కేవలం 'ఆ రెండు' కంపెనీలే టెండర్లు వేశాయా?: వైఎస్ జగన్
హైదరాబాద్ : పట్టిసీమలో టెండర్లలో అవకతవకలు ఎలా జరిగాయో.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం అసెంబ్లీలో వివరించారు. ఇప్పటికైనా ఆలస్యం కాలేదని, పట్టిసీమ ప్రాజెక్టును రద్దుచేసి... పోలవరంపై దృష్టి పెట్టాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పట్టిసీమ ప్రాజెక్ట్పై పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
అంతేకాకుండా ప్రభుత్వానికి ఆయన కీలక ప్రశ్నలు సంధించారు. పట్టిసీమ ద్వారా తరలిస్తున్న నీటిని ఎక్కడ నిల్వ చేస్తారని ప్రశ్నించారు. 'ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలే కదా, మరి పట్టిసీమ ద్వారా ఎత్తిపోతల ద్వారా వెళ్లే 80 టీఎంసీల నీటిని ఎక్కడ నిల్వ చేస్తారు? రుతుపవనాల సమయంలో కృష్ణా,గోదావరి నదులకు ఒకేసారి వరద వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? గోదావరి నుంచి నీటిని తీసుకెళ్లి..కృష్ణనదిలో కలిపి అక్కడ సముద్రంలో కలిపేస్తారా?
పెద్ద కంపెనీలు ఉండగా కేవలం మెగా, ఎల్అండ్టీ ...ఈ రెండు కంపెనీలు మాత్రమే టెండర్ ఎందుకు వేశాయి. ఇది ముందస్తు అవగాహనలో భాగం కాదా? 5 శాతం ఎక్సెస్కు మించి టెండర్లు ఇవ్వకూడదన్న జీవో ఉన్నప్పుటికీ 21.9 శాతానికి ఎలా అంగీకరించారు? 5 శాతం ఎక్సెస్, 16.9 శాతం బోనస్ ఎలా ఇస్తారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాయలసీమకు నీళ్లిస్తామంటున్న ప్రభుత్వం..పట్టిసీమపై జీవోలో ఎక్కడైనా ప్రస్తావన ఉందా? అని అడిగారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలంటే..అది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే కదా ఇవ్వాలి?పోతిరెడ్డిపాడు కింద ఉన్న రిజర్వాయర్లను పూర్తి చేశారా? చెప్పాలని' అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.