విభజనకు సహకరించండి: దిగ్విజయ్ వినతి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థ్ధీకరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందేలా అన్ని పార్టీలు సహకరించాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ విజ్ఞప్తిచే శారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా గతంలో లేఖలిచ్చిన పార్టీలు కూడా ఇందుకు సహకరించాలన్నారు. సవరణలతో కూడిన బిల్లును శుక్రవారం రాత్రి కేంద్ర కేబినెట్ ఆమోదించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘కొన్ని సవరణలతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా’నన్నారు. ‘విభజనపై అధిష్టానంతో విభేదిస్తూ, ధిక్కార వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై పార్టీ చర్యలు తీసుకుంటుందా?’ అన్న ప్రశ్నకు.. ‘నేను ఇంతకుముందే చెప్పాను. రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో క్రమశిక్షణ చర్యలు వంటి కఠిన నిర్ణయాలపై ముందుకు వెళ్లం’ అని స్పష్టం చేశారు. విభజనను వ్యతిరేకిస్తూ సభను అడ్డుకుంటున్న సీమాంధ్ర ఎంపీలపై చర్యలు ఉంటాయా? అన్న ప్రశ్నకు ‘చూద్దాం’ అంటూ బదులిచ్చారు.