అలా వచ్చిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తాం
ఇప్పటికే ఆరు ఉత్తమ పాలసీలు ప్రకటించా
వాటితో ఈజ్ ఆఫ్ డూయింగ్‌ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ చేస్తా
శాసనసభలో బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు ప్రసంగం
హామీలపై మళ్లీ మోసం
సాక్షి, అమరావతి : ‘అన్ని వర్గాల వారిలో మా ప్రభుత్వంపై ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, హామీల అమలుకు అప్పులు తేవాలంటే ఎఫ్‌ఆర్‌బీఎం షరతులున్నాయి. అమ్మడానికి ఆస్తులు కూడా లేవు’.. అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. హామీలు అమలుచేయడానికి డబ్బుల్లేవుగానీ, తన దగ్గర కొత్త ఆలోచనలున్నాయని చెప్పారు.
వాటితో సంపద సృష్టించి, పేదరికాన్ని నిర్మూలిస్తానన్నారు. బడ్జెట్‌పై శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కూటమి నుంచి 21 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. ఫలితంగా ఢిల్లీలో పలుకుబడి పెరిగిందన్నారు. హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు.
రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చుపెడతామని.. ఇందులో భాగంగా ఆరు కొత్త పాలసీలను ప్రకటించామని సీఎం చెప్పారు. గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ పాలనతో ప్రభుత్వంలోని అన్ని శాఖలు అస్తవ్యస్థంగా మారాయని, వివిధ పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని ఆయన ఆరోపించారు.
ఇది ఉత్తమ బడ్జెట్..
రూ.2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టామని.. ఇది ఎంతో ఉత్తమ బడ్జెట్ అని చంద్రబాబు అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఇచి్చన సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా నెరవేరుస్తూ అదనపు హామీలను అమలుపరుస్తున్నామని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు.
ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చిన నిధులతో అమరావతిని పట్టాలెక్కించామని.. గోదావరి, పెన్నా, వంశధార నదుల అనుసంధానానికీ చర్యలు తీసుకుంటామన్నారు. ఇక సంక్రాంతిలోపు రహదారులపై గుంతలన్నింటినీ పూడుస్తామని.. నూతన మద్యం పాలసీ అమలుతో రాష్ట్రంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మద్యం బ్రాండ్‌లన్నింటినీ అందుబాటులోకి తెచ్చామని.. ప్రజలు కూడా తమ జీవితాలు ఎలా మారాయో చర్చించుకోవాలన్నారు.
భూములు అమ్ముకుంటే రాజధాని నిర్మాణం పూర్తి..
ఇక అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చంద్రబాబు చెప్పారు. రాజధాని కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టే అవసరంలేదని తాను గతంలో చాలా సందర్భాల్లో చెప్పానన్నారు. ఇక్కడ 10 వేల ఎకరాల భూమి ఉందని.. దీనిని అమ్ముకుంటే దశల వారీగా రాజధాని నిర్మాణం పూర్తవుతుందని ఆయన తెలిపారు.
ఆడబిడ్డల రక్షణ కోసం తమ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని.. సోషల్ మీడియాలో వారిని కించపరిచేలా పోస్టులు పెడితే వారు ఏ పార్టీ వారైనా విడిచిపెట్టబోమని హెచ్చరించారు. డిసెంబరులోగా పేదలకు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు.
ఇసుక విధానంపై మా ఎమ్మెల్యేలే అసహనంతో ఉన్నారు..
సభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.15 వేల కోట్లు గ్రాంటా అప్పా అనే సందేహాలపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. అప్పులపై ఆధారపడితే రాష్ట్రం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని.. గత ప్రభుత్వంలో చేసిన అప్పుల్లో 80 శాతం మేర సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చుపెట్టారని.. అదే బాబు పాలనలో చేసిన అప్పుల్లో 40 శాతం మాత్రమే సంక్షేమానికి ఖర్చుచేశారని పయ్యావుల చెప్పారు.
నూతన ఇసుక విధానాన్ని తీసుకొచ్చామని.. అయితే, దీనిపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అంతేకాక, చాలా జిల్లాల్లో సమస్యలు ఉన్నట్లు తమ ఎమ్మెల్యేలే అసహనం వ్యక్తంచేస్తున్నారని పయ్యావుల సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఇసుక పాలసీలో ప్రభుత్వానికి మంచిపేరు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment