AK Antony Committee
-
ఆంటోనీ కమిటీ అటకెక్కిందా!?
రాష్ట్ర విభజనకు సంబంధించి సీమాంధ్ర ప్రజల భయాందోళనలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ ప్రస్తుతం ఏం చేస్తోంది? తాజా పరిణామాలు గమనిస్తుంటే ఆ కమిటీ ‘పని’ ముగిసినట్లే కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత సీమాంధ్రుల సమస్యల్ని తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాలు చూపేందుకు పార్టీ సీనియర్ నేత, రక్షణ మంత్రి ఆంటోనీ నేతృత్వంలో పార్టీ స్థాయిలో ఒక కమిటీని కాంగ్రెస్ నియమించింది. అందులో పార్టీ సీనియర్ నేతలు వీరప్పమొయిలీ, దిగ్విజయ్‌సింగ్, అహ్మద్‌పటేల్‌లను సభ్యులుగా నియమించింది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతో సీమాంధ్రుల సమస్యలపై స్పందించేందుకు ప్రభుత్వ స్థాయిలో మంత్రుల బృందాన్ని (జీఓఎం) నియమించారు. జీఓఎంలో ఆంటోనీ, వీరప్పమొయిలీలకూ చోటిచ్చారు. దాంతో ప్రస్తుతం ఆంటోనీ కమిటీ పరిస్థితి ప్రశ్నార్థకమైంది. నిజానికి ఆంటోనీ కమిటీ సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన కొందరు నేతలతో పలుసార్లు సమావేశమైంది. కానీ ఆ తరువాత ఆంటోనీ ఆరోగ్యం క్షీణించడంతో కమిటీ పని కుంటుపడింది. దాదాపు నెలరోజులు ఆంటోనీ ఆస్పత్రిలో ఉన్నారు. ఇటీవలే మళ్లీ విధుల్లో చేరారు. ఈ లోపు జీఓఎం ఏర్పాటైంది. ‘ప్రస్తుతం ఆంటోనీ కమిటీ పరిస్థితేంటో నాకు తెలియదు. అందులో సభ్యులమైన నేను, ఆంటోనీ ఇప్పుడు జీఓఎంలో ఉన్నాం’ అని వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. ఆంటోనీ కమిటీ ప్రభుత్వానికి మధ్యంతర నివేదికేమీ ఇవ్వలేదని మొయిలీ స్పష్టంచేశారు. -
పరిష్కారం దొరికే వరకూ ముందుకెళ్లొద్దు!
-
పరిష్కారం దొరికే వరకూ ముందుకెళ్లొద్దు!
రాష్ట్ర విభజనతో ముడివడి ఉన్న సమస్యలను పరిశీలించి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటైన రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ కమిటీ సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ ప్రభుత్వ స్థాయిలో అధికారికంగా విభజన ప్రక్రియను నిలుపు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. మంగళవారం రాత్రి ఢిల్లీలో ముందుగా సీఎం కిరణ్, ఆ తర్వాత సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఆంటోనీ కమిటీతో సమావేశమయ్యారు. కమిటీ అధ్యక్షుడు ఎ.కె.ఆంటోనీ, సభ్యులైన దిగ్విజయ్‌సింగ్, పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్‌లతో పాటు మంగళవారంనాటి సమావేశానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ కూడా ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయ్యారు. సీఎం 45 నిమిషాలపాటు, తర్వాత మంత్రులు, ఎంపీలు గంటపాటు ఈ కమిటీతో భేటీ అయ్యారు. విభజన నిర్ణయంతో తలెత్తే సమస్యలను పరిష్కరించే ప్రయత్నం పూర్తికాకుండానే సీడబ్ల్యూసీ నిర్ణయంతో ముందుకెళ్తున్నామంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ పదేపదే చేస్తున్న ప్రకటనలపై, తెలంగాణ ఏర్పాటుపై హోంశాఖ కేబినెట్ నోట్ సిద్ధమవుతోందని హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే చేసిన ప్రకటనపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తంచేసినట్లు తెలిసింది. రాష్ట్ర విభజనతో తలెత్తే సమస్యలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సంతృప్తి కలిగించేలా పరిష్కరించకుండా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలనే అధిష్టానం భావిస్తే ఏ ప్రాంతానికీ ఎలాంటి ప్రయోజనం చేకూరకపోగా మరిన్ని సమస్యలు తలెత్తటం ఖాయమని, రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవటం తధ్యమనే వాదననే మరోసారి వినిపించినట్లు చెప్తున్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యలను సంతృప్తికరమైన పరిష్కారాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నామన్న కమిటీ సభ్యులు ప్రత్యామ్నాయ పరిష్కారమార్గాలతో సహకరించాలని సీమాంధ్ర నేతలను కోరినట్లు తెలిసింది. హైదరాబాద్ నగరాన్ని రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్నంత మాత్రాన, పదేళ్ల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా లేదా శాంతిభద్రతలను కేంద్రానికి అప్పిగించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాబోదని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలావుంటే.. విభజన అంశాన్ని చర్చించనున్న రాష్ట్ర శాసనసభ తెలంగాణ ఏర్పాటును అంగీకరిస్తూ తీర్మానాన్ని ఆమోదించటం రాజ్యాంగపరంగా తప్పనిసరి కాకపోయినా అసెంబ్లీ తిరస్కరించకుండా ఉండే విధంగా తీర్మానం ఉంటుందని, రాజధాని విషయంలో, అలాగే, ఇతర కీలక సమస్యల విషయంలో కూడా ఏ ప్రాంత ప్రజలు అసంతృప్తికి గురికాకుండా అసెంబ్లీ ఆమోదించనున్న తీర్మానం ఉంటుందని ఆంటోనీ పార్టీ నేతలతో పేర్కొన్నట్లు తెలిసింది. చెప్పటమే మా ధర్మం: పల్లంరాజు రాష్ట్ర విభజన నిర్ణయం మంచిది కాదని ఎంతగా మొత్తుకుంటున్నా అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం విభజన ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కనిపిస్తుండటంతో.. మరోసారి సీమాంధ్ర ప్రజల మనోభావాలను, సీమాంధ్రలో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితుల తీవ్రతను వివరించటం కోసమే తాము ఆంటోనీ కమిటీని కలిశామని సమావేశానంతరం కేంద్రమంత్రి పల్లంరాజు విలేకరులతో పేర్కొన్నారు. విభజనతో తలెత్తే సమస్యలను ఎవరికీ ఎలాంటి నష్టం లేకుండా తేల్చిన తర్వాతే అధికారిక ప్రక్రియతో ముందుకెళ్లాలని డిమాండ్ చేశామని వివరించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా అంచనావేసేందుకు రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా కమిటీని కోరామని తెలిపారు. ‘ఈ భేటీలో మీకు కొత్తగా లభించిన హామీ ఏమిటి?’ అన్న ప్రశ్నకు.. వాస్తవాలను వివరించటం మాత్రమే తమ కర్తవ్యమని, విభజన నిర్ణయాన్ని మార్చుకోకపోతే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ అన్ని ప్రాంతాల్లోనూ తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరించామని ఆయన బదులిచ్చారు. పల్లంరాజుతో పాటు కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, దగ్గుబాటి పురందేశ్వరి, జె.డి.శీలం, కిల్లి కృపారాణి, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, చిరంజీవి, పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణకుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాయపాటి సాంబశివరావు, జి.వి.హర్షకుమార్, కనుమూరి బాపిపాజు తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలు కమిటీకి వివరించారని సమావేశానంతరం దిగ్విజయ్‌సింగ్ మీడియాతో చెప్పారు. విభజనతో ముడివడివున్న సమస్యలపై వారితో చర్చలు కొనసాగుతాయన్నారు. -
'సీమాంధ్ర ప్రజల డిమాండ్ ను ఆంటోని కమిటీకి వివరించాం'
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం అనంతరం చోటుచేసుకున్న పరిస్థితులను వివరించడానికి ఆంటోని కమిటీతో సీమాంధ్ర నేతలు భేటి అయ్యారు. ఈ భేటిలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం కేంద్రమంత్రి పళ్లంరాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను ఆంటోని కమిటీకి వివరించామని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని.. అదే విషయాన్ని వివరించామన్నారు. మా ప్రాంతంలో నెలకొన్న భావాలు, నెలకొన్న పరిస్థితులను అర్ధం చేసుకోవాలని కోరామని వెల్లడించారు. సీమాంధ్ర ప్రజల భావాల్ని అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నామన్నారు. ఆంటోని కమిటీపై నమ్మకం ఉంది అని అన్నారు. ఆంటోని కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సీమాంధ్ర ప్రజలు అనుకుంటున్నారని తెలిపామన్నారు. రాష్ట్రం విడిపోతే కాంగ్రెస్ కు నష్టం వాటిల్లుతుందని ఆంటోని కమిటీకి తెలిపామని పళ్లం రాజు మీడియాతో అన్నారు. అంతకుముందు ఆంటోని కమిటితో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. -
సీమాంధ్రులను రెచ్చగొట్టొద్దు
తెలంగాణ ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశం ఘర్షణ వాతావరణానికి తెలంగాణ ఎంపీలు, మంత్రుల వ్యాఖ్యలే కారణమని భావన పార్టీ వార్‌రూమ్‌లో టీ కాంగ్రెస్ నేతలతో ఆంటోనీ కమిటీ భేటీ తెలంగాణ ఉద్యమకారులు సంయమనం పాటించేలా చూడాలని సూచన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఉద్యమాన్ని ఎక్కువ చేసి చూపుతున్నారన్న తెలంగాణ ఎంపీలు, మంత్రులు వారి మాటలు నమ్మవద్దని వినతి.. విభజన త్వరగా పూర్తయితే గొడవలే ఉండవని స్పష్టీకరణ తెలంగాణ నేతల మాటలతో ఏకీభవించని అధిష్టానం.. రెచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దని మరోసారి ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోనున్నామని విశ్వసిస్తున్న సీమాంధ్ర ప్రజలను మరింత భయభ్రాంతులను చేసేలా వ్యవహరించవద్దని, వారిని రెచ్చగొట్టే విధంగా ఎలాంటి ప్రకటనలూ చేయవద్దని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులను పార్టీ అధిష్టానం ఆదేశించింది. విభజన నిర్ణయం వెలువడిన తర్వాత గత కొద్దిరోజులుగా రాజధాని హైదరాబాద్‌లో వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో చోటుచేసుకొన్న హింసాయుత సంఘటనలు, నెలకొంటున్న ఘర్షణ వాతావరణానికి తెలంగాణ నేతల రెచ్చగొట్టే ప్రకటనలే కారణమని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులను మంగళవారం ఆంటోనీ కమిటీతో సమావేశానికి ఆహ్వానించింది. పార్టీ వార్ రూమ్‌లో జరిగిన ఈ సమావేశంలో.. తెలంగాణ ఉద్యమకారులంతా సంయమనం పాటించేలా చూడాల్సిన బాధ్యతను అధిష్టానం ఆ ప్రాంత నాయకులపై పెట్టింది. ఇప్పటికే ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంతో ప్రజాజీవనం దాదాపుగా స్తంభించిపోయిన నేపథ్యంలో సీమాంధ్రుల సమస్యల పరిష్కారానికి అధిష్టానం ప్రారంభించిన సంప్రదింపుల ప్రక్రియకు రాజధానిలో నెలకొంటున్న ఘర్షణ వాతావరణం అవరోధంగా నిలిచే ప్రమాదముందని కమిటీ సభ్యులు తెలంగాణ నేతలను హెచ్చరించినట్లు సమాచారం. ఇలాగైతే ఎలా? సోమవారంనాడు కమిటీతో సమావేశమైన సీమాంధ్ర కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు తమ దృష్టికి తెచ్చిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ ఆంటోనీ కమిటీ ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ పూర్తి సంయమనంతో వ్యవహరించాలని తెలంగాణ నేతలకు అధిష్టానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో చోటుచేసుకొన్న సంఘటనలు, దేవాదాయ శాఖ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఘర్షణ, సీమాంధ్ర న్యాయవాదుల సమావేశంపై తెలంగాణ న్యాయవాదుల దాడి, తిరుపతి పర్యటనలో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై దాడికి దారితీసేలా ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు మంగళవారంనాటి సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే, సీమాంధ్ర నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమైనవని, సమైక్యాంధ్ర ఉద్యమ తీవ్రతను కూడా వారు భూతద్దంలో చూపుతున్నారంటూ తెలంగాణ నేతలు వాటిని తిరస్కరించినట్లు తెలియవచ్చింది. హైదరాబాద్‌లో తమకు భద్రత లేదంటూ లేనిపోని ఆరోపణలు చేసేందుకే అక్కడి సంఘటనలను వారు అతిగా చిత్రిస్తూ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నారని సీమాంధ్ర నేతలపై ప్రత్యారోపణలు చేసినట్లు సమాచారం. తిరుపతిలో వీహెచ్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి వెనకేసుకురాగా, హైదరాబాద్‌లో సీమాంధ్ర సోదరులకు ఎలాంటి రక్షణ సమస్యలు ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకొనే బాధ్యతను తాము తీసుకొంటామని మరో మంత్రి సర్వే సత్యనారాయణ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సత్వరమే ప్రక్రియ పూర్తి చేయండి.. సీమాంధ్ర నేతల నుంచి ఇలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అధికారిక ంగా ప్రభుత్వ స్థాయిలో సత్వరమే చేపట్టి పూర్తి చేయాలని కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు కమిటీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ శాంతి నెలకొంటుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకొన్నా ప్రభుత్వపరంగా విభజన ప్రక్రియ ఇంతవరకూ ప్రారంభం కాకపోవడంతో తెలంగాణ ప్రజల్లో కూడా అనుమానాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నిర్ణయం చేయాలని కోరారు. కమిటీ చైర్మన్ , రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ, సభ్యులు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, పార్టీ అధ్యక్షురాలి రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ పాల్గొన్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణలతో పాటు ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ గౌడ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఆనందభాస్కర్, ఎం.ఎ.ఖాన్, వి.హనుమంతరావు, సురేష్ షేట్కర్ హాజరయ్యారు. అయితే, తెలంగాణ ప్రజాప్రతినిధుల వాదనలతో ఏకీభవించని ఆంటోనీ కమిటీ సభ్యులు ఇకపై కాంగ్రెస్ నేతలెవరైనా కవ్వింపు ధోరణితో ఎలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. సోనియాకు పవర్ ఆఫ్ అటార్నీ:సర్వే రాష్ట్ర విభజన తర్వాత తమకు భద్రత ఉండదని రాజధానిలోని సీమాంధ్రవాసులు భయపడనవసరం లేదని, వారి భయాందోళనలను తొలగించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఆంటోనీ కమిటీతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికలలోగా తెలంగాణ రాాష్ట్రం ఏర్పడడం ఖాయమని, వచ్చే సార్వత్రిక ఎన్నికలు రెండు రాష్ట్రాలలో విడివిడిగానే జరుగుతాయని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించిన తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తమకు పూర్తి న్యాయం చేస్తుందన్న విశ్వాసం ఉందన్న ఆయన తమ ప్రాంత ప్రజల భవిష్యత్తును ఆమె చేతుల్లో పెడుతూ పూర్తి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చామని అన్నారు. కేవలం తెలంగాణ, ఆంధ్ర ప్రజానీకానికే కాకుండా సోనియా గాంధీ దేశ ప్రజలందరికీ న్యాయం చేస్తారని చెప్పారు. ఆలస్యమైతే సమస్యలు పెరుగుతాయి: కోమటిరెడ్డి హైదరాబాద్‌లో, తెలంగాణలో సీమాంధ్ర ప్రజలకు రక్షణ లేదనే ఆరోపణ ల్లో ఎలాంటి వాస్తవం లేదని, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు రాజధానిలో స్థిరనివాసం ఏర్పరుచుకొని ప్రశాంతంగా జీవిస్తుండగా సీమాంధ్ర ప్రజలకు మాత్రమే ముప్పు ఎందుకు ఎదురవుతుందని ఎంపీ కోమటిరెడి రాజగోపాలరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ప్రక్రియ అమలు ఆలస్యమైనకొద్దీ ఇలాంటి అనేక కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్రులు క వ్వించినా రెచ్చిపోవద్దు: పొన్నం సీమాంధ్ర ప్రజలు, ఏపీ ఎన్జీవోలు, సీమాంధ్ర న్యాయవాదులు అంతా తమకు పెద్దన్నల వంటి వారేనని, వారు హైదరాబాద్‌లో శాంతి, భద్రతలకు విఘాతం కలుగకుండా పరిమితులకు లోబడి తమ ఆకాంక్షలను వ్యక్తం చేసుకొంటే అభ్యంతరం లేదని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే, సీమాంధ్రులు కవ్వించినా, తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ఓడిస్తామన్నా నమ్మవద్దని, విడిపోవాల్సి వస్తున్నదన్న బాధతో వారు చేసే ప్రకటనలు, చర్యలను సద్భావంతో అర్థం చేసుకొని ఓపికగా వ్యవహరించాలని ఆయన తెలంగాణ ప్రాంత జేఏసీలు, ప్రజా సంఘాలను కోరారు. ఒంగోలులో కరీంనగర్ జిల్లాకు చెందిన డీఈఓపై జరిగిన దాడి, ఏపీఎస్ఈబీలో సంతోష్ అనే కాంట్రాక్టు కార్మికునిపై జరిగిన దాడిని కమిటీ దృష్టికి తీసుకెళ్లామని, అలాగే, సీమాంధ్ర నేతల ఫిర్యాదులను ప్రస్తావిస్తూ కమిటీ సభ్యులు తమకు చెప్పిన అంశాలను కూడా తెలంగాణ జేఏసీ, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలకు చేరవేస్తామని ప్రభాకర్ తెలిపారు. రెండు ప్రాంతాల ప్రజలు సామరస్యంగా విడిపోవడం అందరికీ మంచిదన్న ఆయన సీమాంధ్ర నేతలు తమ ప్రాంతాలలో పార్టీని కాపాడుకొనేందుకు చేసే ప్రయత్నాలకు తాము కూడా సహకరిస్తామని అన్నారు. అయితే, సీమాంధ్ర ఉద్యమంలో జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేసినా అక్కడి కాంగ్రెస్ నేతలు క నీసం ఖండించలేదని ఆయన తప్పుబట్టారు. -
కార్టూన్
ఏ నెల ముప్పయ్యో చెప్పమని అడుగుతున్నార్సార్! -
20న ఆంటోనీ కమిటీ వద్దకు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు
ఈ నెల 20న ఢిల్లీకి వెళ్లి ఆంటోని కమీటీని కలవాలని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితరులతో వారి సమావేశం ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. 20న 10మంది సభ్యులు ఢిల్లీకి వెళ్లి సమైక్యవాదం వినిపించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై హైకమాండ్ వెనక్కి తగ్గదని పీసీసీ చీఫ్ బొత్స ఈ సందర్భంగా నేతలకు చెప్పారు. సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి ఆంటోనీ కమిటీ ముందుకెళ్లాలని ఆయన సూచించారు. అయితే... రాష్ట్ర విభజన అనివార్యమైతే అసలీ సమావేశం పెట్టడం ఎందుకని కొంతమంది ఎమ్మెల్యేలు బొత్సను నిలదీసినట్లు తెలిసింది. హైదరాబాద్, నదీజలాలు, కొత్త రాజధాని ఏర్పాటు లాంటి అంశాలు తేలాలి కదా అని బొత్స సత్యనారాయణ వారితో అన్నారని సమాచారం. కానీ.. ఎమ్మెల్మేలు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. విభజన అనివార్యమైతే తమ దారి తాము చూసుకుంటామని కొందరు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని ఆంటోని కమిటీ ముందు కూడా తెగేసి చెబుతామని కుండ బద్దలు కొట్టారు. హైకమాండ్ సూచన మేరకే తాము కూడా ఈ విషయాలు చెబుతున్నామని బొత్స వారికి తెలిపారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. రాజీనామా దిశగా సీమాంధ్ర కేంద్ర మంత్రుల్ని ఒప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సమావేశాలు తర్వాత ఆంటోని కమిటీని సీమాంధ్రలో పర్యటించాలని కోరనున్నట్లు వారు చెప్పారు. -
ఆంటోని కమిటీని బహిష్కరించండి: చక్రవర్తి
రాష్ట్ర విభజనపై ఏర్పాటు అయిన కేంద్ర రక్షణ మంత్రి ఆంటోని నేతృత్వంలోని కమిటీని బహిష్కరించాలని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు చక్రవర్తి సీమాంధ్రవాసులను పిలుపునిచ్చారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. ఈ నెల 16 నుంచి విశాలాంధ్ర మహాసభ సమైక్యత యాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆ యాత్ర ఈ నెల 25న కడపలో ముగుస్తుందన్నారు. అలాగే శ్రీకాకుళం నుంచి రెండో విడద సమైక్యత యాత్రను కూడా త్వరలో ప్రారంభం అవుతుందని చెప్పారు. అయితే ఈ నెల 18న న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సమైక్యవాదులు ధర్నా నిర్వహిస్తున్నారని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు చక్రవర్తి తెలిపారు. -
ఆంటోని కమిటీని కలవనున్న టీ.మంత్రులు
-
మీరే ఢిల్లీకొచ్చి చెప్పుకోండి
* ఆంటోనీ కమిటీ హైదరాబాద్ రాదని స్పష్టం చేసిన దిగ్విజయ్ సింగ్ * సీనియర్ మంత్రులంతా పార్లమెంటు సమావేశాల్లో బిజీ * అందువల్ల ఇక్కడే సమావేశమయ్యాం * ఆంటోనీ కమిటీ కసరత్తు షురూ.. పార్టీ వార్ రూంలో తొలి భేటీ * ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం ఉండబోదని దిగ్విజయ్ సంకేతాలు * కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసుకుని రాష్ట్రపతికి తెలపడం ద్వారా విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని యోచన సాక్షి, న్యూఢిల్లీ: ‘‘సీనియర్ మంత్రులంతా పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉన్నారు. అందువల్ల ఆంటోనీ కమిటీ హైదరాబాద్ వెళ్లడం వీలుకాదు’’ అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో కమిటీలోని తాము నలుగురం ప్రైవేట్‌గా సమావేశమయ్యామని, అవసరమైతే సమాచారం ఇవ్వడానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను పిలిచామని వివరించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను వినేందుకు కాంగ్రెస్.. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ మంగళవారం రాత్రి సమావేశమైంది. కీలక అంశాలపై సమాలోచనలు జరిపే పార్టీ వార్ రూమ్‌లో కమిటీ తొలిసారిగా భేటీ అయింది. అందులో పాల్గొన్న అనంతరం దిగ్విజయ్ విలేకరులతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ‘‘రేపు, ఎల్లుండి కూడా మేం సమావేశమవుతాం. దీనికి కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులను ఆహ్వానిస్తున్నాం. ఆ తర్వాత 19, 20తేదీల్లోనూ భేటీ అవుతాం’’ అని వివరించారు. ఆంటోనీ కమిటీకి తమ సమస్యలు తెలపాలని అనుకుంటున్నవారు.. ముందుగా పీసీసీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వాలని, దాన్నిబట్టి కమిటీతో వారి సమావేశాల షెడ్యూలును తాము ఖరారు చేస్తామని తెలిపారు. అందర్నీ సంప్రదించాకే నిర్ణయం రాష్ట్రంలోని అన్ని పార్టీలనూ సంప్రదించాక వారి నుంచి 100 శాతం ఏకాభిప్రాయం వ్యక్తమయ్యాకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకున్నామని దిగ్విజయ్ చెప్పారు. కానీ ఇప్పుడు పార్లమెంటులో టీడీపీ ఎంపీలు, ఇతర పార్టీల ఎంపీలు అవలంబిస్తున్న వైఖరి దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అందర్నీ సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నామని, ఇక ఆ నిర్ణయానికి లోబడే పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ప్రక్రియ పూర్తయిపోయింది టోనీ కమిటీ పార్టీ వేసిన కమిటీ కదా.. అందరూ ప్రభుత్వ కమిటీ వేయాలని కోరుతున్నారు కదా అని విలేకరులు అడగ్గా.. ‘‘మాది రాజకీయ పార్టీ. మేం మొదటగా మా పార్టీ నాయకులతోపాటు, ప్రజల ఆందోళనలను పరిష్కరించాల్సి ఉంది. మిగతా రాజకీయ పార్టీలన్నీ.. ప్రణబ్ ముఖర్జీ కమిటీ ముందు, సుశీల్ కుమార్ షిండే ముందు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశాయి. అంగీకారం తెలిపాయి. అక్కడితో ప్రభుత్వం తన ప్రక్రియను పూర్తి చేసింది. ఒక రాజకీయ పార్టీగా, కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం ఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించడానికి యత్నించింది’’ అని దిగ్విజయ్ అన్నారు. ఇదంతా ఉపోద్ఘాతం మాత్రమే ‘‘అసెంబ్లీలో సంప్రదింపుల ప్రక్రియ మొదలయ్యాక విభజనకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేస్తాం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నదంతా ఆ చర్చల ప్రక్రియకు ఉపోద్ఘాతం మాత్రమే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు తమ ఆందోళనలు చెప్పుకొనేందుకు అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం దొరుకుతుంది. అదేసమయంలో ముసాయిదా బిల్లుపై కామెంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి అవకాశం వస్తుంది. ఆ తర్వాత లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లుపై చర్చ జరిగినపుడు.. అన్ని పార్టీల సభ్యులు తమ వాదన వినిపించడానికి మరోసారి అవకాశం వస్తుంది. అక్కడితో చర్చల ప్రక్రియ ముగుస్తుంది’’ అని ఆంటోనీ చెప్పారు. అసెంబ్లీ తీర్మానం ఉండదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేస్తారని అంటున్నారు కదా పదే పదే అని అడగ్గా.. తీర్మానం ఉండే అవకాశం లేదని దిగ్విజయ్ పరోక్షంగా చెప్పారు. ‘‘నేను పూర్తి అథారిటీతో చెప్తున్నాను.. దయచేసి నాతో వాదించొద్దు. విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుని రాష్ట్రపతికి సమాచారం పంపుతుంది. రాష్ట్రపతి ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపిస్తారు. ఇదీ జరగబోయేది’’ అని ఆయన అన్నారు. ఆంటోనీ కమిటీని ఎవరైనా కలవొచ్చు ఆంటోనీ కమిటీ పార్టీ వేసిన కమిటీ అయినప్పటికీ ఎవరైనా సరే తమ అభిప్రాయాలు తెలపవచ్చని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకులందరూ.. వారు ఏ ప్రాంతంవారైనా సరే. ఎన్జీవోలు, విద్యార్థి విభాగాలు, రాజకీయేతర నాయకులు, వర్తక, వాణిజ్య వర్గాల ప్రతినిధులు, సామాన్య ప్రజలు కూడా వచ్చి ఆంటోనీ కమిటీకి తమ వాదన వినిపించవచ్చు’’ అని స్పష్టంచేశారు. సంప్రదింపుల ప్రక్రియ ఎంత కాలంలో ముగుస్తుందని అడగ్గా.. అన్ని వర్గాల వారూ ఒకే రోజు ఆంటోనీ కమిటీ వద్దకు వచ్చి సమస్యలు తెలిపితే.. ఒకే రోజులో ముగుస్తుందన్నారు. వార్ రూమ్‌లో ఆంటోనీ కమిటీ తొలి భేటీ వార్ రూమ్‌లో జరిగిన ఆంటోనీ కమిటీ భేటీకి కమిటీ సభ్యులు ఆంటోనీతో పాటు కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్‌లు హాజరయ్యారు. వార్ రూమ్‌కి ఆంటోనీ, మొయిలీలు ఎనిమిది గంటలకే చేరుకున్నా, సమావేశం మాత్రం దిగ్విజయ్, అహ్మద్ పటేల్‌లు వచ్చాకే ఎనిమిదిన్నర గంటల సమయంలో ప్రారంభం అయింది. రెండు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. కమిటీ సమావేశం అయిన కొద్దిసేపటికే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణసైతం వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం, అనంతరం ఇరు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై మొదటగా చర్చించారు. ముఖ్యంగా విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలు, ఉద్యోగుల సమ్మె, ప్రజా ప్రతినిధుల రాజీనామాలు, వారు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై చర్చించారు. విభజనకు కాంగ్రెస్ పార్టీనే ముద్దాయిగా చూపేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నం, రాజకీయంగా పార్టీకి జరుగుతున్న నష్టాన్ని ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తి చేసే క్రమంలో ఏయే అంశాలపై దృష్టి సారించాలి, ఎవరెవరిని భాగస్వాములను చేయాలన్న దానిపై వారంతా సమాలోచనలు జరిపినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ ఆదాయ వాటా, వనరుల పంపకం, నదీజలాల పంపిణీ, విద్యుత్ పంపిణీ, విద్యార్థులు, ఉద్యోగులకు భద్రత , వ్యాపారస్తులకు అభయం వంటి అంశాలపై సీమాంధ్రుల నుంచి అభిప్రాయాలను, వాటి పరిష్కారాలను కోరాలని నేతలంతా నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది. అంశాల వారీగా చర్చలు జరపాలా? లేక అన్ని అంశాలపై ఒకేసారి అభిప్రాయాలను వినాలా? అన్నదానిపై ఇంకా వారంతా ఓ అభిప్రాయానికి రానట్లు తెలుస్తోంది. అంశాల వారీ చర్చలు జరిపితే చర్చల ప్రక్రియకు చాలా సమయం పడుతుందన్న భావన నేతల్లో వ్యక్తమయిందని తెలుస్తోంది. ఇక చర్చల ప్రక్రియలో పాల్గొనేందుకు సిద్ధమంటూ పీసీసీకి అర్జీలు పెట్టుకున్న వారి జాబితాను బొత్స దిగ్విజయ్‌కు అందజేశారు. -
13న ఢిల్లీకి సీఎం కిరణ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 13న ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం ఏర్పడిన పరిస్థితులు, ప్రజలు లేవనెత్తుతున్న అభ్యంతరాలను అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోని కమిటీతో ఆయన భేటీ కానున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సైతం ఆరోజు ఆంటోని కమిటీతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం బొత్స ఢిల్లీలోనే ఉన్నారు. ఈనెల 13న ఇరువురు నేతలు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని హైకమాండ్ ఆదేశించిన నేపథ్యంలో ఏకే ఆంటోని కమిటీతో సమావేశమై సీమాంధ్రలో తలెత్తిన పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. సీఎం, పీసీసీ చీఫ్‌లతో సమావేశమైన తరువాతే ఆంటోని కమిటీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నట్లు తెలిసింది. సీమాంధ్ర నేతలు, ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలను ముందే తెలుసుకోవడంతోపాటు వాటిని ఏ విధంగా అధిగమించాలనే అంశంపై చర్చించేందుకే వీరిద్దరితో ఆంటోనీ కమిటీ సమావేశం కానున్నట్లు సమాచారం. ఆంటోని కమిటీతో భేటీ అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, ఇతర పెద్దలను కూడా సీఎం కలవనున్నారు. అపాయింట్మెంట్ లభిస్తే సోనియాగాంధీని కూడా కలిసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆయన సన్నిహితవర్గాలు చెప్పాయి. మరోవైపు సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఒకరోజు ముందే అంటే 12న ఢిల్లీకి చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. 13న రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ధర్నా అనంతరం వీరంతా సీఎం, పీసీసీ చీఫ్‌లతో కలిసి హైకమాండ్ పెద్దల వద్దకు వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వినతి పత్రం అందజేయనున్నారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.బాలరాజు, విశ్వరూప్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కొండ్రు మురళీమోహన్, సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి తదితరులు శనివారం సీఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఢిల్లీ యాత్రపై నిర్ణయానికి రావడంతో పాటు ఆ సమాచారాన్ని ఇతర నేతలకు చేరవేశారు. 12న సాయంత్రానికే అంతా ఢిల్లీ చేరుకోవాలని చెప్పారు. గంటా, ఏరాసు, విశ్వరూప్ శనివారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. -
ఆంటోని కమిటీకి కాలపరిమితి లేదు: దిగ్విజయ్
వచ్చే సోమవారం నుంచి ఏకే ఆంటోనీ కమిటీ తన పని ప్రారంభించే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఆంటోనీ కమిటీని కలిసేవారి జాబితాను సీఎం, పీసీసీ చీఫ్ ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. ఆంటోనీ కమిటీ హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉందన్నారు. ఆంటోనీ కమిటీకి ఎలాంటి కాలపరిమితి లేదని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియకు, ఆంటోనీ కమిటీకి సంబంధం ఉందని స్పష్టం చేశారు. అన్ని విజ్ఞాపనలు పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇస్తుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కమిటీ చర్చిస్తుందని చెప్పారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్రుల అభ్యంతరాలను తెలుసుకునేందుకు ఏకే ఆంటోనీ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. -
ఆంటోనీ కమిటీతో ఒరిగేదేంలేదు: బాలినేని
ఏకే ఆంటోనీ కమిటీతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా సీమాంధ్ర మంత్రులంతా రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా ఒంగోలులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి బాలినేని శ్రీనివాస రెడ్డి పాలాభిషేకం చేశారు. వైఎస్సార్ పేరెత్తే అర్హత సీఎం కిరణ్‌కు లేదన్నారు. వైఎస్సార్ గురించి అసత్యాలు ప్రచారం చేయడం తగదన్నారు. రాష్ట్ర విభజనపై కిరణ్ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉపాధ్యాయ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. -
స్పష్టత ఇచ్చిన తర్వాతే విభజన: సీఎం
-
స్పష్టత ఇచ్చిన తర్వాతే విభజన: సీఎం కిరణ్
రాష్ట్ర విభజనపై అభ్యంతరాలుంటే ఏకే ఆంటోనీ నేతృత్వంలోని ఉన్నతస్థాయికి చెప్పాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏకే ఆంటోనీ కమిటీని హైదరాబాద్‌కు ఆహ్వానించి అభ్యంతరాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తామని ఆయన హామీయిచ్చారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తర్వాత తొలిసారిగా సీఎం కిరణ్ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. సమ్మెకు దిగొద్దని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. సమ్మె నోటీసులు వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె చేపడితే రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుందన్నారు. సీమాంధ్ర ఉద్యమంలో జాతీయ నాయకుల విగ్రహాల కూల్చివేతను సీఎం ఖండించారు. రాజకీయ లబ్ది కోసమే విగ్రహాల ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. విధ్వంసాలకు పాల్పడే వారిపై కఠిన వైఖరి అవలంభిస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతల విషయంలో తమ ప్రభుత్వం కచ్చితంగా, కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రం కలిసివుండాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. సీడబ్ల్యూసీ ప్రకటనను వ్యతిరేకించడం లేదు, స్వాగతించడం లేదన్నారు. పార్టీ వరకు మాత్రమే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. విభజన నిర్ణయం ఇంకా కాంగ్రెస్ పార్టీ వద్దే ఉందన్నారు. రాష్ట్ర విభజనపై మిగతా పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. సీపీఎం, ఎంఐఎం మాత్రమే రాష్ట్ర విభజనను వ్యతిరేకించాయని వెల్లడించారు. విభజిస్తే జలవివాదాలు పెరుగుతాయన్నారు. ఉద్యమాల కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే తెలంగాణకు విద్యుత్ సమస్య ఎదురవుతుందని తెలిపారు. 610 జీవో విషయంలో అస్యతాలు ప్రచారం చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే నిర్ణయం తీసుకుందని అన్ని అంశాలను చర్చించాల్సిన అవసరం కేంద్రానికి ఉందన్నారు. ఆ తర్వాతే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని సీఎం అభిప్రాయపడ్డారు.