రాజ్యాధికారంతోనే సామాజిక న్యాయం
రాజ్యాధికారంతోనే సామాజిక న్యాయం
Published Mon, Oct 21 2013 12:35 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నంత కాలం శాంతిభద్రతలు, భూములు, ఆదాయం వంటివాటిలో తమకూ వాటా ఉండాల్సిందేనని సీమాంధ్ర నేతలు డిమాండ్ చేశారు. రాజధానిగా 5 లేదా 10 ఏళ్లున్నా అధికారాల విభజనకు అంగీకరించేది లేదని తెలంగాణ నేతలు స్పష్టం చేశారు. ‘రెండు రాష్ట్రాలు-సామాజిక దృక్పథం’ పేరిట తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్(టీఆర్‌ఎల్‌డీ), తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టఫ్) సంయుక్తంగా ఆదివారం హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్, టఫ్ కన్వీనర్ విమలక్క సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ సదస్సులో లోక్‌సత్తా అధ్యక్షులు కఠారి శ్రీనివాసరావు, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, సీమాంధ్ర బీసీ జేఏసీ వేల్పూరి శ్రీనివాసరావు, బీజేపీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీలు కె.ఆర్.ఆమోస్, పూల రవీందర్, ప్రొఫెసర్లు కేశవరావు జాదవ్, పి.ఎల్.విశ్వేశ్వర్‌రావు, లక్ష్మణ్, టీఆర్‌ఎల్‌డీ అధ్యక్షులు కె.ఇందిర, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షులు కప్పర ప్రసాదరావు, టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు చింత స్వామిమాదిగ, టీఆర్‌ఎల్‌డీ నేతలు సి.హెచ్.శేషగిరిరావు, రియాజ్, ప్రముఖ కవి గూడ అంజన్న, శ్రీధర్ ధర్మాసనం తదితరులు ప్రసంగించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ రాజ్యాధికారంలో వాటా లేకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదన్నారు.
బీసీలకూ సబ్‌ప్లాన్‌ను, చట్టసభల్లో రిజర్వేషన్లను అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్ మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపిక నుండి అమలుదాకా అగ్రవర్ణాలే అధిపత్యం వహిస్తున్నాయని, రాజకీయ చైతన్యంతోనే రాజ్యాధికారం వస్తుందన్నారు. తెలంగాణ ఆగదని, సమగ్ర అభివృద్ధి పైనే దృష్టి కేంద్రీకరించి పనిచేయాలని సూచించారు. లోక్‌సత్తా అధ్యక్షులు కఠారి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యావకాశాలు పెరిగితేనే చైతన్యం, తద్వారా రాజకీయాధికారం, సామాజికన్యాయం సాధ్యమన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ విద్యావకాశాలను పెంచి, మానవ వనరుల్లో నాణ్యతను పెంచాలని సూచించారు. ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం శాంతి భద్రతలు, భూములు, ఆదాయం వంటివాటిలో సీమాంధ్రకూ హక్కుంటే తప్ప సీమాంధ్రలో ఉద్యమాలు ఆగవన్నారు. సీమాంధ్ర రాజధానిలో మౌలిక సదుపాయాలకోసం కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వమే అదనపు నిధులను కేటాయించాలని కోరారు. తెలంగాణకు వ్యతిరేకం కాదని, అభద్రతా భావాన్ని పోగొట్టే బాధ్యతను తీసుకోవాలని సూచించారు.
సీమాంధ్ర బీసీ జేఏసీ అధ్యక్షులు వేల్పూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, దోపిడీకి అలవాటు పడిన సీమాంధ్ర సంపన్నులు, పెట్టుబడిదారులు తప్ప తెలంగాణ ఏర్పాటుకు సామాజిక వర్గాలు వ్యతిరేకంగా లేవన్నారు. ఎమ్మెల్సీ, టఫ్ సెక్రటరీ జనరల్ కె.దిలీప్‌కుమార్ మాట్లాడుతూ, హైదరాబాద్ శాంతిభద్రతలు, భూములు, ఆదాయాల్లో హక్కులు పంచుతామంటే తెలంగాణ ప్రజలు అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. విభజనకు ముందుగానే నదీజలాల పంపకంపై స్పష్టమైన, నిర్దిష్టమైన ఒప్పందాలు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు అన్యాయం జరుగకుండా చూడాల్సిన బాధ్యత అటు ఆంధ్రాపై, ఇటు తెలంగాణపై ఉమ్మడిగా ఉందన్నారు. అదనపు ఉద్యోగాల విషయంలో కేంద్ర ప్రభుత్వమే సూపర్ న్యూమరరీ పోస్టులుగా గుర్తించాలని దిలీప్‌కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని దొరల తెలంగాణ కాకుండా రాష్ట్ర విభజనకు ముందే సామాజిక వాటాను కూడా ప్రకటించాలని కోరారు. తెలంగాణ ఏర్పాటు ఆగదని, అప్పటిదాకా ఉద్యమకారులు కొంత సంయమనంతో ఉండాలని కోరారు. కేంద్ర మంత్రివర్గ బృందాన్ని కలసి ఇరుప్రాంతాల మధ్య ఉన్న భయాందోళనలను తొలగించాలని కోరినట్టుగా దిలీప్‌కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, కవి గూడ అంజన్న, ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్‌ను దిలీప్‌కుమార్, విమలక్క సన్మానించారు.
కేసీఆర్ ఫాంహౌస్‌లో భారీ బంకర్ : చింతా స్వామిమాదిగ
మెదక్ జిల్లాలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో బంకర్‌ను నిర్మించుకుంటున్నారని టీఆర్‌ఎస్ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు చింతా స్వామిమాదిగ వెల్లడించారు. ఫాంహౌస్‌లో ఎకరం విస్తీర్ణానికి పైగా భారీగా బావిని తవ్వినట్టుగా ఒక పత్రికలోనూ వచ్చిందని గుర్తుచేశారు. వ్యవసాయ బావి అయితే ఒక ఎకరం విస్తీర్ణంలో ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌కు ఆనుకుని 40 ఎకరాలతో ప్రారంభమైన ఈ ఫాంహౌస్ చుట్టుపక్కల పేదలను బెదిరిస్తూ ఆక్రమించి, బలవంతంగా అమ్మించి ఇప్పుడు వందల ఎకరాలకు చేరుకున్నదని స్వామి ఆరోపించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో తెలంగాణకు కేంద్రంగా చేయాలని కుట్రలు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో పద్మనాభస్వామి ఆలయపు అనుభవాలను గుర్తుచేసుకోవాల్సి ఉంటుందని స్వామి అన్నారు.
Advertisement
Advertisement