Bangladesh Nationalist Party
-
చైనా,ఐఎస్ఐ హస్తం?
బంగ్లాదేశ్ కల్లోలం వెనక విదేశీ హస్తముందా? చైనా, పాక్ ఐఎస్ఐ కలిసి పక్కా ప్రణాళికతోనే సంక్షోభాన్ని సృష్టించాయా? భారత్ పట్ల అనుకూలంగా ఉన్నందుకే షేక్ హసీనా పట్ల అక్కసు పెంచుకున్నాయా? తమ జేబు సంస్థల ద్వారా అరాచకం సృష్టించి ఆమెను గద్దె దించడంలో సఫలమయ్యాయా? రిజర్వేషన్ల ఆందోళన వాటికి అందివచ్చిన ఆయుధంగా మారిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. యువత, విద్యార్థుల ఆందోళనలో ఐఎస్ఐ శక్తులు చేరి పరిస్థితి చేయి దాటేలా చూడటంలో సఫలీకృతమైనట్టు పలు దేశాల నిఘా వర్గాలు నిర్థారిస్తున్నాయి.వాటి కథనం ప్రకారం... బంగ్లాదేశ్‌లో ఎలాగైనా భారత వ్యతిరేక, చైనా–పాక్ అనుకూల సర్కారు కొలువుదీరేలా చూడటమే లక్ష్యంగా ఐఎస్ఐ పావులు కదిపింది. ఇందుకోసం బంగ్లాలోని ఐఎస్ఐ స్లీపర్‌సెల్స్ రాత్రింబవళ్లూ పని చేశాయి. ముఖ్యంగా ఢాకాలో పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోవడం వెనక ఐఎస్ఐ ముసుగు సంస్థ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్, దాని విద్యార్థి విభాగం ఇస్లామీ ఛాత్ర శివిర్ (ఐసీఎస్) కీలక పాత్ర పోషించాయి. యువత, విద్యార్థులు చేపట్టిన ఆందోళనలను వీలైనంతగా ఎగదోశాయి. ఇందుకోసం జమాత్, ఐసీఎస్ సభ్యులు విద్యార్థుల ముసుగులో పని చేశారు. జమాత్‌కు నిత్యం పాక్, ఐఎస్ఐ నుంచే నిధులందుతాయి. ఎప్పుడు, ఎక్కడ, ఏం చేయాలో ఢాకాలోని పాక్ హై కమిషన్ నుంచి ఎప్పటికప్పుడు నిర్దేశాలు వస్తుంటాయి. ఆ మేరకు జమాత్ సభ్యులు సైలెంటుగా పని చక్కబెడతారని పాక్‌లోని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి. లండన్‌లో వ్యూహరచన! హసీనాను వీలైనంత త్వరగా గద్దె దింపి భారత వ్యతిరేకి అయిన మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా సారథ్యంలోని విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధికారంలోకి వచ్చేలా చూడటమే టాస్‌్కగా ఐఎస్ఐ పావులు కదిపింది. తద్వారా నానాటికీ సుదృఢంగా మారుతున్న భారత్–బంగ్లా సంబంధాలకు బ్రేక్ వేయడంతో పాటు కశ్మీర్ నుంచే గాక బంగ్లా వైపు నుంచి కూడా భారత్‌లోకి ఉగ్రవాదులను చొప్పించే వ్యూహం దీని వెనక దాగుంది. లండన్‌లో ఇందుకు పక్కగా స్కెచ్ తయారైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ఇటీవల ఐఎస్ఐ వర్గాలతో సౌదీ అరేబియాలో భేటీ అయినట్టు సమాచారం.అనంతరం ప్రణాళికను పక్కాగా అమల్లో పెట్టారు. అందులో భాగంగా అల్లర్ల వ్యాప్తికి జూన్‌లోనే ఐసీఎస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. వీలైనంత అరాచకం సృష్టించడమే లక్ష్యంగా జమాతే, ఐసీఎస్‌లకు ఐఎస్ఐ భారీగా నిధులిచి్చనట్టు వెలుగులోకి వచి్చంది. వాటిలో అత్యధిక మొత్తాలను ఫండింగ్ చేసింది పాక్‌లోని చైనా సంస్థలేనని తేలింది. అంతిమంగా బంగ్లాలోనూ తాలిబన్ తరహా పాలన తేవాలన్నది వాటికి ఐఎస్ఐ, చైనా అప్పగించిన టాస్క్ అని నిఘా వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఈ మేరకు కొద్ది నెలల క్రితమే ఐసీఎస్ రంగంలోకి దిగింది.ఢాకాతో పాటు పలు నగరాల్లో విద్యార్థులను నయానా భయానా భారీ సంఖ్యలో తమ సానుభూతిపరులుగా మార్చుకుంది. బంగ్లాదేశ్ అంతటా ఘర్షణలు తీవ్ర రూపు దాల్చేలా, పరిస్థితి చేయి దాటిపోయేలా చేయడం వెనక ఈ సంస్థే ప్రధాన పాత్ర పోషించిందని తేలింది. దానికి ఢాకాలోని పాక్ ఎంబసీ అన్నివిధాలా దన్నుగా నిలిచింది. ఈ క్రమంలో, అవసరమైతే తమ కార్యాలయంలో తలదాచుకోవాల్సిందిగా విద్యార్థులకు చెప్పేదాకా వెళ్లిందని దౌత్య వర్గాలంటున్నాయి!చైనా హస్తం సుస్పష్టంబంగ్లా కల్లోలం వెనక చైనా విదేశాంగ, భద్రతా వ్యవహారాల శాఖ హస్తం కూడా ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. తమకంటే భారత్‌కు హసీనా ఎక్కువ ప్రాధాన్యమివ్వడం చైనాకు రుచించని అంశాల్లో ఒకటి. పాక్ అనుకూల సర్కారైతే తన చెప్పుచేతల్లో ఉంటుందన్నది చైనా వ్యూహం. హసీనాను గద్దె దింపడం వెనక కచ్చితంగా విదేశీ హస్తముందని ఆ దేశంలో భారత హైకమిషనర్‌గా చేసిన వీణా సిక్రీ అన్నారు. ‘‘ఇటీవలి చైనా పర్యటన సందర్భంగా హసీనాను ఘోరంగా అవమానించిన తీరే ఇందుకు నిదర్శనం. ఆమెకు కనీస ప్రొటోకాల్ మర్యాద కూడా ఇవ్వలేదు. అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హసీనాతో వ్యక్తిగతంగా భేటీ కాలేదు. ఆమె సర్కారును కూలదోయడం వెనక పాక్–చైనా ఉమ్మడి వ్యూహం ఉందన్నది స్పష్టమే’’ అని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బంగ్లాదేశ్: కొన్ని గంటల్లో ఎన్నికలు.. పోలింగ్ బూత్‌లు, స్కూళ్లకు నిప్పు
ఢాకా: బంగ్లాదేశ్‌లో జనవరి 7(ఆదివారం) రోజు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేస్తున్నారు. పోలింగ్‌కు ఒకరోజు ముందు బంగ్లాదేశ్‌లో ఆందోళనకరమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలింగ్ అధికారులు ఏర్పాటు చేసిన నాలుగు పోలింగ్ కేంద్రాలు, ఐదు స్కూల్స్‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దేశ రాజధాని ఢాకా శివారు ప్రాంతాలు, ఘాజీపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిప్రమాద ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం జరగబోయే సార్వత్రిక ఎన్నికల విఘాతం కలిగించాలనే లక్ష్యంతో గుర్తు తెలియని దుండుగులు పొలింగ్ బూత్‌లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాము ఈ ఘటనను పరిశీలించామని, పూర్తిగా అప్రమత్తతతో ఉన్నామని ఘాజీపూర్ పోలీసు ఉన్నతాధికారి ఖాజీ షఫీకుల్ ఆలం తెలిపారు. దీనికంటే ముందు ఓ రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకొని మృతి చెందారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్రగాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే మరోవైపు దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (BNP) వరుసగా మూడోసారి బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రధానమంత్రి షేక్ హసీనా ఈసారి కూడా తన అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు పోలింగ్ అనే సమయంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలు తీవ్ర ఉద్రిక్తతతలకు దారితీస్తోంది. ఇక.. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. చదవండి: బంగ్లా సుస్థిరత కొనసాగేనా? -
బంగ్లా సుస్థిరత కొనసాగేనా?
భారత్‌కు సన్నిహిత పొరుగుదేశం, నమ్మదగిన భాగస్వామి అయిన బంగ్లాదేశ్‌లో జనవరి 7న ఎన్నికలు జరగనున్నాయి. 2009 నుంచి దేశ ప్రధానిగా అప్రతిహతంగా కొనసాగుతున్న షేక్ హసీనా ఈసారి కూడా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. అయితే, ఎన్నికలు స్వేచ్ఛగా జరగడం లేదనీ, హసీనా ఇటీవలి సంవత్సరాలలో నియంతగా మారిందనీ ఆమె విమర్శకులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ఆమె పదవీకాలం బంగ్లాదేశ్‌లో రాజకీయ సుస్థిరతను తెచ్చిపెట్టింది. గత దశాబ్దంలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. గడచిన 20 ఏళ్లలో 2.5 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడినట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. జనవరి 7న బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. పాలక అవామీ లీగ్ అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని చూస్తోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఎన్నికలను బహిష్కరించడం వల్ల ఈ పని మరింత సులభమవుతోంది. స్వతంత్ర అభ్యర్థులతో పాటు కొన్ని చిన్న, పెద్దగా పేరులేని రాజకీయ పార్టీలు అధికార పక్షానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నప్పటికీ, అవి పెద్ద సవాలుగా మారే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి అఖండ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే, బీఎన్ పీ ఈ ఎన్నికలలో పాల్గొనక పోవడం అనేది అవామీ లీగ్ సాధించనున్న విజయంలోని ఆకర్షణను అయితే కచ్చితంగా తగ్గిస్తుంది. బేగమ్‌ల పోరు బంగ్లాదేశీయులు దేశ పితామహుడిగా భావించే షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె అయిన షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. సైనిక నియంత జియావుర్ రెహమాన్ భార్య ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సారథ్యం వహిస్తు న్నారు. ఈ ఇద్దరు మహిళలను బంగ్లాదేశ్‌లోని పరస్పరం పోరాడు తున్న బేగమ్‌లు (‘బ్యాట్లింగ్ బేగమ్స్’) అని కూడా పిలుస్తారు. బంగ్లాదేశ్‌లో 1990లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ తర్వాత జరి గిన తొలి మూడు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వంతులవారీగా అధికారంలో ఉన్నాయి. అయితే 2009 నుంచి దేశానికి హసీనా సారథ్యం వహిస్తున్నారు. గత దశాబ్దపున్నర కాలంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగలేదని విమర్శకులు ఆరోపించారు. 2014 ఎన్నికలను బహిష్కరించడం బీఎన్ పీ చేసిన తప్పిదమనీ, అవామీ లీగ్ భారీ మెజారిటీతో అధికారాన్ని నిలుపుకోవడానికి అది వీలు కల్పించిందనీ కొందరు అంటున్నారు. ఈ నిర్ణయం బీఎన్ పీనీ, దాని అగ్రనేతలనూ పార్లమెంటుకు చాలాకాలం పాటు దూరంగా ఉంచింది. ఖలీదా, తారిఖ్ రెహమాన్ (ఖలీదా కుమారుడు, రాజకీయ వారసుడు) సహా చాలా మంది నాయకులు అవినీతి కేసుల్లో చిక్కు కోవడంతో పార్టీ మరింత అపఖ్యాతి పాలైంది. వారి అక్రమాలకు సంబంధించి విచారణ జరిపి వారికి శిక్ష విధించారు. రెహమాన్ బంగ్లాదేశ్ రాజకీయాలతో సంబంధం లేకుండా లండన్‌లో ఉంటు న్నారు. ఖలీదా గృహనిర్భంధంలో ఉన్నారు; పైగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆమె తన పార్టీ రాజకీయ అదృష్టాన్ని పునరుద్ధరించడం కష్టమైపోయింది. మునుపటి ఎన్నికలకు ముందు బీఎన్ పీ హింసాత్మక చర్యల్లో పాల్గొంది. ఇది బీఎన్ పీకి చెందిన మరికొందరు అగ్రనేతలను విచారించే అవకాశాన్ని కూడా అవామీ లీగ్‌కు ఇచ్చింది. ఫలితంగా పార్టీ ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది. అవామీ లీగ్‌ను ఏ విధంగానూ ఎదుర్కొనే స్థితిలో లేదు. ఆపద్ధర్మం స్థానంలో... బీఎన్ పీ కూటమి కీలక భాగస్వామి అయిన బంగ్లాదేశ్ జమాత్– ఎ–ఇస్లామీని ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించారు. పార్లమెంటరీ చట్టాలపై తమకు నమ్మకం లేదనీ, ఇస్లామిక్ చట్టం, పాలనకు మాత్రమే కట్టుబడి ఉన్నామనీ ఆ పార్టీ పదేపదే ప్రకటించింది. దీంతో బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం జమాత్ పార్టీ రిజిస్ట్రేషన్ ని రద్దు చేసింది. హసీనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన యుద్ధ నేరాల విచారణ నేపథ్యంలో జమాతే ఇస్లామీ అగ్రనేతలకు ఉరిశిక్షలు పడ్డాయి. దాంతో పార్టీ మరింత నష్టపోయింది. సార్వత్రిక ఎన్నికలను తటస్థ మధ్యంతర ప్రభుత్వం నిర్వహించాలని బీఎన్ పీ డిమాండ్ చేస్తోంది. హసీనా ప్రభుత్వం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించదని ఆ పార్టీ భయపడుతోంది. అయితే ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించడం లేదు. 2018 ఎన్నికలలో పాల్గొనడం ద్వారా తాము తప్పు చేశామని బీఎన్ పీ ఇప్పుడు నమ్ముతోంది. 2011లో 15వ రాజ్యాంగ సవరణ ద్వారా తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటును అవామీ లీగ్ ప్రభుత్వం తొలగించింది. అంతకు ముందు ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన పార్టీకి అధికారాన్ని అప్పగించేది. ఏది ఏమైనప్పటికీ, తాత్కాలిక ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు (2007–09) కొనసాగింది, సాధారణ ప్రభుత్వం వలె పనిచేయడమే కాకుండా దాని అధికార పరిధికి మించిన అనేక చర్యలు కూడా తీసుకుంది. అలాగే హసీనా, ఖలీదాలను కూడా విచారించింది. స్పష్టంగా, ఆపద్ధర్మ ప్రభుత్వం తప్పు చేయలేని వ్యవస్థ అయితే కాదు. అందుకే బంగ్లాదేశ్ ఇతర ప్రజా స్వామ్య దేశాలలో మాదిరిగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించగల సంస్థలతో ముందుకు రావాలి. నిశ్శబ్ద విజయాలు ఉన్నప్పటికీ... షేక్ హసీనా ఇటీవలి సంవత్సరాలలో నియంతగా మారిందని ఆమె విమర్శకులు ఆరోపిస్తుండగా, ఆమె పదవీకాలం బంగ్లాదేశ్‌లో రాజకీయ సుస్థిరతను తెచ్చిపెట్టిందన్నది మరో నిజం. ఇది బంగ్లాదేశ్‌కూ, దాని ప్రజలకూ ప్రయోజనకరంగా నిరూపితమైంది. దేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని చవిచూస్తోంది. దక్షిణాసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో బంగ్లాదేశ్ ఒకటి. గత దశాబ్దంలో దాని తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. గత 20 ఏళ్లలో 2.5 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడినట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అనేక ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా హసీనా ప్రభుత్వం అమలు చేసింది. దేశ సొంత ఆర్థిక వనరులు, రుణాలు, అభివృద్ధి సహాయాల కలయికతో, కీలకమైన 2.9 బిలియన్ డాలర్ల పద్మ వంతెనను గంగానదిపై నిర్మించారు. ఈ వంతెన ఒక్కటే దేశ జీడీపీని 1.23 శాతం పెంచడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. ఈ విజయాలు ఉన్నప్పటికీ, కోవిడ్ –19 మహమ్మారి నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. నవంబరులో ద్రవ్యోల్బణం 9.5 శాతానికి చేరుకోవడంతో పెరుగుతున్న జీవన వ్యయంతో దేశం పోరాడుతోంది. విదేశీ మారక నిల్వలు ఆగస్టు 2021లో రికార్డు స్థాయిలో 48 బిలియన్ల డాలర్ల నుండి ఇప్పుడు దాదాపు 20 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇవి మూడు నెలల దిగుమతులకు కూడా సరిపోవు. అదనంగా, దాని విదేశీ రుణం 2016 నుండి రెట్టింపు అయింది. అయితే, భారతదేశం అవసరమైన వస్తువులను సరఫరా చేయడం ద్వారా బంగ్లాదేశ్‌కు సహాయం చేసింది. దశాబ్దపున్నర కాలంగా బంగ్లాదేశ్‌లో ఉన్న రాజకీయ సుస్థిరత ఆర్థికాభివృద్ధికి కారణమైందనడంలో సందేహం లేదు. భారతదేశం, బంగ్లాదేశ్ ఇప్పుడు మరింతగా ఎక్కువ స్థాయి విశ్వాసాన్ని కలిగివున్న భాగస్వామ్య పక్షాలు. దీని ఫలితంగా ఇరు దేశాల మధ్య మెరుగైన రైలు కనెక్టివిటీ, ద్వైపాక్షిక వాణిజ్యం ఏర్పడింది. అయితే, చైనా నేతృత్వంలోని అంతర్జాతీయ వాణిజ్య కూటమి, రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో బంగ్లాదేశ్ ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో పొరుగుదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలపై భారత్‌ను జాగ్రత్తగా నడుచుకునేలా చేసింది. భారతదేశం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించాక పరిస్థితులు తనకు అనుకూలంగా పని చేస్తాయని ఆశిస్తోంది. ఆనంద్ కుమార్ వ్యాసకర్త అసోసియేట్ ఫెలో, మనోహర్ పారీకర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలిసెస్, న్యూఢిల్లీ -
రేపటి బంగ్లా ఎన్నికలపై భారత దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఆదివారం నాడు జరుగుతున్న ఎన్నికలు ఆ దేశానికే కాకుండా భారత దేశానికి కూడా ముఖ్యమైనవే. 1971లో విమోచన యుద్ధం ద్వారా స్వాతంత్య్ర దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి బంగ్లాదేశ్‌కు సహజమైన మిత్ర దేశంగా ఉంటున్న భారత్‌కు మధ్య బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆర్థిక రంగంలో సాధించిన పురోగతి, సుస్థిరత రాజకీయ రంగంలో సాధించకపోవడం మాత్రం విచారకరమైన విషయమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటికి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే కాకుండా అట్టడుగు స్థాయిలో ఉండింది. గడిచిన దశాబ్దం నుంచి ఆ దేశం ఏటా ఆరు శాతానికిపైనే జీడీపీ వృద్ధి రేటును సాధిస్తూ వచ్చింది. 2017–18 సంవత్సరంలో ఏకంగా 7.86 శాతం వృద్ధి రేటును సాధించింది. బంగ్లా వస్త్ర వ్యాపారంలో ప్రపంచంలోనే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. చైనా తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రెండో దేశంగా కూడా గుర్తింపు పొందింది. ఒకప్పుడు వెనకబడిన దేశంగా బంగ్లాదేశ్‌ను పేర్కొన్న ఐక్యరాజ్య సమితి ఇప్పుడు దాన్ని అభివృద్ధి చెందుతున్న వర్ధమాన దేశంగా వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్ తనకు అవసరమైన సరుకులను ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్న విదేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. దక్షిణాసియాలోనే భారత్‌కు బంగ్లా అతిపెద్ద వ్యాపార భాగస్వామి. ఇరు దేశాల మధ్య నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ప్రజాస్వామ్యం అంతంత మాత్రమే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాలుగేళ్లకే దేశ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్‌ను హత్య చేసి సైన్యం అధికారంలోకి వచ్చింది. చాలాకాలం పాటు సైనిక నియంత పాలనే కొనసాగింది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా కృషి చేయలేదు. గత పార్లమెంట్ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (ఇస్లాం పార్టీ) బహిష్కరించడంతో పాలకపక్ష అవామీ లీగ్ పార్టీ ఎలాంటి పోటీ లేకుండా సగానికి పైగా పార్లమెంట్ సీట్లను గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో 38 శాతం పోలింగ్ నమోదయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించుకుంది. అయితే వాస్తవానికి 22 శాతం మాత్రమే పోలింగ్ జరిగినట్లు స్వతంత్ర వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా ఎవరి మధ్య పోటీ దేశానికి స్వాతంత్య్ర లభించినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో ప్రధానంగా రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటోంది. వాటిలో ప్రధానమైనది దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అవామీ లీగ్. సెక్యులర్ పార్టీగా గుర్తింపు పొందిన ఈ పార్టీకే మైనారీటీలైన హిందువులు, మెజారిటీలయిన బౌద్ధులు ఓటు వేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ పార్టీకి గట్టి పోటీ ఇస్తూ వస్తున్నది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఇస్లాం సిద్ధాంతాన్ని నమ్ముకున్న ఈ పార్టీ గత ఎన్నికలను బహిష్కరించడం వల్ల వరుసగా పదేళ్లపాటు షేక్ హసీనా నాయకత్వాన ఆవామీ లీగ్ పార్టీయే అధికారంలో ఉంది. ఈ కారణంగా కూడా ప్రజల్లో ఆమె పట్ల వ్యతిరేకత పెరిగింది. ప్రజాస్వామ్య పద్ధతులను తుంగలో తొక్కి ఆమె అణచివేత రాజకీయాలకు పాల్పడుతోందన్న విమర్శలు కూడా ఎక్కువే ఉన్నాయి. మాదక ద్రవ్యాలు, అవినీతిపై యుద్ధం పేరిట ఆమె తన రాజకీయ ప్రత్యర్థులందరిని దాదాపుగా మట్టుబెట్టారు.ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ ఖలేదా జియాను అవినీతి ఆరోపణలపై జైలుకు పంపించారు. ఆ కారణంగా ప్రస్తుత ఎన్నికల్లో ఆమె పోటీ చేయడానికి వీల్లేకుండా పోయింది. తన ప్రభుత్వాన్ని విమర్శించినందుకు దేశంలో మంచి గుర్తింపున్న మీడియా ఫొటోగ్రాఫర్ షాహిదుల్ ఆలంను కూడా కటకటాల వెనక్కి నెట్టారు. భారత్ మద్దతు ఎవరికి ? బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆది నుంచి అవామీ లీగ్‌కే భారత్ లోపాయికారిగా మద్దతిస్తుండగా 2014 ఎన్నికల నుంచి బహిరంగంగా మద్దతివ్వడం ప్రారంభించింది. ఈ కారణంగానే షేక్ హసీనాతో భారత మైత్రి బలపడుతూ వచ్చింది. ఫలితంగా 2015లో ఇరు దేశాల మధ్య రెండు ప్రధాన ఒప్పందాలు కుదిరాయి. ఒకటి భూ సరిహద్దుకు సంబంధించిన ఒప్పందం కాగా, మరోటి అక్కడి భూభాగం మీది నుంచి పనిచేస్తున్న ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం’ లాంటి భారత ఈశాన్య రాష్ట్రాల మిలిటెంట్ సంస్థలను సమూలంగా నిర్మూలించడం. ఈ రెండో ఒప్పందం కారణంగానే రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్ సైనికులు ఇచ్చిన సమాచారం మేరకు భారత సైనికులు బంగ్లా సరిహద్దుల్లోకి చొచ్చుకుపోయి అస్సాం మిలిటెంట్ నాయకులను కాల్చి వేశారు. ఈసారి కూడా అవామీ లీగ్‌కే భారత ప్రభుత్వం మద్దతిస్తోంది. ఇంతకీ ఎవరిదీ గెలుపు? షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ను గట్టిగా ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ ఈసారి 20 చిన్నా, చితక పార్టీలను కలుపుకొని ‘జాతీయ ఐక్య సంఘటన’ పేరిట పోటీకి రంగంలోకి దిగింది. ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత కూడా తమకు కలసి వస్తోందని జాతీయ ఐక్య సంఘటన భావిస్తోంది. ఈసారి ఇరు పక్షాల మధ్య పోటీ బలంగా ఉంటుందని, ఏ పక్షమైనా గెలవచ్చని ముందస్తు ఎన్నికల సర్వేలు సూచిస్తున్నాయి. అయితే ఈసారి కూడా ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగే అవకాశం లేనందున అవామీ లీగ్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీడియా భావిస్తోంది. ఎన్నికల కమిషన్, పోలీసులు ప్రభుత్వం చేతుల్లో కీలు బొమ్మలయ్యాయని ప్రతిపక్ష అభ్యర్థులను అన్యాయంగా అభియోగాలు మోపి అరెస్ట్ చేయిస్తున్నారని ప్రతిపక్షం నాయకులు ఆరోపిస్తున్నారు. కేసులు, అరెస్ట్‌కారణంగా 17 పార్లమెంట్ సీట్లలో ప్రతిపక్షానికి అభ్యర్థులు లేకుండా పోయారు. పోలింగ్ కేంద్రాల్లో ఫొటోలు గానీ వీడియోలుగానీ తీయరాదంటూ మీడియాపై ఆంక్షలు విధించినందున రిగ్గింగ్ జరిగే అవకాశం ఎక్కువ ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. -
సుప్రీంకోర్టుకు మాజీ ప్రధాని
ఢాకా: తనపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్పర్సన్ ఖలీద జియా బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు చెందిన స్వచ్ఛంద సంస్థ జియా చారిటబుల్ ట్రస్ట్ నిధుల విషయంలో లంఛాలకు పాల్పడినట్లు చేస్తున్న కేసుపై స్టే విధించాలంటూ ఆమె రెండు పిటిషన్లు వేశారు. అంతకుముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో ఆమె ఉన్నత న్యాయస్థానం ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై వచ్చే వారం విచారణ జరగనుంది. కోట్లలో ఆమె అవినీతికి పాల్పడినట్లు యాంటి కరప్షన్ కమిషన్(ఏసీసీ) 2010లో కేసు నమోదుచేసింది.