
ఆంటోనీ కమిటీతో ఒరిగేదేంలేదు: బాలినేని
ఏకే ఆంటోనీ కమిటీతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా సీమాంధ్ర మంత్రులంతా రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజనకు నిరసనగా ఒంగోలులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి బాలినేని శ్రీనివాస రెడ్డి పాలాభిషేకం చేశారు. వైఎస్సార్ పేరెత్తే అర్హత సీఎం కిరణ్కు లేదన్నారు. వైఎస్సార్ గురించి అసత్యాలు ప్రచారం చేయడం తగదన్నారు. రాష్ట్ర విభజనపై కిరణ్ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉపాధ్యాయ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు.