చైనా,ఐఎస్‌ఐ హస్తం? | Bangladesh Protests: Are Pakistan ISI and China behind protests in Bangladesh to nurture anti India terror group | Sakshi
Sakshi News home page

చైనా,ఐఎస్‌ఐ హస్తం?

Published Wed, Aug 7 2024 4:53 AM | Last Updated on Wed, Aug 7 2024 9:16 AM

Bangladesh Protests: Are Pakistan ISI and China behind protests in Bangladesh to nurture anti India terror group

హసీనాను దించేందుకు పక్కాగా పావులు 

భారత వ్యతిరేక జియాను ఎలాగైనా గద్దెనెక్కించే లక్ష్యం 

బంగ్లాను ఉగ్రవాద అడ్డాగా మార్చే యత్నం 

విద్యార్థి ఆందోళనల్లోకి  ఐఎస్‌ఐ జేబు సంస్థ జమాత్‌

ఘర్షణలను ఎగదోసిన ఐసీఎస్‌

బంగ్లాదేశ్‌ కల్లోలం వెనక విదేశీ హస్తముందా? చైనా, పాక్‌ ఐఎస్‌ఐ కలిసి పక్కా ప్రణాళికతోనే సంక్షోభాన్ని సృష్టించాయా? భారత్‌ పట్ల అనుకూలంగా ఉన్నందుకే షేక్‌ హసీనా పట్ల అక్కసు పెంచుకున్నాయా? తమ జేబు సంస్థల ద్వారా అరాచకం సృష్టించి ఆమెను గద్దె దించడంలో సఫలమయ్యాయా? రిజర్వేషన్ల ఆందోళన వాటికి అందివచ్చిన ఆయుధంగా మారిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. యువత, విద్యార్థుల ఆందోళనలో ఐఎస్‌ఐ శక్తులు చేరి పరిస్థితి చేయి దాటేలా చూడటంలో సఫలీకృతమైనట్టు పలు దేశాల నిఘా వర్గాలు నిర్థారిస్తున్నాయి.

వాటి కథనం ప్రకారం... బంగ్లాదేశ్‌లో ఎలాగైనా భారత వ్యతిరేక, చైనా–పాక్‌ అనుకూల సర్కారు కొలువుదీరేలా చూడటమే లక్ష్యంగా ఐఎస్‌ఐ పావులు కదిపింది. ఇందుకోసం బంగ్లాలోని ఐఎస్‌ఐ స్లీపర్‌సెల్స్‌ రాత్రింబవళ్లూ పని చేశాయి. ముఖ్యంగా ఢాకాలో పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోవడం వెనక ఐఎస్‌ఐ ముసుగు సంస్థ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్, దాని విద్యార్థి విభాగం ఇస్లామీ ఛాత్ర శివిర్‌ (ఐసీఎస్‌) కీలక పాత్ర పోషించాయి. 

యువత, విద్యార్థులు చేపట్టిన ఆందోళనలను వీలైనంతగా ఎగదోశాయి. ఇందుకోసం జమాత్, ఐసీఎస్‌ సభ్యులు విద్యార్థుల ముసుగులో పని చేశారు. జమాత్‌కు నిత్యం పాక్, ఐఎస్‌ఐ నుంచే నిధులందుతాయి. ఎప్పుడు, ఎక్కడ, ఏం చేయాలో ఢాకాలోని పాక్‌ హై కమిషన్‌ నుంచి ఎప్పటికప్పుడు నిర్దేశాలు వస్తుంటాయి. ఆ మేరకు జమాత్‌ సభ్యులు సైలెంటుగా పని చక్కబెడతారని పాక్‌లోని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి. 

