450 పేజీలతో సీఎం ప్రసంగం!
హైదరాబాద్ : శాసనసభలో రాష్ట్ర విభజన బిల్లు ముసాయిదాపై చర్చకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు ఆయన 450 పేజీల ప్రసంగాన్ని రెడీ చేసుకున్నారు. కిరణ్ ప్రసంగానికి ఎనిమిది గంటల నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ బిల్లు చర్చపై గడువును మరింత పెంచాలని కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతిని కోరారు.
ఈ మేరకు ఆయన శనివారం ఓ లేఖను రాశారు. అసెంబ్లీ చోటు చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ బిల్లుపై చర్చించేందుకు మరో నెలరోజులు గడువు ఇవ్వాలని రాష్ట్రపతికి సీఎం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే నెల రోజుల గడువు ఇవ్వటం కష్టమేనని హోంశాఖ అంటోంది. తుది నిర్ణయం మాత్రం రాష్ట్రపతిదేనని హోంశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. గడువుపై ఎల్లుండి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు గడువు పెంచవద్దంటూ తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ అంశంపై వారు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కూడా కోరారు.