
తెలంగాణ నోట్ ఆలస్యం!
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్ వారం, పదిరోజులు ఆలస్యమయ్యే అవకాశముంది. తెలంగాణకు సంబంధించి కేబినెట్ ముందుంచాల్సిన నోట్‌ను కేంద్ర హోంశాఖ ఇంకా ఖరారు చేయలేదని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. నోట్ ముసాయిదాకు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఇంకా ఆమోదం తెలపలేదని విశ్వసనీయ వర్గాలు చెప్పాయని వెల్లడించింది.
ఏకే ఆంటోనీ కమిటీ నివేదిక కోసం షిండే వేచిచూస్తున్నారని పేర్కొంది. అలాగే ముసాయిదాను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ముందుంచి వారి ఆమోదం పొందాలనుకుంటున్నట్టు తెలిపింది. ముసాయిదా ఖరారయ్యాక న్యాయమంత్రిత్వ శాఖకు పంపుతారు. అక్కడి నుంచి కేబినెట్ ముందుకు వస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎల్లుండి జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు తెలంగాణ నోట్ వచ్చే పరిస్థితి లేదు.
మరోవైపు రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్ ఇంకా సిధ్దం కాలేదని, తుదిమెరుగులు దిద్దుకోలేదని కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి నిన్న ఢిల్లీలో చెప్పారు. తెలంగాణ నోట్ అక్టోబర్ మొదటివారంలో కేంద్ర మంత్రివర్గం ముందుకు వస్తుందన్న అంశంపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. విభజన నేపథ్యంలో సీమాంధ్రుల అభ్యంతరాలపై ఆంటోనీ కమిటీ రూపొందించే సిఫార్సులను కేబినెట్ నోట్‌లో చేర్చాలన్నది తమ డిమాండ్ అనీ, అయినా, అన్ని అంశాలను నోట్‌లో చేర్చలేరని, కేబినెట్ ముందుంచే నోట్ సంక్షిప్తంగా ఉంటుందని ఆమె అన్నారు.