లండన్‌లో వ్యూహరచన! 
హసీనాను వీలైనంత త్వరగా గద్దె దింపి భారత వ్యతిరేకి అయిన మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా సారథ్యంలోని విపక్ష బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) అధికారంలోకి వచ్చేలా చూడటమే టాస్‌్కగా ఐఎస్‌ఐ పావులు కదిపింది. తద్వారా నానాటికీ సుదృఢంగా మారుతున్న భారత్‌–బంగ్లా సంబంధాలకు బ్రేక్‌ వేయడంతో పాటు కశ్మీర్‌ నుంచే గాక బంగ్లా వైపు నుంచి కూడా భారత్‌లోకి ఉగ్రవాదులను చొప్పించే వ్యూహం దీని వెనక దాగుంది. లండన్‌లో ఇందుకు పక్కగా స్కెచ్‌ తయారైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జియా కుమారుడు తారిఖ్‌ రెహ్మాన్‌ ఇటీవల ఐఎస్‌ఐ వర్గాలతో సౌదీ అరేబియాలో భేటీ అయినట్టు సమాచారం.

అనంతరం ప్రణాళికను పక్కాగా అమల్లో పెట్టారు. అందులో భాగంగా అల్లర్ల వ్యాప్తికి జూన్‌లోనే ఐసీఎస్‌ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. వీలైనంత అరాచకం సృష్టించడమే లక్ష్యంగా జమాతే, ఐసీఎస్‌లకు ఐఎస్‌ఐ భారీగా నిధులిచి్చనట్టు వెలుగులోకి వచి్చంది. వాటిలో అత్యధిక మొత్తాలను ఫండింగ్‌ చేసింది పాక్‌లోని చైనా సంస్థలేనని తేలింది. అంతిమంగా బంగ్లాలోనూ తాలిబన్‌ తరహా పాలన తేవాలన్నది వాటికి ఐఎస్‌ఐ, చైనా అప్పగించిన టాస్క్‌ అని నిఘా వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఈ మేరకు కొద్ది నెలల క్రితమే ఐసీఎస్‌ రంగంలోకి దిగింది.

ఢాకాతో పాటు పలు నగరాల్లో విద్యార్థులను నయానా భయానా భారీ సంఖ్యలో తమ సానుభూతిపరులుగా మార్చుకుంది. బంగ్లాదేశ్‌ అంతటా ఘర్షణలు తీవ్ర రూపు దాల్చేలా, పరిస్థితి చేయి దాటిపోయేలా చేయడం వెనక ఈ సంస్థే ప్రధాన పాత్ర పోషించిందని తేలింది. దానికి ఢాకాలోని పాక్‌ ఎంబసీ అన్నివిధాలా దన్నుగా నిలిచింది. ఈ క్రమంలో, అవసరమైతే తమ కార్యాలయంలో తలదాచుకోవాల్సిందిగా విద్యార్థులకు చెప్పేదాకా వెళ్లిందని దౌత్య వర్గాలంటున్నాయి!

చైనా హస్తం సుస్పష్టం
బంగ్లా కల్లోలం వెనక చైనా విదేశాంగ, భద్రతా వ్యవహారాల శాఖ హస్తం కూడా ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. తమకంటే భారత్‌కు హసీనా ఎక్కువ ప్రాధాన్యమివ్వడం చైనాకు రుచించని అంశాల్లో ఒకటి. పాక్‌ అనుకూల సర్కారైతే తన చెప్పుచేతల్లో ఉంటుందన్నది చైనా వ్యూహం. హసీనాను గద్దె దింపడం వెనక కచ్చితంగా విదేశీ హస్తముందని ఆ దేశంలో భారత హైకమిషనర్‌గా చేసిన వీణా సిక్రీ అన్నారు. ‘‘ఇటీవలి చైనా పర్యటన సందర్భంగా హసీనాను ఘోరంగా అవమానించిన తీరే ఇందుకు నిదర్శనం. ఆమెకు కనీస ప్రొటోకాల్‌ మర్యాద కూడా ఇవ్వలేదు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కూడా హసీనాతో వ్యక్తిగతంగా భేటీ కాలేదు. ఆమె సర్కారును కూలదోయడం వెనక పాక్‌–చైనా ఉమ్మడి వ్యూహం ఉందన్నది స్పష్టమే’’ అని వివరించారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement