'కిరణ్ వ్యవహారశైలి అనుమానాస్పదం'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలిపై సీమాంధ్ర మంత్రులు మండిపడుతున్నారు. పాము చావాలి.. కట్టె విరక్కూడదన్న చందంగా.. విభజన బిల్లు గట్టెక్కాలి.. సమైక్యాంధ్ర కోసం పోరాడినట్టుండాలి.. ఇదీ సీఎం వ్యూహం.. ఇదంతా అంటున్నదని ఎవరో కాదు. సాక్షాత్తూ సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ సభ్యులే.
కిరణ్ పనికిమాలిన తాజా ఎత్తులతో సమైక్యాంధ్రకు ఎలాంటి న్యాయం కలగదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వమిచ్చిన తీర్మానంతో.. ప్రభుత్వమే ఇబ్బందుల పాలవుతుందని సీమాంధ్ర మంత్రులు హెచ్చరిస్తున్నారు. రూల్ 77 అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వ వ్యహరాలకే వర్తిస్తుందని.. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లుకు అసెంబ్లీ నిబంధనలు వర్తించవని.. సీమాంధ్ర మంత్రులు స్పష్టంచేస్తున్నారు.
గతంలో స్పీకర్‌గా పనిచేసిన కిరణ్‌కు ఈ విషయాలన్నీ తెలుసని, అయితే ఉద్దేశపూర్వకంగా అయోమయాన్ని సృష్టించేందుకే ఈ తీర్మానాన్ని కోరారని.. సీమాంధ్ర మంత్రులు మీడియాతో వాపోతున్నారు. అసలు ఈ విషయంలో సీఎం తమను సంప్రదించలేదని కూడా సీమాంధ్ర మంత్రులు కుండబద్ధలు కొడుతున్నారు.
ప్రభుత్వమిచ్చిన తీర్మానం అనుమతి పొందదని విభజన బిల్లుపై ఓటింగ్‌కోసం పట్టుబట్టాలని మొదటినుంచి చెప్పినా స్పందించని సీఎం .. ఇప్పుడు ఉన్నపళంగా ఇలా వ్యవహరించడం సొంత ఇమేజీ కోసమేనని సీమాంధ్ర మంత్రులు అంటున్నారు. అసలు సీఎం వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉందని సీమాంధ్ర సభ్యులు అభిప్రాయపడుతున్నారు.