'సీఎంది తొండి తీర్మానం.. రాజ్యాంగ ఆమోదం లేదు'
న్యూఢిల్లీ: అసెంబ్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించిన తీరును కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్ర పునర్య్యవస్థీకరణ బిల్లును తిరస్కరించాలంటూ సీఎం ఇచ్చిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో క్షణంలో ఆమోదించడం తప్పుడు విధానమని విమర్శించారు. సీఎంది తొండి తీర్మానమని, దానికి రాజ్యంగపరంగా విలువ లేదని జైపాల్ రెడ్డి అన్నారు. బిల్లును తిరస్కరించిన నేపథ్యంలో ఆయన శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆర్టికల్ 3 కింద అభిప్రాయాలు చెప్పాలని మాత్రమే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బిల్లును అసెంబ్లీకి పంపారని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం తీర్మానం వల్ల రాష్ట్ర విభజన ఆగుతుందని భావించడం కేవలం భ్రమేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని అన్నారు. ఏకపక్షంగా ఐక్యత కోరుకోవడంలో ఉండే అసహజత్వాన్ని సీమాంధ్ర నాయకులు గ్రహించడం లేదని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున విభజన వచ్చిన తర్వాత రాష్ట్రం కలిసుండం అసాధ్యమని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో కూడా 25 నుంచి 30 శాతం మంది తెలుగువారున్నారని అన్నారు.