
'ఐఎస్ఐ గాలం వేసిందన్నవార్తలు నిరాధారం'
ముజాఫర్నగర్: పాకిస్థాన్ అనుబంధంగా పనిచేస్తున్నఐఎస్ఐ మైనార్టీ యువతకు గాలం వేసి నగరంలో అల్లర్లకు కారణమైందన్న వార్తలను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఖండించారు.ముజాఫర్ నగర్ లో గతంలో జరిగిన అల్లర్లతో ఐఎస్ఐకు సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకూ ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. మైనార్టీ కుటంబాల్లోని యువతను పాకిస్థాన్ పక్కదోవ పట్టిస్తూ అల్లర్లకు కారణమవుతుందన్నరాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభలో నిలదీసింది.
బీజేపీ సభ్యుడు ప్రకాశ్ దేవకర్ లేవనెత్తిన ఈ అంశంపై షిండే రాత పూర్వంగా సమాధానం ఇచ్చారు. ముస్లిం యువతను ఐఎస్ఐ కలిసిందన్న దానిపై ఆధారాలు దొరకలేదని స్పష్టం చేశారు. ముజాఫర్ నగర్ అల్లర్లకు ముస్లిం యువతను పాకిస్తాన్ గాలం వేస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పుడు పెద్ద దుమారం లేచింది. దీనిపై రాహుల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా బీజేపీ డిమాండ్ చేసింది. ఈ అంశం తాజాగా రాజ్యసభలో చర్చకు దారి తీయడంతో హోంమంత్రి షిండే సమధానం ఇచ్చారు.