిబ్బంది జీత భత్యాలకూ సరిపోనంతగా నిధులు ఇచ్చారు. ఏ ప్రాజెక్టుకు ఎంత నిధు ల ఇచ్చారో చెబుతా.. పులిచింతలకు బాబు ప్రభుత్వం తొమ్మిదేళ్లలో రూ.24 కోట్లు ఖర్చు చేస్తే, వైఎస్.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కలిపి రూ.982 కోట్లు ఖర్చు చేశాయి’ అని జగన్ అనగానే స్పీకరు మైక్ కట్ చేశారు. తాను ఎక్కువ సమయం తీసుకోనని, నిమిషాల్లోనే ముగిస్తానని జగన్ కోరగా మైక్ ఇచ్చిన స్పీకర్.. మళ్లీ పులిచింతల అనగానే కట్ చేశారు. దీంతో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంలోకి వెళ్లి నిరసన తెలియజేస్తుండగానే మంత్రి దేవినేని జోక్యం చేసుకుంటూ.. ‘తెలిసిన వారికి చెప్పొచ్చు.. తెలి యని వారికి చెప్పొచ్చు.. జగన్‌మోహన్‌రెడ్డి సబ్జెక్టు తెలుసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. తమ నేతకు మైక్ ఇవ్వాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తుండగానే స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు. అంతకుముందు మంత్రి దేవినేని మాట్లాడిన తర్వాత జగన్ ప్రసంగం ప్రారంభించి ఒక మాట మాట్లాడగానే స్పీకర్ మైక్ కట్ చేసి సీఎంకి ఇచ్చారు. అప్పుడు కూడా విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం ప్రసంగం పూర్తయ్యాక విపక్ష నేతకు అవకాశమిస్తామని స్పీకర్ చెప్పడంతో వారు తమ స్థానాల్లో కూర్చున్నారు. చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం అనంతరం.. జగన్‌కు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి మైక్ కట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement