పరిష్కారం దొరికే వరకూ ముందుకెళ్లొద్దు!
పరిష్కారం దొరికే వరకూ ముందుకెళ్లొద్దు!
Published Wed, Sep 4 2013 2:36 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
రాష్ట్ర విభజనతో ముడివడి ఉన్న సమస్యలను పరిశీలించి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటైన రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ కమిటీ సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ ప్రభుత్వ స్థాయిలో అధికారికంగా విభజన ప్రక్రియను నిలుపు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. మంగళవారం రాత్రి ఢిల్లీలో ముందుగా సీఎం కిరణ్, ఆ తర్వాత సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఆంటోనీ కమిటీతో సమావేశమయ్యారు. కమిటీ అధ్యక్షుడు ఎ.కె.ఆంటోనీ, సభ్యులైన దిగ్విజయ్‌సింగ్, పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్‌లతో పాటు మంగళవారంనాటి సమావేశానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ కూడా ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయ్యారు.
సీఎం 45 నిమిషాలపాటు, తర్వాత మంత్రులు, ఎంపీలు గంటపాటు ఈ కమిటీతో భేటీ అయ్యారు. విభజన నిర్ణయంతో తలెత్తే సమస్యలను పరిష్కరించే ప్రయత్నం పూర్తికాకుండానే సీడబ్ల్యూసీ నిర్ణయంతో ముందుకెళ్తున్నామంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పదేపదే చేస్తున్న ప్రకటనలపై, తెలంగాణ ఏర్పాటుపై హోంశాఖ కేబినెట్ నోట్ సిద్ధమవుతోందని హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే చేసిన ప్రకటనపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తంచేసినట్లు తెలిసింది. రాష్ట్ర విభజనతో తలెత్తే సమస్యలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సంతృప్తి కలిగించేలా పరిష్కరించకుండా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలనే అధిష్టానం భావిస్తే ఏ ప్రాంతానికీ ఎలాంటి ప్రయోజనం చేకూరకపోగా మరిన్ని సమస్యలు తలెత్తటం ఖాయమని, రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవటం తధ్యమనే వాదననే మరోసారి వినిపించినట్లు చెప్తున్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యలను సంతృప్తికరమైన పరిష్కారాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నామన్న కమిటీ సభ్యులు ప్రత్యామ్నాయ పరిష్కారమార్గాలతో సహకరించాలని సీమాంధ్ర నేతలను కోరినట్లు తెలిసింది. హైదరాబాద్ నగరాన్ని రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్నంత మాత్రాన, పదేళ్ల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా లేదా శాంతిభద్రతలను కేంద్రానికి అప్పిగించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాబోదని సీఎం పేర్కొన్నట్లు సమాచారం.
ఇదిలావుంటే.. విభజన అంశాన్ని చర్చించనున్న రాష్ట్ర శాసనసభ తెలంగాణ ఏర్పాటును అంగీకరిస్తూ తీర్మానాన్ని ఆమోదించటం రాజ్యాంగపరంగా తప్పనిసరి కాకపోయినా అసెంబ్లీ తిరస్కరించకుండా ఉండే విధంగా తీర్మానం ఉంటుందని, రాజధాని విషయంలో, అలాగే, ఇతర కీలక సమస్యల విషయంలో కూడా ఏ ప్రాంత ప్రజలు అసంతృప్తికి గురికాకుండా అసెంబ్లీ ఆమోదించనున్న తీర్మానం ఉంటుందని ఆంటోనీ పార్టీ నేతలతో పేర్కొన్నట్లు తెలిసింది.
చెప్పటమే మా ధర్మం: పల్లంరాజు
రాష్ట్ర విభజన నిర్ణయం మంచిది కాదని ఎంతగా మొత్తుకుంటున్నా అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం విభజన ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కనిపిస్తుండటంతో.. మరోసారి సీమాంధ్ర ప్రజల మనోభావాలను, సీమాంధ్రలో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితుల తీవ్రతను వివరించటం కోసమే తాము ఆంటోనీ కమిటీని కలిశామని సమావేశానంతరం కేంద్రమంత్రి పల్లంరాజు విలేకరులతో పేర్కొన్నారు. విభజనతో తలెత్తే సమస్యలను ఎవరికీ ఎలాంటి నష్టం లేకుండా తేల్చిన తర్వాతే అధికారిక ప్రక్రియతో ముందుకెళ్లాలని డిమాండ్ చేశామని వివరించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా అంచనావేసేందుకు రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా కమిటీని కోరామని తెలిపారు. ‘ఈ భేటీలో మీకు కొత్తగా లభించిన హామీ ఏమిటి?’ అన్న ప్రశ్నకు.. వాస్తవాలను వివరించటం మాత్రమే తమ కర్తవ్యమని, విభజన నిర్ణయాన్ని మార్చుకోకపోతే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ అన్ని ప్రాంతాల్లోనూ తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరించామని ఆయన బదులిచ్చారు.
పల్లంరాజుతో పాటు కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, దగ్గుబాటి పురందేశ్వరి, జె.డి.శీలం, కిల్లి కృపారాణి, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, చిరంజీవి, పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణకుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాయపాటి సాంబశివరావు, జి.వి.హర్షకుమార్, కనుమూరి బాపిపాజు తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలు కమిటీకి వివరించారని సమావేశానంతరం దిగ్విజయ్‌సింగ్ మీడియాతో చెప్పారు. విభజనతో ముడివడివున్న సమస్యలపై వారితో చర్చలు కొనసాగుతాయన్నారు.
Advertisement
Advertisement