బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపేదీ?
► జిల్లా రైతులపై ఎందుకింత కక్ష చంద్రబాబూ
► మంత్రికి అమరావతి భూములు తప్ప
► జిల్లా అభివృద్ధి కనబడదు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన
► కార్యదర్శి ప్రసన్నకుమార్ రెడ్డి
ఇందుకూరుపేట: అసెంబ్లీలో గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టుల ఊసే లేదని, జిల్లా రైతులు, ప్రజలపై ఎందుకింత కక్ష అని సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారాయణలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. మండలంలోని డేవిస్‌పేటలో సర్పంచ్ నెల్లూరు విజయమ్మ నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలు ఏడుగురు ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను గెలిపించారనా బడ్జెట్ కేటాయింపుల్లో నెల్లూరు జిల్లా రైతులకు, ప్రజలకు మొండి చేయి చూపించావు చంద్రబాబూ అని ఎద్దేవా చేశారు.
జిల్లాలో సాగునీటి వనరుల అభివృద్ధికి రూ.3 వేల కోట్లు అవసరమని ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారన్నారు. తెలుగు గంగ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, సోమశిల ప్రాజెక్టుకు వేయి కోట్లు, పెన్నా డెల్టాకు రూ.500 కోట్లు అవసరమని, కండలేరు రిజర్వాయర్, డీఆర్, డీఎం చానళ్ల అభివృద్ధితోపాటు కావలి కాలువ, నెల్లూరు, సంగం బ్యారేజీ పనులు,ఎస్‌ఎస్‌ఎల్సీ(సోమశిల, స్వర్ణముఖి, లింక్ కెనాల్) పనులకు నిధులు అవసరమని నివేదికలు పంపారన్నారు. అయితే వాటిని బుట్టదాఖలు చేసి జిల్లా రైతుల ముఖాన మట్టి కొట్టారని ఆరోపించారు. సంగం, నెల్లూ రు బ్యారేజీలు పూర్తి చేసేందుకు కావాల్సిన రూ.150 కోట్లు పూర్తిగా కేటాయించకుండా జిల్లా రైతాంగాన్ని మోసగించారన్నారు.
దీనికి జిల్లా మంత్రి సమాధానం చెప్పాలన్నారు. అలాగే ముదివర్తి, ముదివర్తిపాలెం మధ్య కాజ్‌వే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు.దీనివల్ల రెండు మండలాల్లోని 40 గ్రా మాల ప్రజలకు, రైతాంగానికి ప్రయోజనం జరుగుతుందని ఆనాటి ప్రతిపాదనలు పెట్టడం జరిగిందన్నారు. గెలిచిన ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో మేము అధికారంలోకి వస్తే కాజ్‌వే నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ప్రస్తావనే బడ్జెట్లో లేకపోవడం దారుణమన్నారు. జీతాలు రాక నేటికీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్యాక్టరీని అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు ఏం ఉద్ధరించాడని ప్రశ్నిం చారు.
వైఎస్సార్ చేసిన పనులను ఇప్పుడు ప్రారంభించి, సొమ్ముకరిది..సోకు ఒకరిది అన్నచందగా సీఎం చేస్తున్నారన్నారు. జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు నిధులు ఎందుకు కేటాయించలేదని ఆయన ప్రశ్నిం చారు. ఇన్ని సమస్యలు జిల్లాలో ఉంటే మంత్రి నారాయణకు విదేశీ పర్యటన మీద, అమరావతి భూములు మీద ఉన్న మోజు వీటిపై ఎందుకు లేదని ప్రశ్నించారు. స్కూళ్లు,కాలేజీలలో డొనేషన్లుకు దండుకొనే శ్రద్ధ జిల్లా సమస్యలపై ఎందుకు లేదన్నారు. జిల్లాకు నిధులు కేటాయించాల్సిన జిల్లా మంత్రి నారాయణ దద్దమ్మలా మారాడని, నీవు ఒక మంత్రివేనా అని ప్రశ్నించా రు.
తూర్పు,పశ్చిమ,విజయనగరం,విశాఖ పట్నంలో 200 ఖర్చు పెట్టి టీడీపీని గెలిపించి అడ్డదారిలో నారాయణ మంత్రి పదవి తెచ్చుకున్నాడని ఆరోపించారు, నీకు రాజకీయ ఓనమాలు తెలుసా..జిల్లాలో ఏ గ్రామం ఎక్కడ ఉందో తెలుసా..ఇరిగేషన్ కాలువల పేర్లు నీకు తెలుసునా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా అభివృద్ధిపై సీఎంతో చర్చించి నిధులు కేటాయించాలని, అంతే తప్ప వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, జెడ్పీ చైర్మన్‌ను గెలిపించారని కుటిలమైన చర్యలకు పాల్పడడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. కార్యక్రమంలో పార్టీ నేతలు గొల్లపల్లి విజయ్‌కుమార్, మావులూరు శ్రీనివాసులురెడ్డి, కలువ బాలశంకర్‌రెడ్డి, సూరా శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బీవీ రమణయ్య పాల్గొన్నారు.