చిరంజీవికి 'షాక్ ట్రీట్మెంట్' ఇచ్చిన వైద్యులు
తిరుపతి : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి వైద్యులు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. చిరంజీవికి .... షాక్ ట్రీట్మెంట్ ఏంటా అనుకుంటున్నారా? అసలు విషయంలోకి వెళితే సమైక్యాంధ్రకు మద్దతుగా 23 రోజులుగా ఆందోళన చేస్తున్న తిరుపతి రుయా వైద్యులు, విద్యార్థులు శుక్రవారం వినూత్నంగా తమ నిరసన తెలిపారు. సీమాంధ్ర నాయకుల మాస్క్లు ధరించిన వ్యక్తులకు ట్రీట్మెంట్ ఇచ్చి జై సమైక్యాంధ్ర అనిపించారు.
పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మానవ హారంగా ఏర్పడి.... అనంతరం సోనియాగాంధీ, చంద్రబాబునాయుడు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, కేసీఆర్ తదితరుల మాస్క్లు వేసుకున్న వ్యక్తులకు ట్రీట్మెంట్ చేశారు. గత నెల రోజులకు పైగా సీమాంధ్రలో ప్రజలు ఉద్యమాలు చేస్తున్నా... నేతలు మాత్రం పట్టించుకోవటం లేదని ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ నిరసన ద్వారా నేతల మానసిక స్థితిలో మార్పు రావాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. రాజకీయ నేతలు కూడా ఉద్యమంలోకి వస్తేనే ఫలితం ఉంటుందని అన్నారు. కొంతమంది నేతలు గోడమీద పిల్లిలా డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే ఉద్దేశ్యంతోనే నిరసన కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు.