మీరే ఢిల్లీకొచ్చి చెప్పుకోండి | Ak Antony Committee not coming to hyderabad: Digvijay Singh | Sakshi
Sakshi News home page

మీరే ఢిల్లీకొచ్చి చెప్పుకోండి

Published Wed, Aug 14 2013 2:38 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

మీరే ఢిల్లీకొచ్చి చెప్పుకోండి - Sakshi

మీరే ఢిల్లీకొచ్చి చెప్పుకోండి

* ఆంటోనీ కమిటీ హైదరాబాద్ రాదని స్పష్టం చేసిన దిగ్విజయ్ సింగ్
సీనియర్ మంత్రులంతా పార్లమెంటు సమావేశాల్లో బిజీ
అందువల్ల ఇక్కడే సమావేశమయ్యాం
ఆంటోనీ కమిటీ కసరత్తు షురూ..  పార్టీ వార్ రూంలో తొలి భేటీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం ఉండబోదని దిగ్విజయ్ సంకేతాలు
కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని రాష్ట్రపతికి తెలపడం ద్వారా విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని యోచన
 
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘సీనియర్ మంత్రులంతా పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉన్నారు. అందువల్ల ఆంటోనీ కమిటీ హైదరాబాద్ వెళ్లడం వీలుకాదు’’ అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో కమిటీలోని తాము నలుగురం ప్రైవేట్‌గా సమావేశమయ్యామని, అవసరమైతే సమాచారం ఇవ్వడానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను పిలిచామని వివరించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను వినేందుకు కాంగ్రెస్.. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ మంగళవారం రాత్రి సమావేశమైంది.

కీలక అంశాలపై సమాలోచనలు జరిపే పార్టీ వార్ రూమ్‌లో కమిటీ తొలిసారిగా భేటీ అయింది. అందులో పాల్గొన్న అనంతరం దిగ్విజయ్ విలేకరులతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ‘‘రేపు, ఎల్లుండి కూడా మేం సమావేశమవుతాం. దీనికి కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులను ఆహ్వానిస్తున్నాం. ఆ తర్వాత 19, 20తేదీల్లోనూ భేటీ అవుతాం’’ అని వివరించారు. ఆంటోనీ కమిటీకి తమ సమస్యలు తెలపాలని అనుకుంటున్నవారు.. ముందుగా పీసీసీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వాలని, దాన్నిబట్టి కమిటీతో వారి సమావేశాల షెడ్యూలును తాము ఖరారు చేస్తామని తెలిపారు.

అందర్నీ సంప్రదించాకే నిర్ణయం
రాష్ట్రంలోని అన్ని పార్టీలనూ సంప్రదించాక వారి నుంచి 100 శాతం ఏకాభిప్రాయం వ్యక్తమయ్యాకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకున్నామని దిగ్విజయ్ చెప్పారు. కానీ ఇప్పుడు పార్లమెంటులో టీడీపీ ఎంపీలు, ఇతర పార్టీల ఎంపీలు అవలంబిస్తున్న వైఖరి దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అందర్నీ సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నామని, ఇక ఆ నిర్ణయానికి లోబడే పని చేయాల్సి ఉంటుందని చెప్పారు.
 

ప్రభుత్వ ప్రక్రియ పూర్తయిపోయింది
టోనీ కమిటీ పార్టీ వేసిన కమిటీ కదా.. అందరూ ప్రభుత్వ కమిటీ వేయాలని కోరుతున్నారు కదా అని విలేకరులు అడగ్గా.. ‘‘మాది రాజకీయ పార్టీ. మేం మొదటగా మా పార్టీ నాయకులతోపాటు, ప్రజల ఆందోళనలను పరిష్కరించాల్సి ఉంది. మిగతా రాజకీయ పార్టీలన్నీ.. ప్రణబ్ ముఖర్జీ కమిటీ ముందు, సుశీల్ కుమార్ షిండే ముందు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశాయి. అంగీకారం తెలిపాయి. అక్కడితో ప్రభుత్వం తన ప్రక్రియను పూర్తి చేసింది. ఒక రాజకీయ పార్టీగా, కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం ఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించడానికి యత్నించింది’’ అని దిగ్విజయ్ అన్నారు.

ఇదంతా ఉపోద్ఘాతం మాత్రమే
‘‘అసెంబ్లీలో సంప్రదింపుల ప్రక్రియ మొదలయ్యాక విభజనకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేస్తాం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నదంతా ఆ చర్చల ప్రక్రియకు ఉపోద్ఘాతం మాత్రమే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు తమ ఆందోళనలు చెప్పుకొనేందుకు అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం దొరుకుతుంది. అదేసమయంలో ముసాయిదా బిల్లుపై కామెంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి అవకాశం వస్తుంది. ఆ తర్వాత లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లుపై చర్చ జరిగినపుడు.. అన్ని పార్టీల సభ్యులు తమ వాదన వినిపించడానికి మరోసారి అవకాశం వస్తుంది. అక్కడితో చర్చల ప్రక్రియ ముగుస్తుంది’’ అని ఆంటోనీ  చెప్పారు.

అసెంబ్లీ తీర్మానం ఉండదు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేస్తారని అంటున్నారు కదా పదే పదే అని అడగ్గా.. తీర్మానం ఉండే అవకాశం లేదని దిగ్విజయ్ పరోక్షంగా చెప్పారు. ‘‘నేను పూర్తి అథారిటీతో చెప్తున్నాను.. దయచేసి నాతో వాదించొద్దు. విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుని రాష్ట్రపతికి సమాచారం పంపుతుంది. రాష్ట్రపతి ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపిస్తారు. ఇదీ జరగబోయేది’’ అని ఆయన అన్నారు.
 
ఆంటోనీ కమిటీని ఎవరైనా కలవొచ్చు
ఆంటోనీ కమిటీ పార్టీ వేసిన కమిటీ అయినప్పటికీ ఎవరైనా సరే తమ అభిప్రాయాలు తెలపవచ్చని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకులందరూ.. వారు ఏ ప్రాంతంవారైనా సరే. ఎన్‌జీవోలు, విద్యార్థి విభాగాలు, రాజకీయేతర నాయకులు, వర్తక, వాణిజ్య వర్గాల ప్రతినిధులు, సామాన్య ప్రజలు కూడా వచ్చి ఆంటోనీ కమిటీకి తమ వాదన వినిపించవచ్చు’’ అని స్పష్టంచేశారు. సంప్రదింపుల ప్రక్రియ ఎంత కాలంలో ముగుస్తుందని అడగ్గా.. అన్ని వర్గాల వారూ ఒకే రోజు ఆంటోనీ కమిటీ వద్దకు వచ్చి సమస్యలు తెలిపితే.. ఒకే రోజులో ముగుస్తుందన్నారు.
 
వార్ రూమ్‌లో ఆంటోనీ కమిటీ తొలి భేటీ
వార్ రూమ్‌లో జరిగిన ఆంటోనీ కమిటీ భేటీకి కమిటీ సభ్యులు ఆంటోనీతో పాటు కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్‌లు హాజరయ్యారు. వార్ రూమ్‌కి ఆంటోనీ, మొయిలీలు ఎనిమిది గంటలకే చేరుకున్నా, సమావేశం మాత్రం దిగ్విజయ్, అహ్మద్ పటేల్‌లు వచ్చాకే ఎనిమిదిన్నర గంటల సమయంలో ప్రారంభం అయింది. రెండు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. కమిటీ సమావేశం అయిన కొద్దిసేపటికే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణసైతం వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం, అనంతరం ఇరు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై మొదటగా చర్చించారు. ముఖ్యంగా విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలు, ఉద్యోగుల సమ్మె, ప్రజా ప్రతినిధుల రాజీనామాలు, వారు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై చర్చించారు. విభజనకు కాంగ్రెస్ పార్టీనే ముద్దాయిగా చూపేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నం, రాజకీయంగా పార్టీకి జరుగుతున్న నష్టాన్ని ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తి చేసే క్రమంలో ఏయే అంశాలపై దృష్టి సారించాలి, ఎవరెవరిని భాగస్వాములను చేయాలన్న దానిపై వారంతా సమాలోచనలు జరిపినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ ఆదాయ వాటా, వనరుల పంపకం, నదీజలాల పంపిణీ, విద్యుత్ పంపిణీ, విద్యార్థులు, ఉద్యోగులకు భద్రత , వ్యాపారస్తులకు అభయం వంటి అంశాలపై సీమాంధ్రుల నుంచి అభిప్రాయాలను, వాటి పరిష్కారాలను కోరాలని నేతలంతా నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది.

అంశాల వారీగా చర్చలు జరపాలా? లేక అన్ని అంశాలపై ఒకేసారి అభిప్రాయాలను వినాలా? అన్నదానిపై ఇంకా వారంతా ఓ అభిప్రాయానికి రానట్లు తెలుస్తోంది. అంశాల వారీ చర్చలు జరిపితే చర్చల ప్రక్రియకు చాలా సమయం పడుతుందన్న భావన నేతల్లో వ్యక్తమయిందని తెలుస్తోంది. ఇక చర్చల ప్రక్రియలో పాల్గొనేందుకు సిద్ధమంటూ పీసీసీకి అర్జీలు పెట్టుకున్న వారి జాబితాను బొత్స దిగ్విజయ్‌కు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement